ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రంగంలో దూసుకెళ్తున్న ఏపీ.. బెంగాల్‌ను అధిగమించి అగ్రస్థానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 23, 2024, 07:36 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ రంగం దూసుకెళ్తోంది. గత పదేళ్ల కాలంలో ఈ రంగంలో గణనీయమైన పురోగతి కనిపించింది. ఫలితంగా ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్.. పశ్చిమ బెంగాల్‌ను దాటి అగ్రస్థానానికి చేరుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. 2015-16 నాటితో పోలిస్తే 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి ఏపీలో ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఉత్పత్తి భారీగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలు వెల్లడించాయి. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్.. బెంగాల్‌ను దాటేసి అగ్రస్థానానికి చేరుకున్నట్లు తెలిపాయి.


2011-12 నాటికి దేశంలోని ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో ఏపీ వాటా 17.7 శాతంగా ఉండేది. అయితే ఇది 2022-23 ఆర్థిక సంవత్సరం నాటికి 40.9 శాతానికి చేరుకుందని కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఇదే సమయంలో బెంగాల్ వాటా భారీగా తగ్గిపోయినట్లు తెలిపాయి. 2011-12లో 24.6 శాతం వాటా ఉండగా.. 2022-23 నాటికి ఇది 14.4 శాతానికి పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. శాతాల వారీగా కాకుండా డబ్బు రూపంలో చూస్తే ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో ఏపీ వాటా రూ.79,900 కోట్లుగా ఉన్నట్లు కేంద్ర గణాంకాలు తెలిపాయి.


 మరోవైపు ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ రంగంలో తమ రాష్ట్రంలో ఉత్పత్తి పెరుగుతోందని పశ్చిమ బెంగాల్ చెప్తున్నప్పటికీ.. గడిచిన ఆరేళ్ల కాలంలో బెంగాల్ వాటా తగ్గినట్లు కేంద్ర గణాంకాలు పేర్కొన్నాయి. మొత్తం ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో ఏపీ వాటా సుమారుగా 41 శాతం ఉన్నట్లు తెలిపాయి. మరోవైపు మధ్యప్రదేశ్, బిహార్ రాష్ట్రాలు కూడా ఈ రంగంలో తమ ఉత్పత్తిని పెంచుకున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఫిషింగ్ అండ్ ఆక్వాకల్చర్ ఉత్పత్తిలో బెంగాల్ రెండో ప్లేసులో ఉండగా.. మధ్యప్రదేశ్ మూడు, బిహార్ నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపాయి.


మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో పండ్లు, కూరగాయల ఉత్పత్తి కూడా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. 2022-23 సంవత్సరంలో ఈ రంగంలో ఏపీ టాప్ -5 రాష్ట్రాల్లో చోటు దక్కించుకున్నట్లు వెల్లడించాయి. పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో ఏపీ వాటా 2011-12 మధ్య 5.8 శాతంగా ఉండగా .. 2022-23 నాటికి 8.2 శాతానికి పెరిగినట్లు గణాంకాలు పేర్కొన్నాయి. నగదు పరంగా చూస్తే ఈ మొత్తం రూ. 35,800 కోట్లుగా వెల్లడించాయి.


ఇక పాలు, మాంసం, కోడిగుడ్లు వంటి లైవ్ స్టాక్ ఉత్పత్తిలోనూ ఏపీ తన స్థానాన్ని మెరుగుపర్చుకుంది లైవ్‌స్టాక్ రంగంలో ఏపీ నాలుగో స్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఈ రంగంలో పదేళ్ల కిందట 7 శాతం వాటాను కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్.. 2023-23 నాటికి 7.8 శాతం వాటాను కలిగి ఉన్నట్లు పేర్కొన్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com