ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒలింపిక్స్ లో వేలు తొలగించుకొని బరిలో దిగిన ఆసీస్ ప్లేయర్

sports |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 10:37 PM

ఆస్ట్రేలియాకు చెందిన ఓ క్రీడాకారుడు ఒలింపిక్స్ కోసం ఏకంగా తన వేలినే తొలగించుకున్నాడు. హాకీ ప్లేయర్ మాట్ డాసన్‌కు ఒలింపిక్స్ అంటే పిచ్చి. ఎప్పుడెప్పుడు విశ్వక్రీడల్లో పాల్గొంటానా అని, పతకం సాధిస్తానా అని ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాడు. ఇంతలోనూ ఊహించని కష్టం వచ్చింది. వెనక్కి తగ్గని మాట్ డాసన్.. అనూహ్య నిర్ణయం తీసుకున్నాడు. కాలం తనను కొన్ని రోజుల పాటు ఆటకు దూరం చేసేందుకు ప్రయత్నించినా.. అతడు మాత్రం ధైర్యం కోల్పోలేదు. అందుకోసం ఏకంగా తన ఉంగరవేలిని తృణప్రాయంగా వదిలేశాడు.


ఆస్ట్రేలియా హాకీ ప్లేయర్ మాట్ డాసన్.. ఇటీవల ఆట ఆడుతూ గాయపడ్డాడు. అతడి ఉంగరపు వేలుకు తీవ్ర గాయమైంది. డాసన్‌ను పరిశీలించిన వైద్యులు.. అతడు కోలుకునేందుకు చాలా సమయం పడుతుందని చెప్పారు. విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఈ క్రమంలో ఈ నెల చివర్లో ప్రారంభం కానున్న పారిస్ ఒలింపిక్స్ 2024కు దూరం కావాల్సి ఉంటుందని చెప్పారు. గాయం కంటే డాసన్‌ను అది ఇంకా బాధించింది.


డాక్టర్లు చెప్పిన విషయం విని.. డాసన్ షాక్‌కు గురయ్యాడు. ఒలింపిక్స్‌కు దూరం కావడం అనే మాటనే అతడిని నచ్చలేదు. దీంతో మరో ఆప్షన్ ఏమన్నా ఉందా అని అతడు వైద్యులను అడిగాడు. హాకీ పట్ల అతడికి ఉన్న ఆసక్తిని గమనించిన వైద్యులు.. మాట్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఒక అవకాశం ఉందని చెప్పారు. గాయమైన ఉంగరపు వేలును తొలగించుకుంటే వేగంగా కోలుకోవచ్చని.. ఒలింపిక్స్‌లో ఆడొచ్చని సలహా ఇచ్చారు.


ఏ ఆటగాడైనా తన వేలును కోల్పోయేందుకు ఇష్టపడడు.. కానీ, మాట్ డాసన్ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా వేలు తొలగించుకునేందుకు సిద్ధమయ్యాడు. ‘నేను వేలు తొలగించుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆ విషయం నా భార్యకు చెప్పా. తొలుత ఆమె అందుకు ఒప్పుకోలేదు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని సలహా ఇచ్చింది. కానీ, నేను ఈ ఆపరేషన్ చేయించుకుంటే ఏం జరుగుతోందో తెలుసు. ఆపరేషన్‌తో జరిగే మంచి, చెడులు కూడా తెలుసు. దీంతో వేలు తొలగించుకోవడమే సరైన నిర్ణయం అనిపించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో ఆడటంతో పాటు.. భవిష్యత్‌లో మరోసారి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలంటే.. వేలు తొలగింపే సరైందని భావించా’ అని 30 ఏళ్ల మాట్ డాసన్ చెప్పాడు.


ఈ విషయంపై స్పందించిన ఆస్ట్రేలియా పురుషుల హాకీ జట్టు కోచ్ కొలిన్ బ్యాచ్.. మాట్ చాలా గ్రేట్ అని కితాబిచ్చాడు. ‘వేగంగా కోలుకోవాలంటే వేలు తొలగింపే సరైన మార్గం. కానీ అలా చేయమని ఎవరూ చెప్పరు. పారిస్‌లో ఆడేందుకు అతడు పూర్తిగా కట్టుబడి ఉన్నాడు’ అని చెప్పుకొచ్చాడు. ఇటీవలే వేలు తొలగింపు ఆపరేషన్ చేయించుకున్న మాట్ డాసన్.. ప్రస్తుతం తనకు ఆపరేషన్ జరిగిన చోట నల్లరంగు రక్షణ కవచం ధరించి ప్రాక్టీస్ చేస్తున్నాడు. పారిస్ ఒలింపిక్స్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్నాయి. హాకీ మ్యాచులు మరుసటి రోజు అంటే జులై 27న ప్రారంభం కానున్నాయి. టోక్యో ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియా ఫైనల్‌లో ఓడింది. దీంతో రజత పతకాన్ని సాధించింది. ఆ జట్టులో మాట్ డాసన్ కూడా సభ్యుడే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com