ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణకు వర్ష సూచన.. నేడు ఈ జిల్లాల్లో వానలు, ఎల్లో అలర్ట్ జారీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 10:09 PM

తెలంగాణలో గతకొన్ని రోజులుగా భిన్న వాతావరణం నెలకొని ఉంటుంది. ఓ వైపు ఎండల తీవ్రత పెరుగుతుండగా.. మరోవైపు వర్షాలు కూడా దంచికొడుతున్నాయి. తాజాగా.. తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు రెయిన్ అలర్ట్ జారీ చేసారు. రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. ప్రస్తుతం బంగాళాఖాతం తూర్పు తీర రాష్ట్రాలకు తుపాను ముప్పు పొంచి ఉందన్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని వెల్లడించారు.


ఉత్తర అండమాన్ సముద్రం ఎగువ ప్రాంతంలో సైతం ఆవర్తనం ఏర్పడిందన్నారు. ప్రస్తుతం పశ్చిమ - వాయువ్య దిశగా కదులుతూ మరింత బలపడి ఈనెల నేడు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు చెప్పారు. రేపటికి తూర్పు - మధ్య బంగాళాఖాతంలో తుపాన్‌గా ఏర్పడే ఛాన్స్ ఉందన్నారు. ఇది వాయువ్య దిశగా కదులుతూ ఈనెల 24 తేదీన ఒడిశా -పశ్చిమ బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.


నేడు రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్‌, ఆదిలాబాద్‌, కొమరంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, వరంగల్‌, హనుమకొండ, జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని చెప్పారు. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయని వెల్లడించారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గాలుల వేగం గంటకు 30-40 కి.మీ ఉంటుందని చెప్పారు. పలు చోట్ల పిడుగులు పడే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


ఇవాళ హైదరాబాద్‌లో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఉదయం ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. మధ్యాహ్నం ఎండ కాసినా సాయంత్రానికి చల్లబడి వర్షం కురుస్తుందని చెప్పారు. వర్షం కురిసే సమయంలో ప్రజలకు ఇళ్ల నుంచి బయటకు రాకపోవటం మంచిదని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. ఇక అల్పపీడన ప్రభావంతో ఏపీలోనూ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. అల్లూరి, అనకాపల్లి, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలకు ఛాన్స్ ఉందన్నారు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com