ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానసిక సమస్యతో,,,బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 29, 2023, 07:00 PM

భార్యాభర్తలు, మూడేళ్ల పాప.. సాఫీగా సాగిపోతున్న జీవితం.. ఇంతలో ఆ కుటుంబంలో పెను విషాదం జరిగింది. విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన అరుణ్‌కుమార్‌, జోజి రాణిలకు 2015 వివాహమైంది. పెళ్లైన ఐదేళ్లకు పాప మేరీ జెస్సీ పుట్టింది.. ఆమె వయస్సు మూడేళ్లు. అప్పటి నుంచి పాపను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ అరుణ్ పనిచేస్తుండగా.. రాణి ఇంటి దగ్గరే ఉంటూ పాపను చూసుకుంటోంది. వీరి ఇంటికి దగ్గరలోనే జోజి రాణి తల్లిదండ్రులు నివాసం ఉంటున్నారు.


చిన్నారి జెస్సీ వాళ్ల అమ్మమ్మ, తాతయ్యల దగ్గర కూడా ఉండేది. కొంతకాలంగా రాణి మానసిక సమస్యతో బాధపడుతోంది. ఆమెకు కొన్నాళ్లుగా నాటు వైద్యం చేయిస్తున్నారు.. కానీ ఆమె పరిస్థితిలో ఏమాత్రం మార్పు రాలేదు. తనకు బతకాలని లేదని.. చనిపోవాలని ఉందని తల్లిదండ్రులకు చెప్పేది. రోజూ మానసికంగా మరింతగా కుంగిపోయేది.. ఆమెను తల్లిదండ్రులు ఎన్నో సందర్భాలు నచ్చజెప్పారు. ఒకవేళ ఏదైనా 'నువ్వు' చనిపోతే పాప పరిస్థితి దారుణంగా ఉంటుందని వారించారు.


గురువారం ఉదయం రాణి రోజూలాగే భర్తకు భోజనం బాక్సు ఇచ్చి ఆఫీసుకు పంపించింది. ఆఫీసుకు వెళ్లిన తర్వాత అరుణ్‌ ఉదయం 10 గంటల సమయంలో భార్య రాణికి ఫోన్‌ చేయగా తీయలేదు.. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా స్పందించకపోవడంతో అనుమానం వచ్చింది. వెంటనే తన బావమరిదికి ఫోన్‌ చేసి ఇంటికి వెళ్లి చూడమనడంతో.. వెళ్లి చూడగా తలుపులు, కిటికీలు అన్నీ మూసివేసి ఉన్నాయి. ఎంతసేపు తలుపు కొట్టినా తీయకపోవడంతో.. రాణి తండ్రి, సోదరుడు కలిసి తలుపులు పగలగొట్టారు. లోపలకు వెళ్లి చూడగా మంచంపై చిన్నారి జెస్సీ, కింద రక్తపు మడుగులో రాణి పడి ఉన్నారు.


కుమార్తె, మనవరాలిని చూసి తండ్రి, సోదరుడు కన్నీళ్లు పెట్టుకున్నారు.వెంటనే పటమట పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాణి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఆత్మహత్య చేసుకునేందుకు నిర్ణయించుకుంది. రాణి, ఛార్జర్‌ వైరుతో చిన్నారి మెడకు బిగించి ఊపిరాడకుండా చేయడంతో చనిపోయింది. ఆమె కూడా కత్తి తీసుకుని మెడపై, ఎడమ మణికట్టుపై లోతుగా కోసుకుంది. ఆమెకు తీవ్ర రక్తస్రావమై చనిపోయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.


ఈ ఘటనపై రాణి తండ్రి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తన అక్క, బావ మధ్య ఎటువంటి గొడవలు లేవని మృతురాలి సోదరుడు చెప్పారు. రాణి మానసికంగా ఇబ్బంది పడి ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని కుటుంబ సభ్యులు అంటున్నారు. అంతేకాదు రాణికి వివాహం కాకముందు నుంచే మానసిక సమస్యలతో ఇబ్బంది పడేదని తెలుస్తోంది. అప్పట్లో ఫినాయిల్‌ తాగడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించడంతో బతికిందట. కానీ ఈసారి మాత్రం ప్రాణాలు కోల్పోయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com