ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఫిల్మ్ స్టూడియో: విజయ్ చందర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 06:15 PM

ఏపీ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని, 4 సంవత్సరాలలో విజయం సాధించి తీరుతారని విజయ్ చందర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ (ఏపీ ఎఫ్డీసీ) చైర్మన్గా ప్రముఖ సినీ నటులు టి.యస్. విజయ్ చందర్ గురువారం నాడు బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న సినీ ప్రముఖులు, ఆంధ్ర రాష్ట్ర ప్రముఖులు మాతృభూమి అభివృద్ధికి తోడ్పాటును అందించాలని.. కన్న గడ్డ పిలుస్తోందని విజయ చందర్ పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తనపై పెట్టిన బాధ్యతను చేసి చూపెడతానని ధీమా వ్యక్తం చేశారు.
విజయవాడలోని ఆర్టీసీ ఆడ్మినిస్ట్రేటివ్ భవన్ లో గల ఎఫ్డీసీ కార్యాలయంలో సర్వమత ప్రార్థనలు అనంతరం విజయ్ చందర్ బాధ్యతలను స్వీకరించారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ ఎండీ, సమాచార-పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ కుమార్ రెడ్డి, ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ లు పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువాతో సత్కరించారు.
అనంతరం ఏర్పాటు చేసిన మీడియాసమావేశంలో విజయ్ చందర్ మాట్లాడుతూ... స్వాతంత్ర్యం రాకముందే నుంచి చదువుకునే రోజుల్లోనే కాంగ్రెస్ జెండా పట్టుకుని తిరిగానన్నారు. దివంగత నేత రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తుకు చేసుకున్నారు. వైఎస్ఆర్ ని కలిసిన ప్రతిసారి ఆప్యాయతగా పిలిచేవారని, యోగక్షేమాలు అడిగి తెలుసుకునేవారని తెలిపారు.
ఎప్పుడు, ఎక్కడ కలిసినా.. ఏం పని మీద వచ్చావని వైఎస్ అడిగేవారని.. మీ నవ్వు చూసి వెళ్లిపోవాలని వచ్చానని చెప్పేవాడనని అన్నారు. అలాగే విమానంలో ప్రయాణంలో ఒక్కసారిగా నా వెనక నుండి భుజం తట్టేసరికి.. వైఎస్ఆర్ ని చూసి ఆనందంతో తేలానని చెప్పారు. 20 సంవత్సరాల క్రితమే మీరు తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారని ఆయనతో చెప్పాను. నీ కోరిక ఏంటని వైఎఎస్సా్ర్ అడిగితే... 20 సంవత్సరాల క్రితమే ఎఫ్డీసీ ఛైర్మన్ కావాలని అడిగాను. 


మొదటిసారి సీఎం అయినప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ పదవి ఇవ్వలేకపోయారు. రెండో సారి సీఎం అయినప్పుడు.. నీ మాట నేను మర్చిపోలేదని 3 నెలల్లో నీవు కోరుకున్న పదవి ఇస్తానని వైఎస్సార్ చెప్పారు. రాజశేఖర్ రెడ్డికి మరణం లేదు. ఆయన ఆత్మ ఎప్పుడూ మన చుట్టూనే తిరుగుతుంది. అటువంటి మహానాయకుడి తనయుడిగా.. మడమ తిప్పని నాయకుడుగా జగన్ మోహన్ రెడ్డి ఉన్నారు. రాష్ట్రంలో 151 సీట్లతో ప్రభంజనం సృష్టించారు. వైఎస్సార్ ఆత్మే జగన్ గారి ద్వారా నా కల నేరవేరింది. పేదలపాలిట వరంగా జగన్ వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా జగన్.. జగన్.. అంటూ ఆయన పేరు మారుమ్రోగుతుందని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి, విజయమ్మలకు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్రం విడిపోయి తర్వాత 5 సంవత్సరాలలో


అవతరణ దినోత్సవం చేయలేదని... జగన్ సీఎం అయ్యాక తొలిటిసారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయడం అభినందనీయం అన్నారు. రాష్ట్రం రకరకాలుగా మోసపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్వీఆర్, నాగయ్య, కన్నాంబ, సావిత్ర, శారద వంటి వారు ఎంతో గొప్ప కళాకారులు మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా తెలుగు వారి ఖ్యాతిని ఇనుమడింపజేశారని కొనియాడారు.


 


నూతన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి హైదరాబాద్ లో ఉన్న ఆంధ్రవారికి తోడ్పాటును అందించాలని పిలుపునిచ్చారు. మాతృభూమి రుణం తీర్చుకోవడానికి తెలుగు వారు సహాయ పడాలని, కన్నగడ్డ పిలుస్తోందని పిలుపునిచ్చారు. త్వరలోనే హైదరబాద్ వచ్చి ప్రముఖులను కలుస్తానని తెలిపారు. అలాగే ఏపీ ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఆలోచన చేస్తున్నారని, 4 సంవత్సరాలలో విజయం సాధించి తీరుతారని విజయ్ చందర్ చెప్పారు.
ప్రభుత్వ కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణమోహన్ మాట్లాడుతూ.. సినీరంగంలో విజయ చందర్ గురించి ప్రత్యేక చెప్పాల్సిన పనిలేదని.. 3, 4 దశాబ్ధాల క్రితమే బయోపిక్స్ లో నటించిన వ్యక్తి అని కొనయాడారు. ఆయన చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతారన్నారు.
ఏపీ, మద్రాసు రాష్ట్రాలు విడిపోయినప్పుడు అనేక ఆలోచనలు చేశారని గుర్తుచేశారు. ముక్కుసూటికి వెళ్లే మనస్తత్వం అని.. ముందు ఒక మాట మాట్లాడి, వెనక ఒక మాట మాట్లాడే వ్యక్తిత్వం లేని వ్యక్తి విజయ్ చందర్ అని చెప్పారు. ఎఫ్డీసీ ఎండీ, సమాచార-పౌరసంబంధాల శాఖ కమిషనర్ టి. విజయ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కరుణామయుడుగా, షిర్డీ సాయిబాబాగా పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న విజయ చందర్ తెలుగు ప్రజలందరికీ సుపరిచితమేనని అన్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువచేయడానికి సినిమా రంగం దోహదపడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో సినీరంగం సుస్థిరం పర్చడానికి, మౌలిక సదుపాయాలు అభివృద్ధిచేయడానికి, సినిమా అవార్డులు, మంచి సినిమాలను నిర్మిస్తే ప్రోత్సాహకాలు ఇవ్వడం వంటి అంశాలతో సినిమా పాలసీ తయారుచేసే విధంగా ఎఫ్డీసీ ముందుకెళ్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఎఫ్డీసీ జనరల్ మేనేజర్ శేష సాయి, సినియర్ పాత్రికేయులు తుర్లపాటి కుటుంబరావు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రముఖలు, సినీ రంగ ప్రముఖులు తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమంలో పాల్గొని అభినందనలు తెలిపారు.


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com