ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కమలా హ్యారిస్‌కు పులు సర్వేల్లో అనుకూల ఫలితాలు

international |  Suryaa Desk  | Published : Wed, Jul 24, 2024, 10:09 PM

అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలలో ఆలస్యంగా బరిలోకి దిగినా ఊహించని రీతిలో డొనాల్డ్ ట్రంప్‌నకు ఆమె గట్టి పోటీ ఇచ్చేలా కనిపిస్తున్నారు. తాజాగా మంగళవారం విడుదలైన ‘నేషనల్ ప్రెసిడెన్షియల్ పోల్’లో ట్రంప్‌ కంటే కమలా హ్యారిస్ ముందంజలో ఉన్నారు. హ్యారిస్ పేరును బైడెన్ ప్రతిపాదించిన తర్వాత నిర్వహించిన తొలి పోల్ ఇదే కావడం గమనార్హం. రాయిటర్స్ పోల్‌లో ట్రంప్‌పై ఆమె 2 శాతం ఆధిక్యంలో నిలిచారు. కమలా హ్యారిస్‌కు 44 శాతం మంది, డొనాల్డ్ ట్రంప్‌నకు 42 శాతం మంది మద్దతుగా నిలిచారు.


మరోవైపు, డెమొక్రాట్ల పార్టీలో ఆమెకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. పార్టీ అభ్యర్థి కోసం విరాళాలు సేకరించే యాక్ట్ బ్లూ సంస్థ.. సోమవారం గంటలో 46.7 మిలియన్ డాలర్లను సమీకరించింది. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ను బైడెన్ ప్రతిపాదించిన 5 గంటల్లో చిన్న మొత్తాల్లో వచ్చిన విరాళాలే 27.5 మిలియన్ డాలర్లని యాక్ట్ బ్లూ వెల్లడించింది.


ఆగస్టు 19న చికాగాలో జరిగే పార్టీ జాతీయ సమావేశంలో డెమొక్రాట్లు తమ అధ్యక్ష అభ్యర్థిని అధికారికంగా ఎన్నుకోనున్నారు.


పార్టీలో 263 మంది చట్ట సభ్యులు, 23 మంది గవర్నర్‌‌‌‌‌‌‌‌లు ఉండగా.. వారిలో ఇప్పటికే 178 మంది హ్యారిస్‌‌‌‌‌‌‌‌కు మద్దతు తెలిపారు. పార్టీ ప్రెసిడెంట్ నామినేషన్ గెలవడానికి మొత్తం 4,800 మంది ప్రతినిధుల్లో 1,976 మంది అవసరం కాగా.. గతంలో బైడెన్ 3,896 మంది డెలిగేట్‌‌‌‌‌‌‌‌ల మద్దతును సాధించారు. ఇప్పుడు కమలాకు బైడెన్ మద్దతు ఉండటంతో చికాగో సదస్సును ఎదుర్కొవడం కష్టమేమీ కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బైడెన్ మద్దతు ఉన్నంత మాత్రాన డెమొక్రాట్లు ఆమెను అధ్యక్ష అభ్యర్థిగా అంగీకరిస్తారా? లేదా? అన్నది ఇప్పడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ చికాగో సమావేశంలో కమలా అభ్యర్ధిత్వాన్ని ఏకగ్రీవంగా ఆమోదిస్తే ఆమె తరఫున ఎన్నికల ప్రచార ఖర్చులకు ఈ విరాళాలను ఉపయోగించనున్నారు.


డెమొక్రాట్లలో 65 శాతం మంది కమలా హ్యారిస్‌కు మద్దతు తెలుపుతున్నట్టు మార్నింగ్ కన్సల్ట్ సర్వే వెల్లడించింది. ఇక, అధ్యక్షుడిగా ట్రంప్‌నకు 47 శాతం, హ్యారిస్‌కు 45 శాతం మంది మద్దతు ఇస్తున్నట్టు వెల్లడయ్యింది. సర్వేలో పాల్గొన్నవారు బైడెన్ కంటే కమలాయే బెటర్ అనే అభిప్రాయం వ్యక్తం చేశారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ట్రంప్‌ను ఓడించే సత్తా ఆమెకు ఉందని అభిప్రాయపడ్డారు. ఆమె 2018, 2020, 2022 ఫెడరల్ ఎన్నికల ద్వారా ట్రంప్‌ను ఎదుర్కొనే సామర్థ్యాన్ని కలిగి ఉందని నిరూపించుకున్నారని పేర్కొన్నారు.


అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా తనకు బైడెన్ మద్దతు ప్రకటించిన వెంటనే ట్రంప్‌పై ఎదురుదాడి మొదలుపెట్టారు కమలా హారిస్. డేలావేర్‌లోని విల్మింగ్టన్‌లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ.. నవంబరులో జరిగే ఎన్నికల్లో గెలుపు మనదేనంటూ ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ట్రంప్ మహిళలను వేధించే వేటగాడు.. వినియోగదారులను కొల్లగొట్టే కేటుగాడు.. స్వలాభం కోసం నిబంధనలను అతిక్రమించే మోసగాడు... అంటూ విరుచుకుపడ్డారు. ఆయన ఎలాంటివాడో అందరికంటే తనకే బాగా తెలుసని వ్యాఖ్యానించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com