ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ జగన్‌కు, షర్మిలకు మధ్య అసలు గొడవ ఇదేనా.. క్లారిటీ వచ్చేసిందిగా!?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 21, 2024, 08:57 PM

ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు, షర్మిలకు ఎక్కడ చెడింది? అన్నతో విభేదించి చెల్లెలు ఎందుకు వేరే పార్టీలో చేరింది? మొదట తెలంగాణలో రాజకీయం చేసిన షర్మిల.. ఎన్నికల సమయంలో ఆంధ్రాలోకి ఎందుకు అడుగుపెట్టారు? ఇవన్నీ వైఎస్ఆర్ కుటుంబం అభిమానులను, తెలుగు రాజకీయాలను ఫాలో అవుతున్న సగటు తెలుగు వ్యక్తిని తొలిచేస్తున్న ప్రశ్నలు. వైఎస్ జగన్ జైళ్లో ఉన్నప్పుడు అన్న కోసం పాదయాత్ర చేసిన షర్మిల.. ఆ తర్వాత క్రమంగా వైసీపీలో ఫేడ్ అవుట్ అయ్యారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి.. జగన్ సీఎం అయ్యాక షర్మిల రాజకీయాల్లో కనిపించడమే మానేశారు.


ఆ తర్వాత అకస్మాత్తుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అంటూ తెలంగాణలో రాజకీయం మొదలెట్టారు షర్మిల. ప్రజా ప్రస్థానం అంటూ వేల కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అయితే తెలంగాణ రాజకీయాల్లోకి షర్మిల ఎంట్రీ అవుతున్న సమయంలోనూ జగనే.. షర్మిలను తెలంగాణ రాజకీయాల్లోకి పంపిస్తున్నారంటూ కొన్ని కథనాలు వచ్చాయి. కేసీఆర్‌కు అనుకూలంగా రెడ్డి సామాజిక వర్గపు ఓటర్లను కాంగ్రెస్ వైపు పోకుండా చూసేందుకు ఈ ఎత్తుగడ వేశారంటూ వార్తలు వచ్చాయి. అయితే వైఎస్ఆర్టీపీ అంటూ పార్టీ పెట్టిన షర్మిల.. ఎన్నికల్లో పోటీ చేయకుండానే తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఆ తర్వాత ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు.


ఏపీసీసీ చీఫ్‍‌గా ఎన్నికైన తర్వాత షర్మిల తన కుమారుడు రాజారెడ్డి వివాహం జరపించారు. ఈ వివాహ వేడుకకు అన్ని రాజకీయ పార్టీల నేతలను ఆహ్వానించారు షర్మిల. అలాగే అన్న వైఎస్ జగన్‌ను కూడా ఇంటికెళ్లి మరీ ఆహ్వానించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ఎంగేజ్‌మెంట్ ఫంక్షన్ జగన్ హాజరయ్యారు. అయితే ఈ సమయంలో షర్మిల.. తన అన్నతో అంటీముట్టనట్లుగా వ్యవహరించడం.. ఫోటో దిగడానికి కూడా అంతగా ఆసక్తిచూపకపోవటం అప్పట్లో చర్చనీయాంశమైంది. అన్నా చెల్లెళ్ల మధ్య ఏదో విభేదాలు వచ్చాయంటూ వార్తలు వచ్చాయి.


ఇక ఏపీలో ఎన్నికల ప్రచారం మొదలైన తర్వాత వైఎస్ జగన్ మీద విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు షర్మిల. ఏపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు సంధించారు. ఢిల్లీలో బీజేపీ ముందు సలాం కొట్టేవాళ్లు రాజశేఖర్ రెడ్డి వారసులు ఎలా అవుతారంటూ... నేరుగా జగన్ పైనా ఆరోపణలు చేస్తూ వచ్చారు. అలాగే మాజీ మంత్రి వివేకా హత్య కేసుల విషయంలోనూ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ జగన్ మీద షర్మిల విమర్శలు చేశారు. హత్యకేసులో నిందితులుగా ఉన్నవాళ్లకు టికెట్లు ఎలా ఇస్తారంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక ప్రచారంలో వెళ్లిన ప్రతిచోటా జగన్ మీద ఆరోపణలు చేస్తూ వచ్చారు షర్మిల.


అయితే కడప ఎంపీ స్థానానికి కాంగ్రెస్ తరుఫున పోటీ చేస్తున్న షర్మిల.. శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అందులో భాగంగా సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లో తనకున్న ఆస్తులు, అప్పులు , కేసుల వివరాలు పొందుపరిచారు. ఎన్నికల అఫిడవిట్‌లో వైఎస్ జగన్ వద్ద షర్మిల.. సుమారు రూ. 82.5 కోట్లు అప్పు చేసినట్లు ఉంది. దీంతో షర్మిల ఎన్నికల అఫిడవిట్ వివరాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ఇద్దరి మధ్యా విభేధాలు ఉన్నా కూడా షర్మిలకు జగన్ అంత అప్పు ఇచ్చారా అంటూ చర్చ జరిగింది.


ఈ క్రమంలోనే ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న అంశాలపై షర్మిల స్పందించారు. " సమాజంలో ఏ అన్న అయినా తన చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వాలి. అది ఆడబిడ్డ హక్కు. ఇవ్వాల్సిన బాధ్యత అన్నకు ఉంటుంది. మేనమామగా కూడా అది ఒక బాధ్యత. ఎందుకంటే తల్లి తర్వాత ఆ స్థానంలో నిలబడేది మేనమామే. ఇది సహజంగా అందరూ పాటించే నియమం. అయితే, కొంతమంది చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తి వాటాను తమ వాటాగా భావించి.. తామేదో చెల్లికి గిఫ్ట్‌గా ఇస్తున్నామని బిల్డప్‌ ఇచ్చే వాళ్లు కూడా సమాజంలో లేకపోలేదు. మరోవైపు ఇంకొంతమంది వాటాగా ఇవ్వాల్సింది ఇవ్వకపోగా.. చెల్లికి కొసరు ఇచ్చి, అదికూడా అప్పు ఇచ్చినట్టు చూపించేవారు కూడా ఉన్నారు. ఇది వాస్తవం. ఇది దేవుడికి తెలుసు. మా కుటుంబం మొత్తానికీ తెలుసు’’ అని షర్మిల అన్నారు. ఇక షర్మిల వ్యాఖ్యలతో అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తికి సంబంధించి విభేదాలు ఉన్నట్లు స్పష్టమవుతోందని నెటిజన్లు అంటున్నారు. వైఎస్ జగన్, షర్మిలకు ఆస్తి విషయంలో ఏదో అభిప్రాయభేదాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు,.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com