ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గణతంత్ర విలువలు కొనసాగించాలి: రాష్ట్రపతి

national |  Suryaa Desk  | Published : Fri, Jan 25, 2019, 10:05 PM

భారత 70 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శ్రీ రామ్ నాథ్ కోవింద్ ప్రసంగం..  ....ప్రియమైన భారత పౌరులారా…


1. భారత 70 వ గణతంత్ర దినోత్సవం సందర్భం గా మీ అందరికీ నా శుభాకాంక్షలు. మన ప్రజాస్వామ్య, గణతంత్ర విలువలను ఒక సారి గుర్తు చేసుకునే పవిత్ర సమయం ఇది. సమాజం, పౌరులందరి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, సమానత్వం పట్ల కట్టుబాటును పునరుద్ఘాటించే సందర్భం ఇది. అన్నింటి కన్నా మించి భారతదేశం, భారతీయత స్ఫూర్తిని వేడుకగా నిర్వహించుకునే సమయం ఇది.


2. ప్రతీ ఒక్క గణతంత్ర దినోత్సవం విలువైనదే. అలాగే గణతంత్ర జీవనంలో కూడా ప్రతీ ఒక్క రోజూ ఎంతో విలువైనది. ఈ సంవత్సరం మరింత ప్రత్యేకమైనది. అక్టోబర్ 2వ తేదీన మనందరం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లో అణచివేతకు గురవుతున్న సమాజాలన్నింటిలోనూ వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న స్ఫూర్తిని రగిలించిన మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవాన్ని నిర్వహించుకోబోతున్నాం. మన గణతంత్రం నైతిక దిక్సూచిగా గాంధీజీ చిరస్థాయిగా నిలుస్తారు. మన విధానాలు, కార్యక్రమాలన్నింటికీ ఆయన బోధనలే ఇప్పటికీ మార్గదర్శకం. ఆయన 150వ జన్మదినోత్సవం ఒక్క భారతదేశానికే కాదు, యావత్ ప్రపంచం ఆనందాన్ని పంచుకోవాల్సిన రోజు.


3. గాంధీజీ జయంతిని నిర్వహించుకున్న కొద్ది వారాల వ్యవధిలోనే, నవంబర్ 26న, మనం రాజ్యాంగాన్ని ఆమోదించిన 70వ వార్షికోత్సవాన్ని కూడా నిర్వహించుకోబోతున్నాం.  విజ్ఞానాన్ని అందిచే మరియు విస్తృత ప్ర‌భావాన్ని చేపే ఈ గ్రంథ‌మే మన గణతంత్రానికి పునాది వేసింది. సైద్ధాంతిక నిబ‌ద్ధ‌త మ‌రియు దేశభక్తి క‌లిగిన స్త్రీలు, పురుషులు సభ్యులుగా ఉన్న రాజ్యాంగ ప‌రిష‌త్తు శ్రమ ఫలితం అది. ప్రత్యేకించి రాజ్యాంగ రచన కమిటీకి అధ్యక్షుడుగా పని చేసిన బాబాసాహెబ్ డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ పోషించిన పాత్రను మనందరం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాలి. ఆయన గౌరవార్ధం, రాజ్యాంగం గౌరవార్ధం  భార‌తీయ‌లు ఈ ఏడాది కూడా రాజ్యాంగ దినోత్సవాన్ని ఒక స‌ముచిత‌మైన రీతి లో జ‌రుపుకోనున్నారు.
4. భారత స్వాతంత్రాన్ని తీర్చిదిద్దిన విలువలే, మన గణతంత్రానికి ఒక రూపాన్ని ఇస్తున్న‌టువంటి విలువలు గా ఉన్నాయి. మన ప్రజాస్వామ్యం లో, రాజ్యాంగం లో పొందుపరిచిన విలువలే - భారత ప్రజల ఆధిపత్యాన్నిప‌రిర‌క్షించే విలువ‌లు. ఈ ఏడాది భారత పౌరులు - మనలో ప్రతీ ఒక్కరూ - మరో బాధ్యత కూడా నిర్వర్తించాల్సి ఉంది. అదే- సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసి, 17వ లోక్ సభ ను ఎన్నుకునే బాధ్యత. మన ప్రజాస్వామ్యం ఆదర్శాలు, ఆలోచనలు పూర్తి స్థాయి లో ఆచరణ లోకి వస్తాయి. ప్రతీ ఐదు సంవత్సరాలకు వలెనే మరోసారి మనందరం మన తీర్పును ప్రకటించి తలరాతలు రాయబోతున్నాం. ఈ ఏడాది ఎన్నికలు 21వ శతాబ్ది లో జన్మించిన వారికి మొదటి ఎన్నికలు. వారు కూడా కొత్త లోక్ సభ ను ఎన్నుకోవడంలో తమ వంతు పాత్రను పోషించ‌నున్నారు.


