విశాఖ సాగర తీరంలో ప్రమాదకర పాము కలకలంరేపింది. నగర పరిధిలోని సాగర్‌నగర్ సముద్ర తీరంలో మత్స్యకారుల వలకు మంగళవారం ఓ విషపూరిత పాము చిక్కింది. చేపలతో పాటూ ఈ పామును మత్స్యకారులు గుర్తించారు. ఆహార అన్వేషణలో భాగంగా చేపల గుంపుల్లో కలిసిపోయిన సందర్భాల్లో వలల్లో చిక్కుకుంటాయని చెబుతున్నారు. సుమారు ఏడు అడుగులు పొడవు ఉన్న ఈ పామును మత్స్యకారులు తిరిగి సురక్షితంగా సముద్రంలోకి విడిచిపెట్టారు.
సముద్ర జలాల్లో చాలా లోపల సంచరించే ఈ జీవి సాంకేతిక నామం ‘హైడ్రో ఫిస్ సీ స్నేక్’ అని మత్స్యశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి శ్రీనివాసరావు తెలిపారు. ఇవి విషపూరిత మైనవని.. కాటు వేసినపుడు సకాలంలో వైద్యం చేయించుకోకుంటే ప్రాణాలకే ప్రమాదమని చెప్పారు. చిన్న చేపలు, రాళ్లలోని నాచు తింటూ ఇవి మనుగడ సాగిస్తాయని చెప్పారు. దీనిని మత్స్యకారులు కట్ల పాము అని పిలుస్తుంటారు. ఈ పాము విషయంలో జాగ్రత్త అవసరం అంటున్నారు. అయితే సముద్రంలో లోపల ఉంటాయి కాబట్టి తీరానికి రావడం చాలా అరుదు అని చెబుతున్నారు. ఇలా మత్స్యకారుల వలకు చిక్కుతాయంటున్నారు.