మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జారీచేసిన సమన్లను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, సీఎం అరవింద్ కేజ్రీవాల్ తిరస్కరిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా, ఈడీ విచారణకు హాజరయ్యేందుకు ఢిల్లీ సీఎం సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే, మార్చి 12 తర్వాతే తాను ఈడీ ఎదుట హాజరవుతానని ఈ మేరకు తాజా సమన్లకు ఇచ్చిన సమాధానంలో కేజ్రీవాల్ పేర్కొన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. మద్యం కుంభకోణం కేసులో మార్చి 4న విచారణకు రావాలని పేర్కొంటూ ఈడీ ఎనిమిదోసారి సమన్లు జారీ చేసింది.
ఈసారీ గైర్హాజరైన ఆప్ అధినేత. ఈడీకి తన సమాధానం పంపారు. దర్యాప్తు సంస్థ సమన్లు చట్ట విరుద్ధమని మరోసారి ఆరోపించారు. అయినప్పటికీ వారి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కానీ, మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ఈడీకి పంపిన లేఖలో ఆయన తెలిపిపట్టు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దర్యాప్తు సంస్థ మాత్రం కేజ్రీవాల్ తమ ఎదుట భౌతికంగా హాజరుకావాల్సిందేనని మొండి పట్టుదలతో ఉంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించే అవకాశం లేదని తెలిపింది.
ఢిల్లీ మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు గతేడాది నవంబర్ 2న ఈడీ మొదటిసారి సమన్లు జారీ చేసింది. అప్పటి నుంచి వరుసగా నోటీసులు పంపుతున్పప్పటికీ ఆయన హాజరు కావడం లేదు. సమన్లకు సీఎం స్పందించకపోవడంతో ఈడీ కొద్దిరోజుల కిందట కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడంతో కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను మార్చి 16కి వాయిదా వేసింది. ఆ రోజు వ్యక్తిగతంగా న్యాయస్థానం ఎదుట హాజరుకానున్నారు.
ఢిల్లీ నూతన మద్యం విధానంలో వ్యాపారులకు ప్రయోజనం కలిగేలా వ్యవహరించి, వారి నుంచి రూ.100 కోట్ల మేర లబ్ది పొందినట్టు ఈడీ ఆరోపిస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ కీలక నేతలు మనీశ్ సిసోడియా, సంజయ్ సింగ్‌లను జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. సిసోడియాను గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ.. అక్టోబరు 5న సంజయ్ సింగ్‌ను ఈడీ అరెస్ట్ చేశాయి.