5. ఎన్నిక అంటే కేవ‌లం రాజకీయ క‌స‌ర‌త్తు కాదు. ఎన్నిక అనేది మన తెలివితేటలు, కార్యాచరణను ఉమ్మడిగా వెలికి తీసే సమయం. భాగస్వామ్య, సమసమాజ లక్ష్యాలు, ఆకాంక్షల పునరుజ్జీవానికి, పునరుద్ఘాటనకు అది ప్రాతినిథ్యం వహిస్తుంది. దేశప్రజలు, భారత గణతంత్రం ఉమ్మడి ఆకాంక్షలకు దర్పణం అది. ఓటింగు ఒక పవిత్ర బాధ్యత అని అది ఉద్ఘాటిస్తుంది. ద‌య‌చేసి ఈ బాధ్యత ను నిర్వర్తించండి. ఓటరు ఎవరిని ఎన్నుకుంటారన్నది అతని యొక్క‌ లేదా ఆమె యొక్క నిర్ణయాధికార‌మే. అర్హులైన ఓటర్లందరూ బయటకు వచ్చి ఓటేయండి అని మాత్రమే నా అభ్యర్థన. మన దేశం ఒక కీలక దశలో ఉంది. కొన్ని కోణాల్లో 1940 దశాబ్ది చివరి కాలం, 1950 దశాబ్ది మొదటి కాలం అంతటి కీలకమైన, నిర్మాణాత్మక సమయం ఇది. ఈ సందర్భంగా మన చర్యలు, మ‌నం తీసుకునే నిర్ణయాలు 21వ శతాబ్ది మిగిలిన భాగాన్ని తీర్చి దిద్దేవిగా ఉంటాయి. ఇది ఒక తరానికి ఒక సారి మాత్రమే వచ్చే సందర్భం కాదు, ఒక శతాబ్దికి ఒక్క సారే వచ్చే సమయం.
6. ప్రజల ఆకాంక్షల సాధనకు, అభివృద్ధి చెందిన భారతదేశం నిర్మాణానికి చేసే ప్రయాణంలో ఈ ఎన్నిక ఒక మైలు రాయి మాత్రమే. మనకు గుర్తున్నంత వరకు దుర్భర దారిద్ర్యాన్ని రూపుమాపే ప్రయత్నం తొలిసారిగా జరుగుతున్న దశలో దేశం ఉంది. సార్వజనీన, సమానత్వ ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ప్రారంభదశలో ఉంది. సమాజంలో అధిక సంఖ్యాకులైన ప్రజలకు అందుబాటు ధరల్లో ఔషధాలు, వైద్య పరికరాలు, కృత్రిమ అవయవాలు ల‌భిస్తున్న‌ సమయం ఇది. గతంలో కన్నా అధిక సంఖ్యలో భారతీయులకు ఆధునిక పారిశుధ్య వసతులు, విద్యుత్ సౌకర్యం గల చక్కని ఇల్లు అందుబాటులోకి వచ్చిన తరుణం ఇది.


7. సంధానం - నౌకాశ్ర‌యాలు, అంతర్గత జలమార్గాలు, ఆధునీకరించిన రైల్వేలు, కొత్త మెట్రో సర్వీసులు, జాతీయ రహదారులు, గ్రామీణ రహదారులు, దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా తక్కువ ధరల్లో విమానయానం, ప్రత్యేకించి మొబైల్ ఫోన్లు, స‌మాచార రాశి ల‌భ్య‌త‌ - మనందరినీ ఇంతకు ముందెన్నడూ లేనంత స్థాయిలో ఒక్కటిగా చేసింది. భారతదేశం సమైక్యం గాను, సమగ్రం గాను ఉంటూ వ‌స్తోంది. ఇప్పుడు ఇది నెట్ వర్క్ స‌దుపాయాన్ని కూడా క‌లిగి ఉంటోంది.
8. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలు, కొత్త కాంతులు విరజిమ్ముతున్న జ్ఞానజ్యోతి మన రైతుల ను సాధికారం చేసి మన సైనికుల కు కొత్త పరికరాలు అందిస్తున్నాయి. సాంప్రదాయికంగా నిరాదరణకు గురైన పౌరులను సాధికారం చేస్తూ మన కుటుంబాల్లోని బాలబాలికలను విద్యావంతులను చేస్తున్నాయి. అసమానమైన ఔత్సాహిక శక్తి, త్వరితగతిన విస్తరిస్తున్న స్టార్టప్ సంస్కృతి మన యువతరాన్ని నిర్మిస్తున్నాయి.  యావత్తు ప్రపంచం యొక్క‌ దృష్టి భార‌త‌దేశం పైన ప్ర‌స‌రించడం తో పాటు, యావ‌త్ ప్ర‌పంచం భార‌త్ ను ప్ర‌శంసిస్తోంది. 


