విజయవాడ: మెదడు సమస్యతో బాధపడుతూ ఆక్సిజన్ తీసుకోలేకపోతున్న చిన్నారి కే.కృతిక(6)కు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు చేయూత నిచ్చారు. కృతిక తండ్రి శ్రీనివాసరావు ఆటోడ్రైవర్, తల్లి రాజ్యలక్ష్మి. కృతిక ఉన్నట్టుండి శ్వాసతీసుకోలేక అపస్మారకస్థితిలోకి వెళ్లిపోతుండటంతో తల్లిదండ్రులు నగరంలోని సిటీ న్యూరో హాస్పిటల్లో చూపించారు.
నరాల బలహీనత వల్ల కృతికకు తరచూ ఆక్సిజన్ అందదని, ఆపరేషన్ చేయటం కుదరదని వైద్యులు చెప్పారు. ఖరీదైన ఇంజక్షన్లు క్రమం తప్పకుండా తీసుకుంటే తప్ప చిన్నారి కృతిక కోలుకోలేని పరిస్థితి. వీరిది పేద కుటుంబం కావటంతో ఆధునిక వైద్యం చేయించలేని పరిస్థితి. దీంతో శుక్రవారం సాయంత్రం కృతిక తల్లి రాజ్యలక్ష్మి సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావుకు కలిసి పరిస్థితి వివరించింది. బొండా ఉమా ఆమెకు ఆర్థిక సహాయం అందించారు. దీంతో పాటు కృతికకు చేయాల్సిన ఇంజక్షన్లు, మందులు ఏమి అవసరమో రాసి ఇస్తే ప్రభుత్వాసుపత్రికి ఇండెంట్ పెట్టి అందచేస్తానని హామీ ఇచ్చారు. చిన్నారి కృతికకు స్వీట్బాక్స్ అందించి ఆమె తల్లికి భరోసా ఇచ్చారు.