తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో టీటీడీ సొంతంగా డెయిరీని ఏర్పాటుచేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కల్తీ నెయ్యి సమస్య పరిష్కారానికి ఇదొక్కటే మార్గమని పేర్కొంటూ బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్... ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాశారు. రోజూ సగటున లక్ష మంది భక్తులు దర్శించుకునే.. తిరుమలలో సొంతంగా డెయిరీ ఎందుకు ఏర్పాటుచేయలేమని, ఇందుకు ప్రభుత్వం సిద్ధమైతే తాను 1000 గోవులను ఇస్తానని చెప్పారు. అంతేకాదు, ఉచితంగా మరో లక్ష గోవులను సమకూర్చే బాధ్యతను తాను తీసుకుంటానని రామచంద్ర యాదవ్ తెలిపారు.
‘రోజుకు సగటున దాదాపు లక్ష మంది భక్తులు శ్రీవారిని దర్శించుకంటారు.... రోజువారీ రూ.5 కోట్ల ఆదాయం వచ్చే తిరుమల క్షేత్రంలో సొంతంగా డెయిరీ ఎందుకు ఏర్పాటు చేయలేం?.. ప్రభుత్వం ముందుకొస్తే నా తరఫున వేయి గోవులను ఇస్తాను... మరో లక్ష ఆవులను ఉచితంగా సమకూర్చే బాధ్యత తీసుకుంటాను.. ఈ లక్ష గోవుల రోజుకు కనీసం 10 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి చేయొచ్చు. వాటి నుంచి రోజుకు 50 వేల కిలోల వెన్న తీసి, 30 వేల కేజీల నెయ్యి తయారు చేయవచ్చు. ఈ నెయ్యిలో స్వామివారు నైవేద్యాలు, ప్రసాదాలు సహి అవసరాలకు సగం వాడగా, మిగిలింది రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు పంపి, కల్తీ నెయ్యి సమస్యను నివారించవచ్చు’ అని ఆయన వివరించారు.
అలాగే, ‘ గోశాల నిర్వహణకు కనీసం 10 వేల మంది గోపాలురిని నియమించవచ్చు.. వీరిందర్నీ యాదవ సామాజిక వర్గం నుంచి తీసుకున్నట్టయితే వారికి ఉపాధి, కులవృత్తికి అవకాశంతో పాటు స్వామివారికి సేవలు చేసుకునే భాగ్యం దక్కుతుంది.. డెయిరీ ఉన్నతంగా ఉత్తమంగా నిర్వహించే సత్తా, సామర్థ్యం యాదవ సామాజిక వర్గానికి ఉంటుంది.. సొంత డెయిరీ ఉత్పత్తి ద్వారా వచ్చే ఆదాయం గోపాలురకు జీతభత్యాలు సమకూర్చే అవకాశం ఉంటుంది’ అని తెలిపారు.
‘తిరుమల ప్రపంచ ప్రసిద్ధ ఆధ్యాత్మిక కేంద్రం.. ఇది రాజకీయ పునరావాస కేంద్రమో, వ్యాపార సంస్థగానో, కార్పొరేట్ లాబీయింగుల ఆవాసంం కారాదు. తర్వలో ఏర్పాటు చేయబోయే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలిలో రాజకీయ, పారిశ్రామిక, కార్పొరేట్ రంగాలకు చెందిన వ్యక్తులు కాకుండా ఛైర్మన్ సహా సభ్యులంతా ఆధ్యాత్మిక గురువులు, ధార్మిక ప్రతినిధులు ఉండేలా చూడాలనేది మనవి.. గత ఐదేళ్ల అరాచకాలతో అపవిత్రమైన ఏడుకొండలవాడి సన్నిధిని పరిరక్షించి, పవిత్రత కాపాడడానికి ఇంతకంటే మంచి మార్గం ఉండదు’ అని లేఖలో రామచంద్ర యాదవ్ సూచనలు చేశారు.