ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చివరికి సుప్రీంకోర్టును కూడా వదల్లేదుగా

national |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 10:37 PM

సైబర్ నేరగాళ్లకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఎక్కడో కంప్యూటర్ ముందు ఉండి.. ఇంకెక్కడో ఉండే కంప్యూటర్లలోకి చొరబడి హ్యాకింగ్‌లకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా శుక్రవారం ఏకంగా భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సంబంధించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ అయింది. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్‌ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు అందులో కొత్త వీడియోలను పోస్ట్ చేశారు. అయితే అది గుర్తించిన సుప్రీంకోర్టు సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు.


సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ నేరగాళ్లు.. అందులో క్రిప్టో కరెన్సీకి సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. సుప్రీంకోర్టు అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్‌లో క్రిప్టో కరెన్సీని ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఉన్న వీడియోలు కనిపించడంతో అది చూసిన వారంతా షాక్ అయ్యారు. ఇక ఎంతో కీలక సమాచారం, సుప్రీంకోర్టు తీర్పులు ఉండే యూట్యూబ్ ఛానెల్‌లో క్రిప్టో కరెన్సీకి సంబంధించి వీడియోలు దర్శనం ఇవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం ఈ యూట్యూబ్‌ ఛానల్‌లో అమెరికాలోని రిపిల్‌ ల్యాబ్స్‌కు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్‌ఆర్పీని ప్రచారం చేస్తున్న వీడియోలు పోస్ట్ అయ్యాయి.


అయితే వీడియో ఓపెన్ చేయగా అందులో ఏమీ కనిపించలేదు. అంతేకాకుండా.. సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌ నుంచి యూట్యూబ్ ఛానెల్ లింక్‌ను ఓపెన్ చేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు.. సుప్రీంకోర్టు విచారణకు ముందు కొన్ని వీడియోలు కూడా కనిపించకుండా పోవడం కనిపించింది. ఇక శుక్రవారం ఉదయం నుంచి సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లలో ఇలాంటి సమస్య తలెత్తడంతో అది చూసిన నెటిజన్లు.. వాటికి సంబంధించిన స్క్రీన్‌షాట్లను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.


ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఐటీ విభాగం చర్యలక ఉపక్రమించింది. జాతీయ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌ను సంప్రదించడంతో ప్రస్తుతానికి ఆ యూట్యూబ్ ఛానల్‌ లింక్‌ను తొలగించారు. ఈ యూట్యూబ్‌ ఛానల్‌లో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించే కేసులతో పాటు కొన్ని కీలక కేసుల విచారణను ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటారు. వాటిని ప్రజలు వినేందుకు, చూసేందుకు ఈ అవకాశం కల్పించారు. దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచారం కేసుకు సంబంధించిన విచారణను ఇటీవల సుప్రీంకోర్టు యూట్యూబ్‌ ఛానెల్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.


ఇక ఇటీవలె హైదరాబాద్‌ మెట్రో రైల్ కార్పొరేషన్‌కు చెందిన ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అందులో క్రిప్టోకరెన్సీకి సంబంధించిన యాడ్‌ను పోస్ట్ చేశారు. క్రిప్టో కరెన్సీ కొనమని.. క్రిప్టో వాలెట్ సైట్ అడ్రస్ కూడా అందులో పేర్కొన్నారు. అయితే ఈ విషయం గుర్తించిన ఎల్ అండ్ టీ అధికారులు.. ట్విటర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు గుర్తించి ప్రయాణికులకు కీలక సూచనలు చేశారు. ఆ అకౌంట్‌లో పోస్ట్ అయ్యే ఎలాంటి లింక్‌లు క్లిక్ చేయవద్దని నెటిజన్లకు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com