ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు తమ్ముళ్లకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ శుభవార్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 29, 2024, 08:59 PM

ఆంధ్రప్రదేశ్ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళరి పార్టీ కార్యాలయంలో కార్యక్రమం జరగ్గా.. ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. విద్యాశాఖ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పల్లాను పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చోబెట్టారు. పార్టీ బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాస్ తెలుగు తమ్ముళ్లకు శుభవార్త చెప్పారు. టీడీపీ కార్యకర్తలపై గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని మూడు నెలల్లో తొలగించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే కోర్టుల పరిధిలో ఉన్నా రాజకీయ ప్రేరేపిత కేసుల్ని ఏడాదిలోగా తొలగించేలా చూస్తానన్నారు. తెలుగు దేశం పార్టీకి ప్రభుత్వానికి సంధానకర్తగా వ్యవహరిస్తూ.. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. ఏ సమస్య వచ్చినా పార్టీ కార్యాలయానికి రావాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు.


గత ప్రభుత్వం ఇబ్బందులు పెట్టినా తట్టుకుని ప్రజా సమస్యలపై పోరాడారని గుర్తుచేశారు పల్లా శ్రీనివాసరావు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి నామినేటెడ్‌ పదవులిచ్చి గౌరవిస్తామని చెప్పారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తనను నియమించినందుకు టీడీపీ అధినేత చంద్రబాబుకు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో ఎంతో గురుతర బాధ్యతను అప్పగించారని ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పదవీ బాధ్యతలను నిర్వహిస్తానన్నారు. పవిత్రమైన సంకల్పంతో నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీకి తనను రాష్ట్ర అధ్యక్షులుగా నియమించడం పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను అన్నారు. అధినేత తనకు దిశానిర్ధేం చేసిన విషయాలను తూచ తప్పకుండా..


పార్టీని అధికారంలోకి తీసుకు రావాడనికి ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా... గత ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాటిని ఓర్చుకుంటూ ప్రజా సమస్యలపై పోరాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి అధినాయకుడి ఆదేశాలను ముందుకు తీసుకెళ్తూ కృషి చేసిన కార్యకర్తలను గుర్తించాల్సిన అవసరం ఉంది అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన వ్యవస్థలో నిమగ్నమై నాయకులు కార్యకర్తలను పట్టించుకోవడంలేదన్న ఆలోచన వారిలో ఉందని.. అటువంటి విమర్శకు తావులేకుండా పార్టీని నాయకులును ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ.. 2029 కి ఇదే మెజార్టీతో గెలిచేలా కృషి చేస్తానన్నారు.


'రాష్ట్రంలో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్తకు తెలియజేసేది ఒక్కటే.. మేము అనుక్షణం మీతోనే ఉంటాం.. మీ బాధ్యత మాది అని పల్లా అన్నారు. నేడు ఎంతో మంది కార్యకర్తలు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఏమి ఆశించకుండా పార్టీ కోసం వారి సమయాన్ని చంద్రబాబు సిద్ధాంతాలను ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి కృషిచేశారు. నేను మీకోసమే ఈ పదవిని తీసుకున్న.. కార్యకర్తలకు న్యాయం చేయకుంటే నేను నా పాత్ర సక్రమంగా చేయనట్లు భావిస్తా... ప్రతి నాయకుడికి, ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా... ఏ పని ఉన్నా పార్టీ కార్యాలయానికి వస్తే ఖచ్చితంగా మీ సమస్యకు పరిష్కారానికి కృషి చేస్తా. ప్రతి నాయకుడు కూడా ఆలోచించాలి. అధికారం ఉందని ప్రజాస్వామ్యానికి విఘాతం కలింగించేలా వ్యవహరించకూడదు. మనమందరం ప్రజాస్వామ్యవాదులం. మన మూలాలు ప్రజాస్వామ్యం' అన్నారు పల్లా.


'చట్టాలకు అనుగుణంగా అధికారం దుర్వినియోగం చేసిన వారికి బుద్ధి చెబుతాం. నేడు ప్రజలు చంద్రబాబు నాయుడు యొక్క కష్టాన్ని చూసి యువనాయకుడు లోకేష్ యొక్క యవగళాన్ని చూసి కూటిమిలోని నాయకులు సహాయ సహకారాలు చూసి అధికారం ఇచ్చారు. మనం ఈ ఐదు సంవత్సరాలు అన్ని వర్గాలకు న్యాయం చేసేలా కృషి చేయాలి. ముఖ్యంగా బలహీన వర్గాలను, వెనకబడిన వర్గాలను, అనగారిన వర్గాలను సమసమాజం వైపు నడిపించాల్సిన అవసరం ఉంది. వారికి రాజకీయ ప్రాధాన్యతను కల్పించాల్సిన అవసరం ఉంది. సామాజిక సమతుల్యతను చూసుకుని ముందుకు వెళ్దాం' అన్నారు.


'పార్టీ బలోపేతానికి యువనాయకత్వాన్ని ఆహ్వానించాలి. యువనాయకత్వాన్ని ప్రోత్సహించాలి. మన మనుగడ ఉండాలంటే యువత మనతో అడుగులు వేయాలి. యువతను ఆకర్షించాలి. లోకేష్ బాబు ఆలోచనలను గౌరవించాలి. సీనియర్ నేతలకు సముచిత స్థానం కల్పిస్తూనే యువతను ప్రోత్సహించాలి. యువనాయకత్వం చట్ట సభల గురించి తెలుసుకోవాలి. అన్న ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టాకే బడుగు బలహీన వార్గాలకు రాజకీయ ప్రాధాన్యత దక్కింది. సమసమాజ స్థాపన జరిగింది. గత దుర్మార్గపు పాలనలో రాష్ట్రం చిన్నాభిన్నమైంది. ఈరాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేసుకోవాలి. పోలవరంతోపాటు, అమరావతి, ఆర్థిక రాజధానిగా విశాఖ, రాయలసీమలను అభివృద్ధి చేసుకోవాలి. అధినాయకత్వంతో మమేకమై రాష్ట్రాభివృద్ధికి కృషి చేయాలి' అన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com