ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఇంటర్‌నెట్ విస్తృతికి గూగుల్ ఎక్స్ సహకారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, May 06, 2017, 11:23 AM

: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి గూగుల్ ఎక్స్ ముందుకొచ్చింది. మారుమూల ప్రాంతాలకు ఇంటర్‌నెట్‌ను విస్తృతం చేసేలా సహకారం అందించేందుకు సంసిద్ధత తెలిపింది. గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సందర్శించారు. మారుమూల ప్రాంతాలకూ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించే విషయంలో సహకారం ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి గూగుల్ ఎక్స్ ప్రతినిధులను కోరగా వారు ఇందుకు సుముఖత తెలిపారు.   ముఖ్యమంత్రి బృందం గూగుల్ ఎక్స్ కార్యాలయాన్ని శుక్రవారం సందర్శించింది. గూగుల్ ఆవిష్కరణలకు ఈ ప్రాంతం నెలవు కావడంతో సాధరణంగా ఇక్కడకు అందరికీ ప్రవేశం వుండదు. గూగుల్ డ్రైవర్ లెస్ కార్, గూగుల్ గ్లాసెస్, బెలూన్స్ ఉపయోగించి ఇంటర్‌నెట్ అందించడం వంటి ప్రయోగాలకు ఇదే వేదిక. గూగుల్ ఎక్స్ సీఈఓ అస్ట్రో టెల్లర్ తన ప్రజంటేషన్ ద్వారా మరిన్ని వివరాలు తెలిపారు. ఈ తరహా ఆవిష్కరణలకు, వినూత్న ప్రయోగాలకు ఆంధ్రప్రదేశ్‌ను వేదిక చేసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు.
పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యం
  ఆంధ్రప్రదేశ్‌కు పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా అమెరికాలో ముఖ్యమంత్రి పర్యటన సాగుతోంది. రెండో రోజూ వివిధ సంస్థల ప్రతినిధులతో సమావేశాలు జరిపారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ కంపెనీ ఎం మోసెర్ అసోసియేట్స్‌ అమరావతి నిర్మాణంలో భాగస్వాములు అయ్యేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ఆ సంస్థ గ్లోబల్ డైరెక్టర్ రస్సెల్ డ్రింకెర్ ముఖ్యమంత్రితో భేటీలో ఈ విషయం వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా తాము చేపట్టిన పనులను ఎం మోసెర్ కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా వివరించారు. తాము చేపట్టిన వివిధ ప్రాజెక్టుల విశేషాలను తెలిపారు.   బిలియన్ డాలర్ విలువ కలిగిన ఐటి దిగ్గజ కంపెనీ జోహో సీఈఓ శ్రీధర్ వెంబు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో తమ కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తిగా ఉన్నామని ముఖ్యమంత్రికి చెప్పారు. ముఖ్యమంత్రిని ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ నియో సీఈవో పద్మశ్రీ వారియర్‌ వున్నారు. సిస్కోతో కలిసి పనిచేసిన పద్మశ్రీ వారియర్‌ది స్వస్థలం విజయవాడ. గతంలో మోటోరోలో ఎనర్జీ సిస్టమ్ గ్రూప్‌లో పనిచేసిన అనుభవం కూడా వారియర్‌కు వుంది.   గురువారం బాగా పొద్దుపోయిన తర్వాత ముఖ్యమంత్రి గూగుల్ వైస్ ప్రెసిడెంట్ టామ్ మూర్‌ను కలిసారు. గూగుల్ నూతన ఆవిష్కరణల గురించి టామ్ ముఖ్యమంత్రికి వివరించారు. అలాగే సెమి కండక్టర్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ (IP) ప్రపంచ అగ్రశ్రేణి సప్లయర్ గా ఉన్న ARM హోల్డింగ్స్ సంస్థ సీఈఓ సైమన్ అంథోనీ సెగర్స్ (SIMON ANTHONY SEGARS)తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. ఎఆర్‌ఎం హోల్డింగ్స్ ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (IOT)పై ప్రస్తుతం దృష్టి నిలిపింది. ప్రభుత్వ పరిపాలనలో, అభివృద్ధి, సంక్షేమ రంగాలలో సాంకేతికతను తమ ప్రభుత్వం ఎలా అందిపుచ్చుకున్నదీ సైమన్‌కు ముఖ్యమంత్రి తెలిపారు. జీఎస్‌ఎల్వీఎఫ్-09 విజయవంతంపై హర్షం  జీఎస్‌ఎల్వీఎఫ్-09 ప్రయోగం విజయవంతం కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. 2,240 కిలోల బరువున్న జీశాట్ -9 ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టినందన ఇస్రో శాస్త్ర వేత్తల బృందానికి అభినందనలు తెలిపారు. భారతదేశంతో పాటు, దక్షిణాసియా దేశాల ప్రయోజనాలకు జీశాట్-9 సేవలు ఉపయోగపడటం ఎంతో సంతోషకరం అన్నారు.   అమెరికాలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందంలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ పరకాల ప్రభాకర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి గుట్టుపల్లి సాయిప్రసాద్, ఆర్థిక అభివృద్ధి మండలి కార్యనిర్వాహక అధికారి జాస్తి కృష్ణకిశోర్, సీఆర్‌డీఏ ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్, ఐటీ ముఖ్య కార్యదర్శి కావేటి విజయానంద్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ ఆరోఖ్యరాజ్ వున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com