ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజకీయాలకు రిటైర్మెంట్ బీజేపీ సీనియర్ నేత డాక్టర్ హర్షవర్దన్

national |  Suryaa Desk  | Published : Mon, Mar 04, 2024, 10:13 PM

లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. బీజేపీ లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితా విడుదలైన మర్నాడే ఆయన రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ప్రస్తుతం ఆయన ప్రాతినిధ్యం వహిస్తోన్న ఢిల్లీలోని చాందీ చౌక్ నుంచి పవన్ ఖండేవాల్‌‌కు బీజేపీ టిక్కెట్ కేటాయించింది. మూడు దశాబ్దాల తన రాజకీయ జీవితంలో ఐదుసార్లు అసెంబ్లీ, రెండుసార్లు పార్లమెంట్‌కు ఎన్నికైన విషయాన్ని డాక్టర్ హర్షవర్దన్ గుర్తుచేసుకున్నారు. పార్టీ, ప్రభుత్వంలో అనేక ప్రతిష్ఠాత్మక పదవులను నిర్వహించానని తెలిపారు.


‘ముప్పై ఏళ్ల రాజకీయ ప్రయాణంలో మొత్తం ఐదు అసెంబ్లీలు, రెండు పార్లమెంటు ఎన్నికలలో పోరాడి గెలిచాను.. చివరకు పార్టీ, ప్రభుత్వాలలో అనేక ప్రతిష్టాత్మక పదవులను నిర్వహించాను.. చివరకు నేను తిరిగా నా మూలాలకు వెళ్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ‘పేదలకు సహాయం చేయాలనే కోరికతో 50 సంవత్సరాల కిందట కాన్పూర్‌లోని జీఎస్వీఎం మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్‌లో చేరాను.. మెడిసిన్‌లో చేరినప్పుడు మానవాళికి సేవ చేయడమే నా నినాదం.. స్వయంసేవక్‌గా నేను ఎల్లప్పుడూ క్యూలో ఉన్న చివరి మనిషికి సేవ చేయాలనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ అంత్యోదయ తత్వానికి అమితమైన అభిమానిని. అప్పటి ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకత్వం ఒత్తిడి మేరకు నేను ఎన్నికల్లో దిగాను. నాకు రాజకీయాలు అంటే ప్రధాన శత్రువులైన పేదరికం, అనారోగ్యం, అజ్ఞానంతో పోరాడే అవకాశం’ అని తెలిపారు.


‘సామాన్యులకు సేవ చేయాలనే నా అభిరుచిని పక్కనబెట్టిన అద్భుతమైన ఇన్నింగ్స్ అని చెప్పాలి.. నేను ఢిల్లీ ఆరోగ్య మంత్రిగా అలాగే రెండుసార్లు కేంద్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశాను.. ఇది నా మనసుకు దగ్గరైన అంశం. పోలియో రహిత భారత్‌ను రూపొందించడానికి మొదట కృషి చేయగలిగిన అరుదైన అవకాశం నాకు లభించింది.. భయంకరమైన కోవిడ్-19 మహమ్మారి మొదటి, రెండు దశల్లో పోరాడుతున్న మిలియన్ల మంది మన దేశ ప్రజల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకునే అవకాశం నాకు లభించింది’ అని పేర్కొన్నారు.


‘ఇక నేను వేచి ఉండలేను.. నేను నా వాగ్దానాన్ని నిలబెట్టుకుంటాను.... నేను నిద్రపోయే ముందు మైళ్ల దూరం వెళ్ళాలి!! నాకు ఒక కల ఉంది ..మీ ఆశీర్వాదాలు నాకు ఎప్పుడూ ఉంటాయని నాకు తెలుసు. కృష్ణా నగర్‌లోని నా ఈఎన్‌టీ క్లినిక్ కూడా నేను తిరిగి రావడానికి ఎదురుచూస్తోంది’ అని ఉద్వేగానికి గురయ్యారు. డాక్టర్ హర్దవర్దన్ పేదల వైద్యుడిగా గుర్తింపు పొందారు. వైద్యుడిగా ఎంతో మంది పేదలకు ఉచితంగా వైద్యం అందజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com