ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మీరు అసలు డాక్టర్లేనా.. కాలుకు చేయాల్సిన సర్జరీ బాలుడి మర్మాంగానికి చేశారు

national |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 10:26 PM

గవర్నమెంట్ హాస్పిటల్‌ డాక్టర్లు చేసిన పనికి.. ఓ బాలుడి పరిస్థితి తీవ్రంగా మారింది. ఆడుకుంటుండగా.. 9 ఏళ్ల బాలుడి కాలుకు గాయం కావడంతో ఆస్పత్రికి వెళ్లగా.. ప్రాణాల మీదికి తెచ్చింది. గాయం కాలుకు అయితే.. ఆ డాక్టర్లు ఆ బాలుడి మర్మాంగానికి సర్జరీ చేయడం ప్రస్తుతం తీవ్ర దుమారానికి కారణం అయింది. మహారాష్ట్రలోని థానేలో జరిగిన ఈ సంఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటన కాస్తా పోలీసులు, ఉన్నతాధికారుల వద్దకు వెళ్లగా.. ఆ డాక్టర్లు తాము చేసిన పనిని సమర్థించుకునే ప్రయత్నాలు చేయడం మరింత తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తోంది.


మహారాష్ట్రలోని థానే జిల్లాలోని షహాపూర్‌ గ్రామానికి చెందిన ఓ 9 ఏళ్ల బాలుడు గత నెలలో తన ఇంటి వద్ద ఫ్రెండ్స్‌తో ఆడుకుంటుండగా.. అతడి కాలుకు గాయం అయింది. మొదట అది చిన్న గాయమే అని వదిలేయగా.. కొన్ని రోజులకు తగ్గకపోవడంతో ఈనెల 15 వ తేదీన స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. అక్కడి డాక్టర్లు చికిత్స చేశారు. బాలుడికి ఆపరేషన్ చేయాలని డాక్టర్లు సూచిండంతో తల్లిదండ్రులు సరే అన్నారు. అయితే ఆ బాలుడికి గాయం అయిన కాలుకు కాకుండా మర్మాంగాలకు ఆపరేషన్ చేశారు. అది గమనించిన బాలుడి తల్లిదండ్రులు.. డాక్టర్లపై సీరియస్ అయ్యారు. దీంతో వెంటనే అలర్ట్ అయిన డాక్టర్లు ఆ బాలుడి కాలుకు కూడా ఆపరేషన్ నిర్వహించారు.


ఈ ఘటన తర్వాత విషయం తెలుసుకున్న బాలుడి తల్లిదండ్రులు.. పోలీసులు, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ విషయం కాస్తా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న థానే ఆరోగ్య శాఖ అధికారులు.. పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు. మరోవైపు పోలీసులు కూడా ఈ ఘటనపై విచారణ చేపట్టారు.


ఈ వ్యవహారంపై థానే జిల్లా సివిల్ సర్జన్‌ డాక్టర్‌ కైలాస్‌ పవార్‌.. విచారణకు ఆదేశించారు. అయితే బాలుడికి కాలుకు గాయంతోపాటు మర్మాంగంలోనూ సమస్య ఉందని.. అందుకే అతనికి రెండు ఆపరేషన్లు చేసినట్లు ఆ ఆస్పత్రి మెడికల్‌ ఆఫీసర్ గజేంద్ర పవార్‌ తెలిపారు. ఈ విషయం ఆపరేషన్‌కు ముందే బాలుడి తల్లిదండ్రులకు చెప్పాలని.. సదరు డాక్టర్లకు చెప్పానని.. అయితే వాళ్లు అది మర్చిపోయి ఉండొచ్చని పేర్కొన్నారు. ఆ బాలుడికి సమస్య ఉండటంతో రెండు ఆపరేషన్లు చేసినా అందులో తప్పేమీ లేదని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. మరోవైపు.. అదే రోజు ఆ బాలుడి వయసున్న మరో ఇద్దరికి కూడా ఇలాంటి సర్జరీలే చేసినట్లు ఆ మెడికల్ ఆఫీసర్ వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com