పాకిస్థాన్‌లో ఎన్నికలు జరిగి.. కొన్ని రోజులు పొలిటికల్ హైడ్రామా జరగ్గా.. చివరికి షెహబాజ్ షరీఫ్ ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. అయితే గతంలో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత కొన్నిరోజులు ప్రధానమంత్రి పదవిలో కూర్చున్న షెహబాజ్ షరీఫ్.. తాజాగా మరోసారి ఆ పీఠాన్ని అధిష్ఠించారు. సుదీర్ఘ రాజకీయ సంక్షోభం తర్వాత పాకిస్థాన్‌కు 24 వ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ అయ్యారు. పంజాబ్ ప్రావిన్స్ నుంచి రాజకీయా జీవితాన్ని ఆరంభించిన షెహబాజ్ షరీఫ్.. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు. ఇక పంజాబ్ ప్రావిన్స్‌కు రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇక పాకిస్థాన్‌లోని టాప్ బిజినెస్‌మెన్‌లలో షెహబాజ్ షరీఫ్ ఒకరు.
72 ఏళ్ల షెహబాజ్ షరీఫ్ ఇప్పటివరకు 5 పెళ్లిళ్లు చేసుకున్నారు. అందులో ముగ్గురు భార్యలతో విడాకులు జరగ్గా.. మిగిలిన ఇద్దరు భార్యలతో కలిసి ఉంటున్నట్లు తెలుస్తోంది. 1973 లో తనకు 23 ఏళ్లు ఉన్నపుడు తన కుటుంబ సభ్యుల అనుమతి లేకుండానే నుస్రత్ షెహబాజ్ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. నుస్రత్ షెహబాజ్ మరణించిన తర్వాత 1993 లో 43 ఏళ్ల వయసులో మోడల్ అలియా హనీని పెళ్లి చేసుకున్నా.. వారి బంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. దీంతో వారిద్దరు విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత అలియా హనీ అనుమానాస్పద స్థితిలో చనిపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తర్వాత అదే ఏడాదిలో నీలోఫర్ ఖోసాను పెళ్లి చేసుకున్న షెహబాజ్ షరీఫ్.. ఎక్కువ రోజులు కలిసి ఉండలేదు.
ఆ తర్వాత కొన్నేళ్లపాటు ఒంటరిగానే ఉన్న షెహబాజ్ షరీఫ్.. 2003 లో 53 ఏళ్ల వయసులో పాకిస్థానీ రచయిత్రి, కళాకారిణి అయిన తెహ్మిని దురానీని పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరూ 8 ఏళ్ల పాటు రహస్యంగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం. ఇక చివరగా 2012 లో షెహబాజ్ షరీఫ్ 60 ఏళ్ల వయసు ఉన్నపుడు ఐదో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కుల్సూమ్ హాయి అనే మహిళను రహస్యంగా షెహబాజ్ షరీఫ్ పెళ్లి చేసుకోగా.. కొన్ని రోజుల తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకున్నట్లు సమాచారం.
ఇక బిజినెస్‌మెన్ అయిన షెహబాజ్ షరీఫ్ ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఇక షెహబాజ్ షరీఫ్‌కు పాకిస్థాన్‌లో కన్నా విదేశాల్లోనే ఎక్కువగా ఆస్తులు ఉన్నాయి. పాకిస్థాన్ ఎన్నికల కమిషన్‌కు దాఖలు చేసిన లెక్కల ప్రకారం.. షెహబాజ్ షరీఫ్ నికర ఆస్తుల విలువ రూ.13.20 కోట్లు అని తెలుస్తోంది. ఇక లండన్‌లో షెహబాజ్ షరీఫ్‌కు భారీగా ఆస్తులు ఉన్నాయి. లండన్‌లో షెహబాజ్ షరీఫ్‌కు ఉన్న మొత్తం ఆస్తుల విలువ రూ.15.3 కోట్లు కాగా.. పాకిస్థాన్‌లో రూ.10.8 కోట్ల ఆస్తులు ఉన్నాయి. దీంతో ఆయన మొత్తం ఆస్తులు రూ.26.3 కోట్లు.
ఇక ఆయనకు అప్పులు కూడా ఉన్నాయి. రూ.13.26 కోట్లు అప్పులు షెహబాజ్ షరీఫ్ చేశారు. ఈ ఆస్తుల్లో భూములు, పరిశ్రమల్లో పెట్టుబడులు, రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, వాహనాలు, బ్యాంకు ఖాతాల్లో డబ్బులు వంటివి ఉన్నాయి. ఇక షెహబాజ్ షరీఫ్ భార్యల పేరు మీద కూడా భారీగానే ఆస్తులు ఉన్నాయి. షెహబాజ్ మొదటి భార్య నుస్రత్ షెహబాజ్ పేరు మీద రూ.27 కోట్లు అని.. రెండో భార్య తెహ్మిని దురానీ వద్ద రూ.1 కోటి ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన భార్యల పేరు మీద మొత్తం ఉన్న ఆస్తుల విలువ రూ.41.8 కోట్లు అని ఎన్నికల సంఘానికి ఇచ్చిన వివరాల ద్వారా తెలుస్తోంది.
![]() |
![]() |