ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్‌ఐసీ ఆస్తుల ముందు పాక్ దిగదుడుపు.. ఏకంగా రూ. 50 లక్షల కోట్లు.. దేశ జీడీపీ కంటే డబుల్

business |  Suryaa Desk  | Published : Wed, May 29, 2024, 10:27 PM

మన దేశంలో బీమా (ఇన్సూరెన్స్) అనగానే మనకు గుర్తొచ్చేది ఎల్‌ఐసీనే అని చెప్పొచ్చు. భారత జీవిత బీమా రంగంలో ఇది తనదైన ముద్ర వేసుకొని అతిపెద్ద బీమా సంస్థగా అన్నింటికంటే అగ్రస్థానంలో ఉంది. ప్రైవేట్ రంగంలో కూడా కొంతకాలంగా ఎన్నో బీమా కంపెనీలు వచ్చినప్పటికీ.. ఏళ్లుగా దీని స్థానం పదిలం. అలాంటి ఈ ఎల్ఐసీ ఇప్పుడు మరో ఘనత సాధించింది. సంస్థ పరిధిలోని మొత్తం ఆస్తుల విలువ ( అసెట్స్ అండర్ మేనేజ్‌మెంట్) ఇప్పుడు ఏకంగా రూ. 50 లక్షల కోట్లు దాటడం విశేషం. ఇది మన పొరుగున ఉన్న పాకిస్థాన్ దేశ జీడీపీ కంటే రెండు రెట్లు ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరం ఆఖరి త్రైమాసికం (జనవరి- మార్చి) సమయంలో వెల్లడించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది.


కిందటి సంవత్సరం ఎల్ఐసీ ఏయూఎం రూ. 43,97,205 కోట్లుగా ఉండగా.. సంవత్సరం వ్యవధిలోనే ఆ మొత్తం ఏకంగా 16.48 శాతం పెరిగి రూ. 51.21 లక్షల కోట్లకు చేరుకుంది. డాలర్లలో చూస్తే ఇది 616 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఇంకా పాక్ జీడీపీ విషయానికి వస్తే ఇది కేవలం 338.24 బిలియన్ డాలర్లుగానే ఉంది. అంటే ఇది భారత కరెన్సీలో చూసినట్లయితే కేవలం రూ. 28 లక్షల కోట్లుగా ఉంటుంది. ఈ లెక్కన పాక్ ఆర్థిక వ్యవస్థ కంటే భారత్‌లో ఎల్ఐసీ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువే దాదాపు రెండింతలు ఉందన్నమాట. పాక్‌తో పాటు శ్రీలంక (74 బిలియన్ డాలర్లు), నేపాల్ (44 బిలియన్ డాలర్లు) మూడింటి జీడీపీ కలిపినా ఎల్ఐసీ కంటే చాలా తక్కువగా ఉంది.


>> పాకిస్థాన్‌లో కొన్నేళ్లుగా రాజకీయ అస్థిరత నెలకొంది. ఇలా రాజకీయ అనిశ్చిత పరిస్థితులతో పాకిస్థాన్ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని చెప్పొచ్చు. ఇటువైపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు.. భారత్ ఒక ఆశాకిరణంలా కనిపిస్తోంది. భారత్ సత్తా చాటుతుంటే.. మరోవైపు పాకిస్థాన్ అప్పుల ఊబిలో చిక్కుకొని రోజులు నెట్టుకొస్తోంది. అప్పులు తిరిగి చెల్లించే విషయంలో.. ఆ దేశ పరిస్థితిపై ఐఎంఎఫ్- అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ దేశ అవసరాలు తీరాలంటే.. రానున్న 5 సంవత్సరాల కాలానికి సుమారు 123 బిలియన్ డాలర్లు కావాల్సి ఉంటుందని లెక్కగట్టింది ఐఎంఎఫ్.


>> మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఎల్ఐసీ నికర లాభం ఏకంగా రూ. 40,676 కోట్లుగా నమోదైంది. ప్రీమియం వసూళ్లతో వచ్చిన ఆదాయమే రూ. 4.75 లక్షల కోట్లుగా ఉంది. కిందటేడాదిలో పాలసీ హోల్డర్స్ అందరికీ 52,955.87 కోట్ల బోనస్ ఇవ్వడం విశేషం. ఇంకా లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో 59 శాతం వాటాతో అగ్రస్థానంలోనే ఉన్న ఎల్ఐసీ.. ఇప్పుడు కొత్తగా ఆరోగ్య బీమా రంగంలోకి కూడా అడుగుపెట్టేందుకు యోచిస్తోంది. ప్రస్తుతం దేశీయ స్టాక్ మార్కెట్ సెక్టార్‌లో.. మార్కెట్ విలువను బట్టి చూస్తే ఇది ఏడో పెద్ద స్టాక్‌గా ఉంది. ప్రస్తుతం ఎల్ఐసీ షేరు రూ. 1004 లెవెల్స్‌లో ఉండగా.. మార్కెట్ విలువ ఏకంగా రూ. 6.36 లక్షల కోట్లుగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com