9. దేశవ్యాప్తంగా నేను చేస్తున్న ప్రయాణాల్లోను, సమాజం లోని విభిన్న వర్గాలతో నేను మాట్లాడుతున్న సమయంలోను ఈ ప్రయత్నాల పట్ల, అసాధారణమైన పురోగతి పట్ల ప్రశంసా భావాన్ని నేను గమనించాను. తరతరాలుగా కొరత ఆర్థిక వ్యవస్థలెన్నింటినో దాటుకుంటూ వచ్చి నేటికీ సజీవంగా ఉన్న సీనియర్ తరాల వారిలో ఈ ప్రశంసా భావం మరింత ఎక్కువగా ఉంది. ఒక రంగం తర్వాత మరో రంగం, ఒక వస్తువు తర్వాత మరో వస్తువుగా మనం కష్టాన్ని అందుబాటుగా మార్చుకున్నాం. ఒక్కో అడుగు, ఒక్కో ఏడాదిగా మనం దీన్ని సాధించాం. ఆహార ధాన్యాలే కావచ్చు లేదా ఎల్‌పిజి సిలిండర్లే కావచ్చు, టెలిఫోన్ కనెక్షన్లే కావచ్చు లేదా పాస్ పోర్టులు పొందే సామర్థ్యమే కావచ్చు మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. చాలా అంశాల లో సాంకేతిక విజ్ఞానం మరింత అధిక శక్తిని అందించింది.  అన్ని అంశాల్లోను సమ్మిళితత్వం అనేది ఒక నైతిక శక్తి గా నిలిచింది. 
10. మన సమ్మిళితత్వం యొక్క స్ఫూర్తి కి - అందిరికీ అందుబాటు, అవకాశం; విస్తరణ, మన సొంతం అనుకునే వారిని అక్కున చేర్చుకోవడం వంటివి - జోహారు చెప్పకుండా భారత అభివృద్ధి భావ‌న‌ పరిపూర్ణం కాదు. ఈ దేశం మనలో ప్రతి ఒక్కరిదీ, మనందరిదీ - ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క జాతి, ప్రతి ఒక్క ప్రాంతం, ప్రతి ఒక్క గుర్తింపు గల వారికి - చెందిన‌దీ. అది ప్రతి ఒక్క పౌరునికీ, ప్రతి ఒక్క వ్యక్తికీ చెందుతుంది. భారతదేశానికి బహుముఖీనతే అతి పెద్ద బలం. ప్రపంచానికి ఒక అత్యంత ఘ‌న‌మైన‌ ఉదాహరణ. “భారత నమూనా” భిన్నత్వం, ప్రజాస్వామ్యం, అభివృద్ధి అనే మూడు కాళ్ల పై నిలబడి ఉంది. ఒక దాని కన్నా ఒకటి ఎక్కువ అని ఎంచుకునే అవకాశం లేదు.  మూడూ మనకి కావాలి. మూడింటిని మనం కలిగి ఉంటాం.
11. భారతదేశం లో సామాజిక పరివర్తన లో అతి పెద్ద అంశం లింగపరమైన సమానత్వం, అందరికీ సమానావకాశాల కల్పన, సమానత్వం షరతుల‌ ద్వారా ప్రతి ఒక్క బాలిక, ప్రతి ఒక్క మహిళ కు సమానత్వం. నా అనుభవం ప్రకారం అవకాశం కల్పించగలిగితే మన కుమార్తెలు పాఠశాల తరగతుల్లో మన కుమారుల తో సమానం అనే కన్నా, వారి కన్నా పై చేయిని సాధించ గలుగుతారు. మన దేశం లో యువ మహిళలు ప్రతీ ఒక్క రంగం లోనూ - విద్యా రంగం మొద‌లుకొని సృజనాత్మక కళలు, క్రీడా రంగం నుంచి సాయుధ దళాల దాకా - ముందుకు సాగుతున్నారు. ఈ ప్రక్రియ ఆగేది కాదు, అందులో ఎలాంటి సందేహం లేదు. భారత భవిష్యత్తు కు మార్గం అదే.
