ఉత్తరాఖండ్‌లోని ఉత్తర్‌కాశీ సిల్క్యారా సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను తీవ్ర ప్రయత్నాల అనంతరం చివరకు 17 రోజుల తర్వాత మంగళవారం రాత్రి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ప్రస్తుతం కార్మికులంతా క్షేమంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. కాగా, రెస్క్యూ ఆపరేషన్‌లో దేశీయ, విదేశాల నుంచీ తీసుకొచ్చిన అత్యాధునిక యంత్రాలు కూడా మొరాయించాయి. కానీ, పదేళ్ల కిందట నిషేధించిన ‘ర్యాట్ హోల్ మైనింగ్’ విధానమే చివరకు వారిని బయటకు తీసుకురావడానికి సహకరించింది. పలు మార్గాల్లో ఆపరేషన్ చేపట్టినప్పటికీ.. అత్యంత ప్రమాదకరమైన ఈ పద్దతితోనే సొరంగంలో చిక్కుకున్న కూలీలను రెస్క్యూ బృందాలు చేరుకోగలిగాయి.
గనుల నుంచి బొగ్గును వెలికి తీయడానికి సమాంతరంగా సన్నని గుంతలు తవ్వే విధానాన్నే ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. భూగర్భంలో ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్ హోల్‌గా పేర్కొంటారు. దాదాపు నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉండే ఈ మార్గంలో కేవలం ఒక్క మనిషి మాత్రమే దూరగలడు. ఈ క్రమంలో నిర్దేశిత బొగ్గు పొరను చేరుకున్న తర్వాత.. దానిని వెలికి తీసేందుకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. పార, తదితర ప్రత్యేక పనిముట్లతో చేతుల ద్వారానే తవ్వకాలు చేపడతారు.
రోప్‌లు, అవసరమైతే నిచ్చెనల సాయంతో వెళ్లి కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ.. వాటిని కొంత దూరంలో డంప్ చేస్తారు. అక్కడి నుంచి ట్రాలీ ద్వారా బయటకు తరలిస్తారు. కానీ, ప్రస్తు ఆపరేషన్‌లో మాత్రం.. 800 మి.మీ పైపు ద్వారా నిపుణుల బృందం లోనికి వెళ్లి తవ్వకాలు చేపట్టింది. వీరికి ఆక్సిజన్ సరఫరాకు ఏర్పాట్లు చేశారు. అత్యంత పలుచటి భూ పొరలుండే మేఘాలయ వంటి ప్రాంతాల్లో మైనింగ్‌కు ఈ విధానాన్ని ఎక్కువగా అవలంభిస్తాతారు. ఇతర సాంకేతికతలతో పోలిస్తే ఖర్చు తక్కువగా ఉండటం వల్ల దీన్నే ఎక్కువగా ఎంచుకుంటారు.
అయితే, ర్యాట్-హోల్ మైనింగ్ విధానంలో కార్మికులకు భద్రత లేకపోవడం ప్రధాన సమస్య. ముఖ్యంగా లోపలికి వెళ్లేవారికి సరైన వెంటిలేషన్, నిర్మాణ పరంగా రక్షణ లేకపోవడం, వర్షం కురిసినప్పుడు నీటితో నిండిపోవడం వంటివి ప్రతికూల అంశాలు. ఈశాన్య రాష్ట్రాల్లో ఇలాంటి తవ్వకాల కారణంగా మైనింగ్‌లో అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. 2018లో అక్రమ మైనింగ్ చేస్తోన్న ఓ గనిలో ప్రమాదం చోటుచేసుకుని 15 మంది, 2021లో మరో ఘటనలో ఐదుగురు చిక్కుకుపోయారు. ఇలా కార్మికులతోపాటు పర్యావరణానికి ప్రమాదకరమైన ఈ తరహా విధానాన్ని పర్యావరణవేత్తలు వ్యతిరేకిస్తున్నారు.
వీటిని పరిగణనలోకి తీసుకున్న నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్.. ఇది శాస్త్రీయమైన పద్దతి కాదని పేర్కొంటూ నిషేధించింది. అనంతరం 2015లోనూ ఈ నిషేధాన్ని ఎన్జీటీ సమర్థించింది. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తూ కార్మికులు ప్రాణాలు కోల్పోతుండటాన్ని ప్రస్తావించింది. అయితే, తమ ప్రాంతంలో మైనింగ్‌కు మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో నిషేధాన్ని ఈశాన్య రాష్ట్రాలు సవాలు చేశాయి. మేఘాలయాలోనూ ఈ తరహా తవ్వకాలు కొనసాగుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.