ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోజులో కనీసం 5 నిమిషాల జాగింగ్ తో శరీరానికి ఎంతో మేలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jun 24, 2020, 03:14 PM

వాకింగ్ వల్ల బాడీలో చాలా అవయవాలు అటూ ఇటూ కదిలి, కొవ్వు కరిగి ఆరోగ్యం పెరుగుతుంది. ఐతే వాకింగ్ కంటే... జాగింగ్ ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలిగిస్తుందంటున్నారు డాక్టర్లు. ఎక్కువ టైమ్ లేని వాళ్లు రోజూ కనీసం 5 నిమిషాలైనా పరిగెడితే... ఎంతో మేలు జరుగుతుందంటున్నారు. ముఖ్యంగా చలికాలంలో... నిద్ర మత్తు ఎక్కువగా ఉండే రోజుల్లో... వాకింగ్ చేసే టైమ్ లేనప్పుడు... జాగింగ్‌తో ఫిట్‌నెస్ పెంచుకోవచ్చంటున్నారు. పైగా చలికాలంలో తినే హల్వా, పరాఠా వంటి ఆహార పదార్థాల్లో కేలరీలు ఎక్కువ. అవి బరువు పెరిగేలా చేస్తాయి. అధిక బరువు ఎప్పుడూ నష్టమే. అందువల్ల 5 నిమిషాల జాగింగ్ చేసే మేలేంటో తెలుసుకుందాం. రన్నింగ్ వల్ల బాడీ మొత్తం షేక్ అవుతుంది. కేలరీలు వేగంగా ఖర్చవుతాయి. నిజంగా బరువు తగ్గాలంటే... ఐదు నిమిషాల జాగింగ్ సరిపోదు. కానీ, అసలు ఎక్సర్‌సైజే చెయ్యడానికి టైమ్ లేకపోతే, ఈ 5 నిమిషాల రన్నింగ్ తోనైనా క్యాలరీలు, కొవ్వు కరిగించుకోవచ్చు. ఉదయాన్నే నిద్ర మత్తు ఉంటుంది. అలాంటి సమయంలో అలా జాగింగ్‌కి వెళ్తే... ఆ పచ్చటి ప్రకృతి, సూర్య కిరణాలు, పక్షుల అరుపులు, చక్కటి వాతావరణం... అన్నీ కలగలిసి ఎంతో ఆహ్లాదం కలుగుతుంది. అది తలనొప్పిని తగ్గిస్తుంది. బాడీకి, బ్రెయిన్‌కీ ఎక్కువ ఆక్సిజన్ అందుతుంది. డిప్రెషన్ తగ్గుతుంది. ఈ రోజుల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ సమస్య ఎక్కువ మందిని వేధిస్తోంది. డయాబెటిక్ పేషెంట్లు 5 నిమిషాలు కేటాయించి... వీలైనంతగా పరుగులు పెడితే... బ్లడ్‌లో షుగర్ (గ్లూకోజ్) లెవెల్స్ పెరిగిపోకుండా, తగ్గిపోకుండా బ్యాలెన్స్‌డ్‌గా ఉండేందుకు వీలవుతుంది. కొంతమందికి సరిగా నిద్ర పట్టక... రాత్రిళ్లు మొబైల్‌లో మెసేజ్‌లు, చాటింగ్ చేస్తూ గడిపేస్తారు. నిద్రపోకపోవడం ఓ సమస్యైతే, మొబైల్ వాడటం మరో తీవ్రమైన సమస్యే. ఈ రెండింటికీ చెక్ పెట్టాలంటే వాకింగ్, జాగింగ్ వంటివి చెయ్యాలి. ఇలా చేస్తే, బాడీలో కొవ్వు కరిగి శరీరంలో అన్ని అవయవాలూ చక్కగా పనిచేస్తాయి. దీంతో మెరుగైన నిద్రకు అవకాశం ఏర్పడుతుంది. షుగర్ లాగే హైబీపీ సమస్య కూడా చాలా మందికి ఉంటోంది. బ్లడ్ ప్రెజర్ ఎక్కువైతే మిగతా శరీర అవయవాలకూ డేంజరే. ముఖ్యంగా గుండె పోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చక్కగా 5 నిమిషాలు పరిగెడితే గుండె హాయిగా ఉంటుంది. గుండెకు రక్తాన్ని సరఫరా చేస్తే ధమనుల్లో పేరుకున్న కొవ్వు నిల్వలు కరిగిపోయి రక్త సరఫరా సరిగ్గా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com