ట్రెండింగ్
Epaper    English    தமிழ்

#PUSHPA2: ముందు బాలీవుడ్ యాక్టర్ అన్నారు.. ఇప్పుడేమో కోలీవుడ్ యాక్టరంట!

cinema |  Suryaa Desk  | Published : Mon, Jun 27, 2022, 03:11 PM

క్రియేటివ్ దర్శకుడు సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం "పుష్ప". గతేడాది విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్లా అనూహ్య విజయం సాధించింది. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమా ఒక సెన్సేషన్. పుష్ప సాధించిన విజయోత్సాహంతో పుష్ప 2 పనులు శరవేగంగా కానిచ్చేస్తున్నారు బన్నీ, సుకుమార్. ఈ సినిమాపై రోజుకొక కొత్త వార్త పుడుతూ, మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ గా ఉంటుంది.
లేటెస్ట్ గా పుష్ప సీక్వెల్ కు సంబంధించిన ఒక ఇంటరెస్టింగ్ న్యూస్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. అదేంటంటే, పుష్ప 2 లో ఉండబోయే ఒక పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్ర కోసం చిత్రబృందం కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతిని సంప్రదిస్తున్నారట. నిజానికి ఈ వార్త పుష్ప సమయంలోనే వినపడగా, కొన్ని కారణాల వల్ల విజయ్ ఈ సినిమాను చెయ్యలేకపోయారు. ఆ పాత్రను ఫాహద్ ఫాజిల్ పోషించి శభాష్ అనిపించిన విషయం తెలిసిందే కదా. తాజాగా మరోసారి పుష్ప 2 విషయంలో విజయ్ సేతుపతి పేరు తెరపైకి రావడంతో, అందరూ ఈ సినిమాపై స్పెషల్ ఇంటరెస్ట్ చూపిస్తున్నారు. పుష్ప సీక్వెల్ లో ఫాహద్ ఫాజిల్ కు సుపీరియర్ పాత్రలో విజయ్ కనిపించబోతున్నాడట. ముందుగా ఈ పాత్ర కోసం మూవీ టీం బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ను సంప్రదించారని గతంలో ప్రచారం జరిగింది. ఏమైందో తెలియదు కానీ, ఇప్పుడు విజయ్ సేతుపతి పేరు వినిపిస్తుంది. మరి ఈ ఇద్దరిలో ఎవరు పుష్ప 2 లో భాగమవుతారో తెలియాలంటే, అధికారిక ప్రకటన వచ్చేంతవరకు ఆగాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com