12. మన గణతంత్రం ఎంతో దూరం ప్రయాణించింది. మనని ఇంత ముందుకు నడిపించిన ముందు తరాలన్నింటినీ మనం ప్రశంసించాలి. అయిన పరిపూర్ణతకు ఇంకా మన ప్రయాణం దూరంగానే ఉంది. ఇంకా చేరుకోవాల్సిన‌ తీరాలెన్నో ఉన్నాయి. ఇంకా నింపాల్సిన‌ లోతులెన్నో ఉన్నాయి, ఇంకా తుడవాల్సిన కన్నీరు ఉంది. సాధన, విజయం అనే కొలబద్దను పరిమాణం-ప్రమాణం; అక్షరాస్య సమాజం-మేథోసమాజంగా మార్చుకోవలసిన అవసరం ఉంది. అలాగే అందరికీ స్థానం కల్పించిన జాతి నుంచి అన్ని వర్గాలను ఒక కుటుంబంగా మార్చగల, ప్రోత్సహించగల సమాజంగాను, ప్రతీ ఒక్కరిలోని ప్రత్యేకతలను సామర్థ్యాలుగానున తీర్చి దిద్దాల్సి ఉంది. మన కుమారులు, కుమార్తెలను ఈ బాటలోనే నడిపించాలి.
13. “ఇండియా ఆఫ్ మై డ్రీమ్స్” (నా కలల్లో భారతదేశం) అనే గ్రంథంలో మహాత్మా గాంధీ నిరుపేదలు కూడా “సమర్థవంతంగా వాక్కు” వినిపించగల, “అగ్రశ్రేణి సమాజం, తక్కువ శ్రేణి సమాజం” అనే తేడాలు లేని, “ప్రతీ ఒక్క వర్గం చక్కని సామరస్యంతో జీవనం” సాగించగల, “పురుషులతో పాటుగా మహిళలు కూడా సమాన హక్కులు ఆస్వాదించగల” భారతదేశం ఆవిష్కారం కావాలన్న ఆకాంక్షను ప్రకటించారు.  మనం నిర్మించుకుంటున్న భారత్ కు ఈ ఆదర్శాలు నిరంతరం గుర్తుకు వస్తూ ఉండాలి. పేద కుటుంబాల్లోని ప్రతిభావంతులైన పిల్లలకు ప్రత్యేక సదుపాయాల కల్పనకు వీలు కల్పిస్తూ ఇటీవల చేసిన రాజ్యాంగ సవరణ మన కలలకు, గాంధీజీ స్వ‌ప్నాల కు దీటైన భారత నిర్మాణం లో మరో ముందగుడు అన్న విషయం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి.
14. మానవుల అనుభవాలన్నీ భాగస్వామ్యల పైనే నిర్మాణం అయ్యాయి. ఇంటిలోని భాగస్వామ్యం కుటుంబాన్ని నిర్మిస్తుంది. కార్యస్థలంలోని భాగస్వామ్యం ఒక వ్యాపారాన్ని నిర్మిస్తుంది. భిన్న వర్గాల మధ్య భాగస్వామ్యం ఒక సమాజాన్ని నిర్మిస్తుంది. ప్రజలు, ప్రభుత్వం మధ్య భాగస్వామ్యం ఒక జాతిని నిర్మిస్తుంది. దేశాల మధ్య భాగస్వామ్యం ఒక మెరుగైన ప్రపంచాన్ని నిర్మిస్తుంది. అలా భాగస్వామ్యాలే ఒక దారంగా కుటుంబాన్ని, జాతిని, ప్ర‌పంచాన్ని అల్లుతాయి. చివరికి ప్రపంచం అంతా ఒకే కుటుంబం అనే భావనకు - ‘‘వసుధైవ కుటుంబక‌మ్’’ - అనే భావ‌న‌కు అది దారి తీస్తుంది.
15.  అర‌మ‌ర‌క‌లు లేన‌టువంటి భావ ప్ర‌సారం ద్వారా నిజాయితీ తో కూడిన సంభాష‌ణ ద్వారా మ‌రియు నితీ మేర లేని ద‌యాళుత్వం ద్వారా భాగస్వామ్యాలు ఇనుమ‌ళిస్తాయి.  