ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జమిలీ ఎన్నికలకు అంత ఖర్చా.. ఈవీఎంలకే ప్రతీ 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 18, 2024, 11:20 PM

ఒకే దేశం ఒకే ఎన్నిక నిర్వహించాలని కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ సర్కార్ ఎప్పటి నుంచో యోచిస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై అధ్యయనం చేయడానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఒకే దేశం ఒకే ఎన్నికల నిర్వహణపై ఆ కమిటీ కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర ఎన్నికల సంఘం.. కేంద్ర ప్రభుత్వానికి తాజాగా ఒక నివేదికను పంపించింది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేస్తే.. ప్రతీ 15 ఏళ్లకు కేవలం ఈవీఎంల కోసమే రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని తెలిపింది.


ఒకే దేశం ఒకే ఎన్నిక విధానానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం.. కేంద్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్‌ పంపించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం.. దేశంలోని లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే.. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (ఈవీఎం) కొనుగోలు చేసేందుకు ప్రతి 15 ఏళ్లకు రూ.10 వేల కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. అయితే ఒకసారి కొనుగోలు చేసిన ఈవీఎంల జీవిత కాలం కేవలం 15 సంవత్సరాలు మాత్రమేనని పేర్కొంది. ఒక సెట్ ఈవీఎంను 3 సార్లు ఎన్నికలు నిర్వహించేందుకు ఉపయోగించవచ్చని స్పష్టం చేసింది.


ఇక ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల కోసం దేశవ్యాప్తంగా సుమారు 11.8 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేసింది. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాల్సి వస్తే ప్రతి పోలింగ్ స్టేషన్‌కు 2 సెట్ల ఈవీఎంలు (ఒకటి లోక్‌సభ, మరొకటి అసెంబ్లీ స్థానానికి) అవసరం అవుతాయని వెల్లడించింది. ఇక పని చేయని ఈవీఎంల స్థానంలో అదనపు ఈవీఎంలతోపాటు ఈవీఎంల సంఖ్యకు అనుగుణంగా కంట్రోల్ యూనిట్లు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్ యంత్రాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుందని ఈసీ స్పష్టం చేసింది.


మరోవైపు.. దేశంలో ఒకేసారి లోక్‌సభకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహిస్తే.. ఈవీఎంలతోపాటు.. 46,75,100 బ్యాలెట్ యూనిట్లు, 33,63,300 కంట్రోల్ యూనిట్లు, 36,62,600 వీవీ ప్యాట్ మెషీన్లు అవసరమవుతాయని ఈసీ తెలిపింది. 2023 నాటి ధరల ప్రకారం ఒక్కో బ్యాలెట్ యూనిట్ ధర రూ. 7,900 కాగా.. కంట్రోల్ యూనిట్ ధర రూ. 9,800 అని.. వీవీ ప్యాట్ ధర యూనిట్‌ రూ. 16 వేలు కలుపుకుని ఒక్కో ఈవీఎం యూనిట్‌ ధర రూ.33,700 గా అంచనా వేసింది.


ఇక ఈవీఎంలతోపాటు అదనపు పోలింగ్‌ బూత్‌ల ఏర్పాటు, భద్రతా సిబ్బంది, ఈవీఎంల భద్రతా స్థలాలు, వాహనాలు కూడా అవసరమని ఈసీ తెలిపింది. ఇవన్నీ పక్కనపెడితే రాజ్యాంగంలోని 5 ఆర్టికల్స్‌ను సవరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ స్థాయిలో ఈవీఎంలను సమకూర్చుకుని.. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుంటేనే 2029 లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించవచ్చని వెల్లడించింది. ఒకే దేశం, ఒకే ఎన్నికకు సంబంధించి న్యాయ మంత్రిత్వ శాఖ అడిగిన ప్రశ్నలకు గతేడాది ఫిబ్రవరిలో ఈ మేరకు ఈసీ నివేదిక ఇచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com