ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భోలే బాబా ఆశ్రమంలోకి కేవలం మహిళలకే ఎంట్రీ.. వెలుగులోకి షాకింగ్ విషయాలు

national |  Suryaa Desk  | Published : Wed, Jul 10, 2024, 09:59 PM

గతవారం హత్రాస్‌ తొక్కిసలాట ఘటనతో భోలే బాబా పేరు వెలుగులోకి వచ్చింది. ఆధ్యాత్మిక గురువుగా మారిన ఈ మాజీ పోలీస్ కానిస్టేబుల్.. సత్సంగ్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట (stampede)లో 121 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి దేశం మొత్తం భోలే బాబా గురించి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో భోలే బాబాకు సంబంధించి విస్తుగొలిపే విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. రాజస్థాన్‌‌లో భోలే బాబాకు ఆధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ఆశ్రమం ఉన్న విషయం తాజాగా బయటపడింది.


ఖేడ్లీ పట్టణానికి సమీపంలోని సహజపూర్‌ గ్రామ శివారులో నారాయణ్‌ సాకర్‌ హరి అలియాస్ భోలే బాబా దాదాపు 40వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆశ్రమాన్ని నిర్మించారు. లోపలి జరిగే వ్యవహారాలు బయటకు తెలియకుండా దాని చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడలను కట్టారు. ఆశ్రమం లోపల ఆధునిక హంగులు, విలాసవంతమైన గదులు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు.


ఆశ్రమం లోపలికి వెళ్లాలంటే ముందస్తు అనుమతి తీసుకోవాలని, లేకుంటే ఎవరినీ అనుమతించరని అంటున్నారు. భోలే బాబా ఆశ్రమంలో ఉన్నప్పుడు కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం ఉంటుందని, పురుషులు, స్థానికులను రానివ్వరని గ్రామస్థులు చెప్పడం గమనార్హం. స్థానికులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తే బాబా అనుచరులు దాడి చేసేవారని, ఈ దాడులను ఆయన దీవెనలుగా ఆశ్రమవాసులు సమర్థించుకునేవారని తెలిపారు. ఇక, ఆశ్రమ నిర్మాణం కోసం పదేళ్ల కిందట గ్రామస్థుల నుంచి భోలే బాబా భూమిని చేశారని స్థానిక పంచాయితీ వార్డు మెంబరు పూల్‌ సింగ్‌ యాదవ్‌ వెల్లడించారు. 2010 నుంచి ఇక్కడ ఆశ్రమం నడుపుతున్నారని వివరించారు. బాబా ప్రవచనాలు, దీవెనల కోసం వెళ్లినప్పుడు ఆశ్రమవాసులు దాడులకు తెగబడేవారని ఆయన పేర్కొన్నారు. బాబాకు అతీత శక్తులు, సిద్ధులు ఉన్నాయని ఆశ్రమ వాసులు చెప్పే మాటలను గ్రామంలో ఎవరూ విశ్వసించరని చెప్పారు. అయినప్పటికీ సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు భోలే బాబాను దేవుడిగా కొలుస్తున్నారని చెప్పుకొచ్చారు.


మరోవైపు, గత వారం రోజులుగా పరారీలో ఉన్న భోలే బాబా ఆచూకీ మాత్రం తెలియరాలేదు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దేవప్రకాశ్ మధుకర్ సహా 10 మందిని ఇప్పటి వరకూ అరెస్ట్ చేశారు. అటు, ఎఫ్ఐఆర్‌లో మాత్రం భోలే బాబాను పోలీసులు నిందితుడిగా పేర్కొనకపోవడం గమనార్హం. తొక్కిసలాటకు నిర్వాహకులతో పాటు పోలీసుల వైఫల్యం కూడా కారణమని ఈ ఘటనపై యూపీ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం 128 మంది సాక్షుల వాంగ్మూలం నమోదుచేసినట్టు ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com