మన కుటుంబ సభ్యుల విషయం లో ఇది నిజం. చారిత్రకంగా నిరాదరణకు గురవుతున్న వర్గాలు, సంఘాల విషయం లో కూడా ఇది నిజం కావాలి. వారి ఫిర్యాదులన్నీ విని పరిష్కరించగలగాలి. అసౌకర్యం అయినా పక్కన పెట్టి ఇలాంటి చర్చల కు మార్గం కల్పించడం అత్యంత కీలకం. త్వరితంగా మార్పు సాధిస్తున్న సమాజం లో ఇలాంటి చర్చలకు మనందరం సిద్ధం కావాలి. అలాగే దయాగుణం ఎక్కడ అవసరమో అక్కడ దాన్ని చూపగలగాలి; ఎవరికి అవసరమో - ఉదాహరణకి మన కన్నా తక్కువ సామర్థ్యాలున్న వారు ప్రత్యేకించి దివ్యాంగులు - వారికి అది అందించాలి.
16. ప్రజా సంక్షేమానికి అంకితమైన వారు, పిలుపు కన్నా అతీతంగా వ్యవహరించే వారు వ్యక్తులు లేదా సంస్థలు ఎవరి విషయం లో అయినా మన సమాజం అధిక గౌరవం ప్రదర్శిస్తుంది. సేవా భావానికి, ప్రజాసేవ పట్ల అంకిత భావానికి, న్యాయం యొక్క పరిధిని విస్తరించేందుకు తగినంత గౌరవాన్ని అందించే తీరాలి. మంచి ఆలోచన లతో సహాయం అందించే వ్యక్తులు, ప్రజా సమూహాలు, సంస్థలు -ప్రభుత్వ లేదా ప్రైవేటు, అన్నింటి కన్నా విస్తృతంగా సమాజం, ప్రత్యేకంగా ప్రభుత్వం చేసే కృషిని గుర్తించి కొనియాడాలి.
17. దేశంలోనే కాదు, విదేశాల్లో కూడా మనకు మార్గదర్శక సూత్రాలు కూడా... ఇవే శాంతి పరిరక్షణ కావచ్చు, వాతావరణ మార్పుల ప్రభావాన్ని తొలగించడం కావచ్చు, అభివృద్ధి భాగస్వామ్యాలు, మానవతా సహాయం, వైపరీత్యాల సహాయం అన్నింటిలోనూ ప్రపంచ స్థాయిలో భారత్ అనుసరించే వైఖరికి మార్గదర్శక సూత్రాలు కూడా ఇవే. భారతదేశానికి అంతర్జాతీయ సమాజంలో కొత్త గౌరవాన్ని ఆర్జించి పెడుతున్నవి కూడా ఇవే.
18.  మన గణతంత్రానికి మూలంగా నిలిచిన సిద్ధాంతాలు ఇవేనని నేను గట్టిగా చెబుతున్నాను. ప్రజాస్వామ్య విధానాల ద్వారానే ప్రజాస్వామిక లక్ష్యాలు సాధించుకోవడం, బహుముఖీన మార్గాల ద్వారానే బహుముఖీన లక్ష్యాలు సాధించడం, చ‌క్క‌ని దారుల‌ ద్వారానే ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డం, అందరినీ క‌లుపుకోడం ద్వారానే సమ్మిళిత లక్ష్యాలు సాధించడం, దయతో కూడిన చర్యల ద్వారానే దయాగుణం తో కూడిన లక్ష్యాలు సాధించుకోవడం, రాజ్యాంగబ‌ద్ధ మార్గాల లో రాజ్యాంగ గ‌మ్యాన్ని చేర‌డం మ‌న‌కు మన గణతంత్రం చూపించిన‌టువంటి బాట. 


19. ఈ సిద్ధాంతాలే మన బాటలో వెలుగులు ప‌ర‌చుగాక. అన్నీ ఆలోచించిన త‌రువాత “మనం, ప్రజలం...” మనకు మ‌న‌మే ఈ రాజ్యాంగాన్ని అందించుకున్నాం; “మనం, ప్రజలం...” ఈ సిద్ధాంతాలకు కాపలాదారులం మ‌రియు ప‌రిర‌క్ష‌కులం అయి ఉన్నాము.
20. ఈ మాట‌ల తో నేను మరొక్కమారు మీకందరికీ ఆనంద‌దాయ‌క‌మైన గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియ జేస్తున్నాను.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com