ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇవే బెస్ట్ ఛాయిస్.. ఇలా ప్రతి నెలా చేతికి రూ. లక్ష పెన్షన్

business |  Suryaa Desk  | Published : Sun, Sep 22, 2024, 12:16 AM

మీ వయసు ఎంత.. ఎంత సంపాదిస్తున్నారు. ఏమైనా డబ్బులు కూడబెడుతున్నారా. మీ పిల్లల చదువులు, పెళ్లి ఇతర ఖర్చులకు పోనూ మీరు రిటైర్మెంట్ తర్వాత హాయిగా.. ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉండేందుకు సరిపోతుందా? లేకపోతే ఎలాంటి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా వీటన్నింటిపై అవగాహన ఉండాలి. వయసు మళ్లిన తర్వాత.. సంపాదన లేని సమయంలో.. రిటైర్మెంట్ తర్వాత సీనియర్ సిటిజెన్లు ప్రతి నెలా రూ. లక్ష వరకు పింఛన్ అందుకునేందుకు ఏమైనా అవకాశం ఉంటుందా అంటే ఉంటుందని చెప్పొచ్చు. ఇందుకోసం మీరు కష్టపడి సంపాదించిన డబ్బును.. సరైన పెట్టుబడి పథకాల్లో సరైన ప్రణాళికతో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చాలా విషయాలు గమనించాల్సి ఉంటుంది. అవి ద్రవ్యోల్బణం, రిస్క్ ఫ్యాక్టర్, రిటర్న్స్ ఎంత ఉండొచ్చనే అంచనా, కట్టాల్సిన టాక్స్, పెట్టుబడి ఎంత ఇలా పక్కా ప్లానింగ్‌తో ఉండాలి.


పదవీ విరమణ తర్వాత.. నెలనెలా రూ. లక్ష పెన్షన్ అందుకునేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు వెల్త్ రీడిఫైన్ కో ఫౌండర్ సౌమ్య సర్కార్. ఇక్కడ రిటైర్మెంట్ సమయంలో మీ దగ్గర ఉన్న దాదాపు రూ. 1.2 కోట్ల నుంచి రూ. 1.5 కోట్ల వరకు ఉంటే.. అది సగటున 8 నుంచి 10 శాతం వార్షిక రిటర్న్స్ ఇస్తే సాధ్యమవుతుందని చెబుతున్నారు.


సీనియర్ సిటిజెన్లు ఇన్వెస్ట్ చేసేందుకు ఎన్నో రిస్క్ ఫ్రీ పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు, పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కం స్కీమ్, సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీమ్, ఆర్బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీలు, డెట్ మ్యూచువల్ ఫండ్లు వంటివి ఉన్నాయి. ఎక్కువ రిటర్న్స్ రావాలంటే.. ఎక్కువ రిస్క్ తీస్కొని ఈక్విటీ ఓరియెంటెడ్ మ్యూచువల్ ఫండ్స్ ఎంచుకోవాలి.


ఈ క్రమంలోనే రూ. లక్ష పెన్షన్ వచ్చేందుకు దేంట్లో ఎంత ఇన్వెస్ట్ చేయాలి.. ఎంత రిటర్న్స్ అంచనా వేయాలి వంటి వివరాలు చెప్పారు వాలెట్ వెల్త్ ఎల్ఎల్‌పీ ఫౌండర్ అండ్ సీఈఓ ఎస్. శ్రీధరన్. ఇక్కడ సీనియర్ సిటిజెన్లు సగటున 7.50 శాతం వడ్డీ రేటు అందే ఫిక్స్‌డ్ డిపాజిట్లలో రూ. 25 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. దీంట్లో త్రైమాసికానికి వడ్డీ కింద రూ. 46,875 అందుతుంది. అంటే నెలకు రూ. 15,625 వరకు వస్తుంది. అయితే ఇక్కడ మొత్తం రూ. 25 లక్షలు ఒకే దాంట్లో ఎఫ్డీ చేయొద్దు. ప్రైవేట్, ప్రభుత్వ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో కొంత కొంత పెట్టుబడి పెట్టాలి.


ఇక సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీంలో గరిష్ట పెట్టుబడి అయిన రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ వడ్డీ రేటు 8.20 శాతం చొప్పున.. ప్రతి త్రైమాసికానికి రూ. 61,500 అంటే ప్రతి నెలా రూ. 20,500 అందుకోవచ్చు.


మరోవైపు ఆర్బీఐ సేవింగ్స్ బాండ్లలో ప్రస్తుతం 8.05 శాతం వడ్డీ రేటు ఉంది. ఇక్కడ రూ. 35 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. ప్రతి 6 నెలలకు ఓసారి రూ. 1,40,875 అందుతుంది. అంటే సగటున నెలకు రూ. 23,479 చొప్పున అందుతుంది.


ఇంకా రిస్క్ ఫ్రీ పెట్టుబడుల్లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉంటాయి. ఇక్కడ సీనియర్ సిటిజెన్లు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు. ఇక్కడ దీర్ఘకాలం ఇన్వెస్ట్ చేస్తూ.. సిస్టమేటిక్ విత్‌డ్రాయల్ ప్లాన్ (SWP) ఎంచుకోవాలి. రూ. 30 లక్షలపై.. సగటున వార్షిక ప్రాతిపదికన 6-7 శాతం చొప్పున రిటర్న్స్ అంచనా వేసినా కూడా నెలకు రూ. 16,865 చొప్పున అందుకోవచ్చు. ఇంకా బ్యాలెన్స్‌డ్ హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్లలో కూడా రూ. 30 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే.. 9-11 శాతం సగటు రిటర్న్స్ చొప్పున నెలకు రూ. 23,732 వరకు వస్తుంది. ఇలా మొత్తం రూ. 1.50 కోట్ల పెట్టుబడిపై ప్రతి నెలా రూ. 1,00,201 చొప్పున అందుకోవచ్చన్నమాట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com