ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వణికిస్తున్న చాందీపుర వైరస్.. ఒక్క గుజరాత్‌లోనే 16 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Sun, Jul 21, 2024, 11:12 PM

గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఈ చాందీపుర వైరస్ కేసులు వెలుగు చూడటం.. అక్కడి వారిలో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు ఆయా రాష్ట్రాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇక ఈ చాందీపుర వైరస్ కారణంగానే కేవలం గుజరాత్‌ రాష్ట్రవ్యాప్తాగా 16 మరణాలు నమోదు కావడం దేశం మొత్తాన్ని తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది. గుజరాత్‌తోపాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ వ్యాధి ప్రభావం కనిపిస్తోంది.


గుజరాత్‌లో చాందీపుర వైరస్ కారణంగా 16 మంది ప్రాణాలు కోల్పోయారని.. మరో 50 కేసులు నమోదయ్యాయని గుజరాత్ ఆరోగ్య శాఖ మంత్రి హృషికేష్ పటేల్ తాజాగా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే గుజరాత్‌లో వ్యాధి విస్తరణతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ.. పలువురు నిపుణులతో కలిసి గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్, చాందీపుర వైరస్ కేసుల పరిస్థితిని సమీక్షించింది. ఈ చాందీపుర వైరస్ వ్యాప్తి నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం అలర్ట్ అయింది.


జిల్లాల్లో మలాథియాన్ పౌడర్‌ను పిచికారీ చేసేలా ప్రచారం నిర్వహించాలని అధికారులను ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఆదేశించారు. రోగులకు ఎలాంటి జ్వరం వచ్చినా వెంటనే ఇంటెన్సివ్‌ ట్రీట్‌మెంట్‌ అందించాలని సూచించారు. ఈ వైరస్‌ను నివారించేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కింది స్థాయి ఆరోగ్య శాఖ సిబ్బంది చర్యలు తీసుకోవాలని గుజరాత్ ఆరోగ్య మంత్రి హృషికేష్ పటేల్ ఆదేశించారు.


అయితే గుజరాత్‌లో కనుగొన్న ఈ చాందీపుర వైరస్ కేసులపై వివరణాత్మక దర్యాప్తు అవసరమని ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ దర్యాప్తులో గుజరాత్ రాష్ట్రానికి సహకరించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ బృందాన్ని రంగంలోకి దింపారు. ఈ చాందీపుర వైరస్ వ్యాప్తి పెరుగుతున్న దృష్ట్యా.. ఆరోగ్య శాఖ బృందాలు మెడికల్ టెస్టులు ప్రారంభించారు. గుజరాత్‌లోని 17248 ఇళ్లలోని 1.22 లక్షల మందిని పరీక్షించాయి. దీంతో ఈ కేసులు వెలుగుచూసినట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మరోవైపు.. రాజస్థాన్‌లో రెండు, మధ్యప్రదేశ్ నుంచి ఒక చాందీపుర వైరస్ కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.


మొట్టమొదట 1966 లో మహారాష్ట్ర నాగ్‌పూర్‌లోని చాందీపూర్ గ్రామంలో 15 ఏళ్లలోపు పిల్లలు చనిపోవడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. దీంతో వైరస్ కారణంగానే చిన్నారులు చనిపోతున్నారని అప్పటి వైద్యులు వెల్లడించారు. దీంతో ఆ వైరస్‌కు చాందీపుర వైరస్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత ఈ వైరస్ 2004 నుంచి 2006, 2019 సంవత్సరాలలో.. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌ లాంటి రాష్ట్రాల్లో వ్యాప్తి చెందింది. చాందీపురా వైరస్ అనేది ఆర్‌ఎన్‌ఏ వైరస్. ఇది ఎక్కువగా ఆడ ఫ్లెబోటోమైన్ అనే దోమ ద్వారా వ్యాపిస్తుంది. దోమలలో కనిపించే ఈడిస్ దోమ దీని వ్యాప్తికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది జూన్ ప్రారంభం నుంచి గుజరాత్‌లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలలో ఈ అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర వర్గాలు వెల్లడించాయి.


చాందీపుర వైరస్ లక్షణాలు


ఈ చాందీపుర వైరస్ సోకిన వారికి జ్వరం, విరేచనాలు ఉంటాయి. ఫ్లూ వంటి లక్షణాలతోపాటు తీవ్రమైన మెదడువాపు వ్యాధి ఉంటుంది. దోమలు, ఈగలు, కీటకాల ద్వారా ఈ చాందీపుర వైరస్ ఇతరులకు వ్యాప్తి చెందుతూ ఉంటుంది. అనేక రకాల వైరస్‌లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, రసాయనాలు, టాక్సిన్‌లు మొదలైన వాటి వల్ల ఈ అక్యూట్ ఎన్సెఫాలిటిస్ సిండ్రోమ్ ఏర్పడుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com