ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైసూరులో బంగారు అంబారీ మోసే ఏనుగు అర్జున మృతి,,,,అధికారుల నిర్లక్ష్యమే కారణమన్న మావటి

national |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 10:46 PM

మైసూరులో దసరా ఉత్సవాల ఏనుగు ‘అర్జున’ మృతి ఘనటలో సంచలనం వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఆ ఏనుగు ప్రాణాలు కోల్పోయిందని మావటి తెలిపాడు. ఈ విషయం వెలుగులోకి రావడంతో భక్తులు ఆగ్రహంతో మండిపడుతున్నారు. ఘటనపై విచారణ జరిపించి, దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. బెంగళూరులో ఇలాగే చిరుతపులి మృతికి కారణమయ్యారని.. నెల వ్యవధిలో అధికారుల నిర్లక్ష్యంగా వన్యప్రాణి ప్రాణాలు కోల్పోవడం ఇది రెండోసారి అని మండిపడుతున్నారు.


అడవి నుంచి వచ్చి జనావాసాల్లో బీభత్సం చేస్తున్న ఏనుగులను బంధించే ఆపరేషన్ నిమిత్తం అధికారులు అర్జునను తీసుకెళ్లారు. అక్కడ ఆపరేషన్ కొనసాగుతుండగా.. ఓ మదపుటేనుగు బీభత్సం చేసింది. దాన్ని భయపెట్టి తరిమేసేందుకు అధికారులు గాల్లోకి కాల్పులు జరిపారు. అయితే, ఆ కాల్పులు మిస్ ఫైర్ అయ్యి, అర్జున మృతికి కారణమైనట్లు తెలుస్తోంది. ఫారెస్టు అధికారుల తుపాకీ నుంచి దూసుకొచ్చిన తూటా గురితప్పి అర్జున కాలిలోకి దూసుకెళ్లిందని.. అది నొప్పితో విలవిల్లాడుతుండగా మదపుటేనుగు వచ్చి దాడి చేసిందని మావటి తెలిపాడు. అర్జున కదల్లేని స్థితిలో ఉండిపోవడంతో మదపుటేనుగు దాడి నుంచి తప్పించుకోలేకపోయిందని మావటి చెప్పినట్లు స్థానికంగా వార్తా కథనాలు వెలువడ్డాయి. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ వెటర్నరీ డాక్టర్ కూడా ఇదే విషయాన్ని చెప్పారు.


‘బుల్లెట్ గాయంతో విలవిల్లాడుతూ కిందపడిపోయిన అర్జునకు చికిత్స అందించేందుకు ప్రయత్నించాం. మదపుటేనుగు ఘీంకరిస్తూ అటుగా పరుగెత్తుకొచ్చింది. దీంతో సిబ్బంది అందరూ దూరంగా పరుగెత్తారు. నిస్సహాయ స్థితిలో ఉన్న అర్జునపై మదపుటేనుగు దాడి చేసి, దంతాలతో పొట్టను చీల్చేసింది. దీంతో అర్జున రక్తపుమడుగులో కుప్పకూలి ప్రాణాలు విడిచింది’ అని వెటర్నరీ డాక్టర్ తెలిపారు.


మైసూరు దసరా ఉత్సవాల పేరు చెప్పగానే ఏనుగు అంబారీ గుర్తుకొస్తుంది. ఈ ఉత్సవాల్లో అర్జున మొత్తం 22 సార్లు పాల్గొంది. భక్తులతో జేజేలు అందుకుంది. అయితే, మూడేళ్ల కిందట దీని వయస్సు 60 ఏళ్లు దాటడంతో ఈ సేవల నుంచి తప్పించారు. నిబంధనల ప్రకారం.. 60 ఏళ్లు పైబడిన ఏనుగులను అంబారీ మోసే కార్యక్రమాల్లో వినియోగించడానికి వీల్లేదు. కొంత కాలంగా అర్జునను మదగజాలను బంధించే ఆపరేషన్‌లలో వినియోగిస్తున్నారు. పలు ఆపరేషన్లను ఈ ఐరావతం విజయవంతంగా పూర్తి చేసింది. రెండు రోజుల కిందట హసన్ జిల్లాలోని సకలేశపురలో యసళూరు బాళెకెరె అటవీ ప్రాంతంలో మదగజాలను బంధించేందుకు అధికారులు చేపట్టిన ఆపరేషన్‌ కోసం అర్జునను తీసుకెళ్లారు. అర్జున, మరో మూడు ఏనుగులను కూడా తీసుకెళ్లారు. ఈ ఏనుగులకు రేడియో కాలర్లను ఏర్పాటు చేసి బంధించేందుకు తీసుకుంటున్న చర్యలకు ‘అర్జున’ నేతృత్వం వహించింది. 2.95 మీటర్ల ఎత్తు, సుమారు 6 టన్నుల బరువుండే అర్జున.. తొలినాళ్లలో ఉద్రేక ప్రవర్తనతో వార్తల్లోకి ఎక్కింది. కాకనకూట అటవీ ప్రాంతంలో 1968లో దీన్ని బంధించారు. నాగరహొళ జాతీయ ఉద్యానంలోని శిబిరంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 1996లో స్నానం చేస్తూ నీటిలో పడిపోయిన మావటిని తొక్కి చంపేసింది. ఈ ఘటనను ప్రమాదంగా పేర్కొన్న అధికారులు.. ఆ తర్వాత అర్జునను దైవ కార్యక్రమాల్లో యధావిథిగా వినియోగించారు. 60 ఏళ్లు దాటడంతో 2020లో హౌడా ఏనుగుల జాబితా నుంచి తొలగించారు. దీంతో మైసూరు దసరా ఉత్సవాలకు అర్జున స్థానంలో అభిమన్యుడు వచ్చి చేరాడు.


పులులు, మదపుటేనుగుల వేటలో అర్జున కీలక పాత్ర పోషించిందని అధికారులు గుర్తు చేసుకుంటున్నారు. అర్జున మరణవార్త విని భక్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలకు స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై నివాళి అర్పించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com