ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రఫేల్ తీర్పు... రాహుల్‌కు ఊరట!

national |  Suryaa Desk  | Published : Thu, Nov 14, 2019, 06:32 PM

రఫేల్ ఒప్పందంపై దాఖలైన రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. కోర్టు పర్యవేక్షణలో రఫేల్ అంశంపై విచారణ అవసరంలేదని ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో తామిచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని వ్యాఖ్యానించింది. చౌకీదార్ చోర్ హై వ్యాఖ్యలు తమకు ఆపాదించడం విచారకరమని పేర్కొంది. రాహుల్ క్షమాపణలను అంగీకరించిన సుప్రీంకోర్టు.. ఆయనపై దాఖలైన కోర్టు ధిక్కారణ పిటిషన్‌ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇకపై నోరుజారవద్దని రాహుల్ గాంధీని హెచ్చరించింది. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖిని దాఖలుచేసిన పిటిషన్ కొట్టివేసింది. ఇక, సార్వత్రిక ఎన్నికల ముందు దేశ రాజకీయాల్ని రఫేల్ అంశం కుదిపేసింది. ఫ్రాన్స్‌ నుంచి ఈ యుద్ధ విమానాల కొనుగోలుకు చేసుకున్న ఒప్పందంపై పెను దుమారం రేగింది. ఈ వ్యవహారం సర్వోన్నత న్యాయస్థానానికి చేరగా ఒప్పందాల్లో అవకతవకలు జరగలేదని కోర్టు తేల్చింది. అయితే, దీనిపై కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలు రివ్యూ పిటిషన్లు దాఖలు చేయగా, విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెల్లడించింది. నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో రఫేల్ విమానాల కొనుగోలుపై తీసుకున్న నిర్ణయాన్ని మోదీ సర్కారు 2015 నుంచి ముందుకు తీసుకువెళ్లింది. ధరల నిర్ణయ క్రమాన్ని మొత్తం సమర్థించారు. అయితే, రఫేల్‌పై విపక్షాల ఆరోపణల్ని నాటి కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ బలంగా తీసుకెళ్లారు. ఒప్పందంలో పారదర్శకత లేదని, అందులోని వివరాల్ని ప్రజల ముందుంచాలని ఆయన పట్టుబట్టారు. అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థను నిబంధనలకు విరుద్ధంగా ఎంపిక చేశారనేది కాంగ్రెస్‌ ఆరోపణలు చేసింది. వైమానిక దళాన్ని మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో యుద్ధ విమానాల కొనుగోలుకు యూపీఏ-2 ప్రభుత్వం 2012లో టెండర్లను ఆహ్వానించింది. అతి తక్కువ ధరకు కోట్ చేసిన ఫ్రాన్స్‌కు చెందిన డసో ఏవియేషన్‌ను ఎంపికచేశారు. మొత్తం 126 విమానాలకు రూ.68 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనావేశారు. అయితే, యూపీఏ అధికారం కోల్పోవడంతో 2015లో ఎన్‌డీఏ ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని కొనసాగించింది. మొత్తం 36 రఫేల్‌ విమానాలను రూ.58 వేల కోట్లకు కొనుగోలు ఒప్పందం కుదిరింది. ఇందులో 15 శాతం నిధుల్ని ముందే అందజేయాలి. భారత్‌కు రఫేల్‌ అత్యాధునిక మెటీయోర్‌, స్కాల్ప్‌ శతఘ్నులను సైతం అందిస్తుంది. మొత్తం రూ.58 వేల కోట్లలో 20 శాతం నిధులు భారత్‌లోని పరిశ్రమల నుంచి విడిభాగాల సేకరణకు, మరో 30 శాతం వివిధ వైమానిక, సైనిక పరిశోధన కార్యక్రమాలకు ఖర్చు చేయాలని పేర్కొన్నారు. ఇందుకోసం భారత ప్రభుత్వం ఎంపికచేసిన 75 సంస్థల నుంచి డసో తనకిష్టమైన దాన్ని ఎంచుకోవచ్చు. ఒప్పందంలో పారదర్శకత లేదని, యూపీఏ హయాంలో ప్రతి యుద్ధ విమానంపై తాము ప్రాథమికంగా నిర్ణయించిన ధర కంటే ప్రస్తుతం మూడు రెట్లు అధికంగా చెల్లిస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఆరోపించింది. ఎన్డీఏ ప్రభుత్వం తన తొలి ప్రకటనలో ఒక్కో విమానం ధర రూ. 670కోట్లుగా తెలిపిందని, ఒప్పందం తర్వాత 2016 నవంబరు 18న పార్లమెంటుకు సమర్పించిన నివేదికను బట్టి ఒక్కోదాని ధర రెట్టింపునకు పైగా అంటే సుమారు రూ.1,600 కోట్లుగా ఉందంటూ విమర్శిస్తోంది. రఫేల్‌పై దుమారం కొనసాగుతుండగా ఫ్రాన్స్ అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోశాయి. రఫేల్‌ ఒప్పంద సమయంలో రిలయన్స్‌ కంపెనీ పేరును భారత ప్రభుత్వమే సూచించిందని, అందుకే దాన్ని నిరాకరించడానికి మాకు అవకాశం దక్కలేదని అప్పటి ఫ్రాన్స్‌ అధ్యక్షుడు హొలండె ప్రకటించారు. దీంతో వివాదం మరింత రాజుకుంది. యుద్ధ విమానాల ధరలు, ఇతర పూర్తి వివరాల వెల్లడికి ప్రభుత్వం జాతీయ భద్రతను దృష్టిలో ఉంచుకుని అనే నిబంధనను సాకుగా చూపుతోందని ఆరోపిస్తూ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ చేయించాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం 2018, సెప్టెంబరు 14న కేసులన్నీ కొట్టేసింది. అయితే, ఈ తీర్పు సమీక్షించాంటూ కేంద్ర మాజీ మంత్రులు యశ్వంత్‌ సిన్హా. అరుణ్‌శౌరి, లాయర్ ప్రశాంత్‌భూషణ్‌, ఆప్‌ ఎంపీ సంజయ్‌సింగ్‌ వేర్వేరుగా సుప్రీంను ఆశ్రయించారు. ఈ వాదనల తర్వాత సమీక్షకు సుప్రీం అంగీకరించింది. తాజాగా, తీర్పు వెలువరించిన ధర్మాసనం.. వీటిని కొట్టివేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com