హూస్టన్: కన్సాస్ షూటింగ్ ఘటనలో తెలుగు వ్యక్తులు శ్రీనివాస్ కూచిభొట్ల, అలోక్ మాదసానిని కాపాడటానికి ప్రయత్నించి గాయపడిన 24 ఏళ్ల అమెరికా యువకుడు ఇయాన్ గ్రిల్లట్ను ఇండియన్ అమెరికన్ సమాజం సన్మానించింది. భారతీయుల ప్రాణాల కోసం బుల్లెట్ గాయాలను సైతం లెక్కచేయని అతడి ధైర్యాన్ని ప్రపంచం మొత్తం వేనోళ్ల కొనియాడింది. మనోళ్లను కాపాడటం కోసం అతడికి ఏదైనా చేయాలని అమెరికాలోని భారతీయ సమాజం భావించింది. అనుకున్నదే తడవుగా ఆ ట్రూ అమెరికన్ హీరోకు ఓ ఇంటిని కొనిచ్చే దిశగా ఇండియా హౌజ్ విరాళాలను సేకరించింది. ఈ సందర్భంగా అతనికి లక్ష డాలర్ల బహుమతిని అందజేశారు. ఇండియా హౌజ్ హూస్టన్ వార్షిక ఉత్సవాల్లో భాగంగా గ్రిల్లట్ను సత్కరించారు. కన్సాస్ ఘటనలో కూచిభొట్ల శ్రీనివాస్ అనే తెలుగు యువకుడు మృతి చెందిన విషయం తెలిసిందే. మరో వ్యక్తి అలోక్ మాదసానిని ఇయాన్ గ్రిల్లట్ కాపాడాడు. ఎవరో ముక్కూమొహం తెలియన వ్యక్తి కోసం ప్రాణాలకు తెగించిన హీరోలను చాలా అరుదుగా చూస్తుంటాం. అమెరికా, ఆ దేశ గొప్పతనాన్ని చాటాడు ఇయాన్ గ్రిల్లట్ అని ఇండియా హౌజ్ హూస్టన్ చైర్మన్ జితెన్ అగర్వాల్ అన్నారు.