ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికల్లో అసలు ఆ గుర్తు ఎందుకు వేస్తారు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 06:34 PM

ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికల సందడి నెలకొంది. గురవారం రాష్ట్రవ్యాప్తంగా 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. అయితే ఎన్నికలంటే మనకు ఠక్కున గుర్తొచ్చేది సిరా చుక్క. ఎన్నికల్లో ఓటరు తన ఓటుహక్కు వినియోగించుకున్నాక సిరా మార్క్ చూపిస్తూ.. 'నేను ఓటేశానోచ్..' అంటూ సగర్వంగా చెప్పుకుంటారు. ఇంకొందరు సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలోనూ అప్‌లోడ్ చేస్తారు. అయితే ఎన్నికల్లో వాడే సిరా మార్క్ మనం తుడిచినా పోదు. ఒక్కసారి సిరా గుర్తు వేలిపై పడితే.. 72 గంటల వరకు చెరిగిపోదు. మరోసారి బోగస్‌ ఓట్లు (దొంగ ఓట్లు) వేయకుండా ఎన్నికల సంఘం దీన్ని ప్రవేశపెట్టింది.


ఈ సిరా ఇంకును కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు చెందిన మైసూర్‌ పెయింట్స్‌ అండ్‌ వార్నిష్‌ కంపెనీ తయారు చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 1962లో సిరా ఉత్పత్తి కోసం ఈ కంపెనీకి అనుమతిచ్చింది. నేషనల్‌ ఫిజికల్‌ ల్యాబరేటరీస్‌ ఫార్ములాతో సిరా ఉత్పత్తి బాధ్యతను ఈ కంపెనీకి అప్పగించారు. ఈ ఫ్యాక్టరీని మైసూర్ మహరాజు కృష్ణరాజ వడయార్-4 , 1937లోనే స్థాపించారు. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే ఇంకునే దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో ఉపయోగిస్తున్నారు. ఈ సిరాలో 7.25 శాతం సిల్వర్‌ నైట్రేట్‌ ఉన్నందున వేసిన వెంటనే చెరిగిపోదు. సిరా గుర్తుపై ఎన్నికల సంఘం నిబంధనలు కూడా ఉన్నాయి. 37(1) నిబంధన ప్రకారం ఓటర్ ఎడమచేతి వేలుపై సిరా గుర్తును చూడాల్సిన బాధ్యత పోలింగ్ అధికారికి ఉంటుంది. 2006 ఫిబ్రవరి ఒకటి నుంచి ఓటరు ఎడమ చేతి చూపుడు వేలు గోరు పైభాగం నుంచి కిందివరకు సిరా గుర్తువేస్తున్నారు. అంతకన్నా ముందు వరకు గోరు పైభాగం వరకు వేసేవారు.


మనదేశంలో తయారయ్యే సిరాకు అంతర్జాతీయంగా చాలా డిమాండ్‌ ఉంది. ఇక్కడ జరిగే రాష్ట్రాల ఎన్నికలకు సరఫరా చేయడంతో పాటు 1976 నుంచి మొత్తం 29 దేశాలకు ఇండియా నుంచే ఎగుమతి అవుతోంది. ఇండోనేషియా, లెబనాన్‌, అల్జీరియా, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్‌, అఫ్ఘనిస్తాన్‌, నేపాల్‌, మయన్మార్‌, ఇరాక్‌, శ్రీలంక, సిరియా, టర్కీ, ఈజిప్టు, సూడాన్‌ తదితర దేశాల్లో ఎన్నికల సమయంలో ఈ సిరాను వినియోగిస్తున్నారు. హైదరాబాద్‌లోనూ సిరా ఇంకును తయారు చేస్తారు. నగంరోలని రాయుడు ల్యాబరేటరీస్‌లోనూ ఎన్నికల సిరా ఇంకు తయారవుతోంది. ఈ ఇంక్‌ను స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పిల్లలకు పోలియో డ్రాప్స్ వేసే సమయంలో గుర్తు పెట్టేందుకు యూజ్ చేస్తున్నారు. హైదరాబాద్‌లో తయారయ్యే సిరా కూడా ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతోంది. చాలా వరకు ఆఫ్రికన్‌ దేశాలకు హైదరాబాద్ నుంచే ఇంక్ సరఫరా అవుతుంది. ఇక తెలంగాణలో రేపు (నవంబర్ 30న) జరగనున్న ఎన్నికలకు సుమారు 2 లక్షలకు పైగా సిరా బాటిళ్లు సిద్ధం చేసినట్లు తెలిసింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com