ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీపై మిచౌంగ్ తుఫాన్ ప్రభావం,,,,భారీ వర్షాలు,,,,మత్స్యకారులకు అలర్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Dec 06, 2023, 09:33 PM

మిచౌంగ్ తుఫాన్ బాపట్లకు దక్షిణాన తీరం దాటింది. మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల మధ్య బాపట్లకు నైరుతి దిశగా 15 కి.మీల దూరంలో తీవ్ర తుఫాన్‌గా తీరాన్ని దాటింది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి. తీరం దాటడానికి 3 రోజుల ముందు నుంచి బంగాళాఖాతంలో తుఫాన్ 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో బాపట్ల వైపు దూసుకువచ్చింది. మంగళవారం రాత్రి 9 గంటలకు బాపట్లకు 20 కిలోమీటర్లు, ఒంగోలుకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.


మంగళవారం రాత్రి 10గంటల సమయానికి బలహీనపడి తుఫాన్‌గా మారింది. అయితే తీవ్ర తుఫాన్‌ తీరం దాటిన తర్వాత ఉత్తరంగా పయనించి దిశ మార్చుకుంది.. ఉమ్మడి కృష్ణాజిల్లా మీదుగా తెలంగాణలోని ఖమ్మం, అక్కడ నుంచి ఛత్తీస్‌గఢ్ దిశగా పయనించనుంది. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటాక తీవ్ర వాయుగుండంగా.. తర్వాత వాయుగుండంగా బలహీనపడనుంది. ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా అది బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే దిశ మార్చుకున్నందున తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తాలో వర్షాలు కొనసాగుతాయని.. బుధవారం కూడా కోస్తాలో విస్తారంగా, రాయలసీమలో పలుచోట్ల, ఉత్తర కోస్తాలో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బలమైన గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.


మరోవైపు ప్రకాశం, బాపట్ల, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా, పశ్చిమ­గోదావరి, బీఆర్‌ అంబేద్కర్‌ కోన­సీమ, కాకినాడ, తూర్పుగోదా­వరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ బలహీనపడినా బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తిరుపతి, అన్నమయ్య, అనకాపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మిచౌంగ్‌ తుఫాన్‌ ప్రభావంతో భారీవర్షాలు, ఈదురు గాలులతో కోస్తా జిల్లాలు వణికిపోయాయి. మూడు రోజులుగా ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసిన తుఫాన్‌... తీరం దాటే వేళ పెను విధ్వంసాన్నే సృష్టించింది. తుఫాన్‌ ధాటికి సముద్రం అల్లకల్లోలంగా మారింది. అలలు 3 మీటర్ల మేర ఎగిసిపడ్డాయి.. దాదాపు 50 నుంచి 100 అడుగుల మేర సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది.


మిచౌంగ్ తుఫాన్ బాపట్ల జిల్లాను ముంచెత్తింది. ఉదయం నుంచి గంటకు 90-110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయగా.. తీరం దాటే సమయంలో మరింత కల్లోలం సృష్టించింది. గాలుల ధాటికి తీరంలో ఏర్పాటు చేసిన బల్లలు ఎగిరిపడ్డాయి. సమీపంలోని రిసార్టులో షెడ్డు కూలిపోగా, కరెంటు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. సూర్యలంక తీరంవద్ద 3నెలల క్రితమే ప్రారంభించిన పోలీస్‌ వాచ్‌ టవర్‌ కుంగిపోయింది. అలాగే పంటలు కూడా నీటమునిగాయి. నెల్లూరు జిల్లాను తుఫాన్‌ వణికించింది. అతి భారీవర్షాలకు తోడు పెనుగాలులు వీచాయి.. దీంతో భారీవృక్షాల నుంచి చిన్నచెట్ల వరకు గాలుల దెబ్బకు ఒరిగిపోయాయి. చాలాచోట్ల రోడ్ల మీద, భవనాల మీద చెట్లు పడిపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వీటిని తొలగించేందుకు అధికార యంత్రాంగంతో పాటు స్థానికులు తీవ్రంగా శ్రమించారు. భారీ వృక్షాలు కూలడంతో చాలా భవనాలు, వాహనాలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌ స్థంభాలు కూలడంతో విద్యుత్‌, కమ్యూనికేషన్‌ వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అలాగే పంటలు కూడా నీటమునిగాయి.


తిరుపతి జిల్లాలో కూడా అదే పరిస్థితి కనిపించింది. భారీ వర్షాలకు, పెనుగాలుల తాకిడికి పెద్ద సంఖ్యలో ఇళ్లు, పూరి గుడిసెలు కూలిపోయాయి. వందలాది చెట్లు విరిగి విద్యుత్‌ స్తంభాలపైన, తీగలపైన పడ్డాయి. పలుచోట్ల వాగుల ఉధృతికి రోడ్లు, కల్వర్టులు కొట్టుకుపోయాయి. ఆయా చోట్ల రాకపోకలు స్తంభించాయి. తిరుమలలో గోగర్భం, పాపవినాశనం డ్యామ్‌ల గేట్లు తెరిచి నీటిని విడిచి పెడుతున్నారు. ఆకాశగంగ, కుమారధార, పసుపుధార డ్యాంలు నిండిపోయి నీరు దిగువకు ప్రవహిస్తోంది. భారీ వర్షాలతో పంటలు నీట మునిగాయి.


మిచౌంగ్‌ తుఫాన్ రైతులను కోలుకోలేని దెబ్బతీసింది.. భారీవర్షాలతో లక్షలాది ఎకరాల్లో వరి, పత్తి, శనగ, మినుము, పొగాకు, మొక్కజొన్న, జూట్‌, పసుపు పైర్లు నీటమునిగాయి. అరటి, కంది, బొప్పాయి, మునగ వంటి తోటలు గాలులకు ధ్వంసమయ్యాయి. ఓదెలపై ఉన్న వరి పనలు, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయాయి. కల్లాల్లో ధాన్యంపై పట్టలు కప్పినా, బస్తాలకు ఎత్తిన ధాన్యం కూడా తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కొంతవరకు ధాన్యాన్ని మిల్లులకు తరలించినా.. మరికొన్నిచోట్ల ధాన్యం వానకు తడిసిపోయింది.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com