ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌లో చుక్కలు చూపిస్తోన్న పెట్రోల్, డీజిల్ ధరలు

international |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 07:42 PM

తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బస్తాలతో సొమ్ము తీసుకెల్తే.. సామాన్లు సంచి కూడా నిండని పరిస్థితి. ఇక, చమురు ధరలు గురించి చెప్పక్కర్లేదు. సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. తాజాగా, పాకిస్థాన్‌లో పెట్రోల్ ధర కొత్త రికార్డు నెలకొల్పింది. పెట్రోల్‌పై లీటరుకు రూ.26.02, డీజిల్‌పై రూ.17.34 పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం రాత్రి వెల్లడించింది. దీంతో చమురు ధరలు లీటరుకు రూ.330కి చేరుకున్నాయి. ఈ స్థాయికి ధరలు పెరగడం ఆ దేశ చరిత్రలో ఇదే మొదటిసారి. గత నెలలోనే పెట్రోల్, డీజిల్ ధర లీటరు రూ.300కు చేరింది.


నెల రోజుల వ్యవధిలోనే ఆపద్ధర్మ ప్రభుత్వం పెట్రోలుపై లీటరుకు రూ.32.41, డీజిల్‌పై రూ.38.49 పెంచడం గమనార్హం. ధరల పెరుగుదలపై భగ్గుమన్న ప్రతిపక్షాలు.. ఆందోళనలకు సిద్ధమయ్యాయి. ధరల పెరుగుదలను సవాల్‌ చేస్తూ లాహోర్‌ హైకోర్టులో ఓ న్యాయవాది పిటిషన్‌ దాఖలు చేశారు. పాక్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లకు దారితీసిన ఆర్థిక సంస్కరణల కారణంగా పెట్రోల్, విద్యుత్ ధరలు వాయు వేగంతో పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలు, వ్యాపారాల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.


పీకల్లోతూ ఆర్థిక కష్టాలతో సతమతమవుతోన్న దాయాదిని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) సంస్థ ఆదుకుంది. జులై 3 బిలియన్ డాలర్లు ప్యాకేజీని ఆమోదించింది. దీంతో కొంత ఊరట చెందింది. అయితే, కఠిన సంస్కరణలతో వార్షిక ద్రవ్యోల్బణం 27.4%కి చేరింది. వచ్చే నవంబర్‌లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెరుగుతున్న రాజకీయ ఉద్రిక్తతలు, దిగజారుతున్న ఆర్థిక పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో, తాత్కాలిక ప్రధాని అన్వర్-ఉల్-హక్ కకర్ మాట్లాడుతూ.. ప్రజలకు రెండో ఆప్షన్ లేదని, పెంచిన బిల్లులను చెల్లించాల్సిందేనని అన్నారు. ‘ప్రభుత్వం సబ్సిడీలు ఇస్తే ఆర్థిక బాధ్యతలను భవిష్యత్తుకు మారుస్తారు.. సమస్యను పరిష్కరించే బదులు ఆలస్యం చేస్తారు’ అని పాక్ ఆపద్ధర్మ ప్రధాని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com