ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎన్నికలు రాకముందే ఆ గ్రామ సర్పంచ్ ఏకగ్రీవం.., కండీషన్లు ఇవే

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Sep 11, 2024, 08:58 PM

తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడెప్పుడా అని చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. సర్పంచ్‌ల పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ముగియటంతో స్థానిక సంస్థల నోటిఫికేషన్ కోసం గల్లీ లీడర్లు ఆశగా చూస్తున్నారు. స్థానికంగా అందుబాటులో ఉంటూ.. గ్రామాల్లో ఓటర్లను మచ్చికచేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే.. ఓ గ్రామంలో మాత్రం సర్పంచ్ ఎన్నిక పూర్తయింది. పోటీ లేకుండానే ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకోవటమే కాదు.. గెలుపు సంబరాలు కూడా చేసుకున్నారు. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో సుమారుగా 883 మంది జనాభా ఉంటారు. వీరిలో అటూ ఇటుగా 700 మంది వరకు ఓటర్లు ఉన్నారు. అయితే నిధుల సమస్యతో గత పాలకవర్గం హయంలో పెద్దగా అభివృద్ధి జరగలేదు. దీంతో గ్రామంలో చాలావరకు సమస్యలు పేరుకుపోయాయి. దానికి తోడు గ్రామంలో గ్రామ దేవతలైన బొడ్రాయి, పోచమ్మ, ఆంజనేయ స్వామి విగ్రహం లేకపోవటంతో అరిష్టాలు జరుగుతున్నాయనే అపోహ తండా ప్రజల్లో బలంగా నాటుకుపోయింది. ఇటీవల వరుసగా కొందరు యువకులు వివిధ కారణాలతో ప్రాణాలు కోల్పోవటమే అందుకు కారణం. దీంతో గ్రామస్థులంతా ఈ సమస్యలపై చర్చించారు. బొడ్రాయి పండగ నిర్వహించటంతో పాటు ఆలయాలు నిర్మించిన వారిని సర్పంచ్‌గా ఎన్నుకోవాలని డిసైడ్ అయ్యారు.


దీంతో ధరావత్ బాలాజీ అనే వ్యక్తి ముందుకొచ్చాడు. గ్రామస్థులంతా ఒప్పుకుంటే తానే సర్పంచ్‌గా ఉంటానని చెప్పాడు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే.. సొంత డబ్బులతో బొడ్రాయి, పోచమ్మ, ఆంజనేయుడికి ఆలయాలు కట్టిస్తానని హామీ ఇచ్చాడు. బొడ్రాయి పండుగ ఖర్చు కోసం తండాలోని ప్రతి ఇంటికి రూ.1000 చొప్పున కానుకగా పంచిపెడాతనని చెప్పాడు. రానున్న ఎన్నికల్లో తండాలో ఎవరూ పోటీ చేయకుండా తనను ఏకగ్రీవం చేస్తే ఇచ్చిన హామీలు నెరవేరుస్తానని హామీ ఇచ్చాడు. బాలాజీ కండీషన్లకు గ్రామస్థులంతా ఒప్పుకున్నారు. ఈ మేరకు గ్రామంలో మీటింగ్ పెట్టుకుని అగ్రిమెంట్ పేపర్ కూడా రాసుకున్నారు.


గ్రామస్థులు కోరిన మేరకు మూడు ఆలయాలు, ఇంటికి రూ. 1000 చొప్పున ఇచ్చేందుకు అగ్రిమెంట్ చేసుకున్న బాలాజీ గ్రామస్థులకు మరో షరతు పెట్టాడు. సర్పంచ్ ఎన్నికల సమయంలో కేవలం తన ఇంటి నుంచి మాత్రమే నామినేషన్ వేయాలని అన్నాడు. ఈ కండీషన్ అతిక్రమించి ఎవరైనా నామినేషన్ వేస్తే రూ.50 లక్షల వరకు ఫైన్ విధించాలన్నాడు. ఈ కండీషన్ కూడా అగ్రిమెంట్‌లో రాయించాడు. ఒప్పంద పత్రంపై బాలాజీతో పాటుగా గ్రామ పెద్దలు సంతకాలు పెట్టారు. అనంతరం సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయిందంటూ రంగులు పూసుకొని సంబరాలు చేసుకున్నారు.


సర్పంచ్ ఏకగ్రీవంపై విచారణవిషయం తెలుసుకున్న మండల ఎమ్మార్వో, ఎంపీడీవో తండాకు చేరుకున్నారు. ఏకగ్రీవ సర్పంచ్గా చెప్పుకున్న దారావత్ బాలాజీ ఇతర గ్రామ పెద్దలతో మీటింగ్ నిర్వహించారు. తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలేదని.. చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించుకునే ఏ ఎన్నిక చెల్లవని చెప్పారు. ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నిక అగ్రిమెంట్, అందుకు సంబంధించిన వీడియోలపై ఆరా తీశారు. అలా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. దీంతో మాట మార్చిన బాలాజీ.. తనను ఏకగ్రీవంగా సర్పంచ్‌గా ఎన్నుకోలేదని.. విరాళాల ద్వారా ఆలయాలు నిర్మిస్తామని చెప్పారు. పదవుల కోసం తాము ఈ పని చేయలేదని అన్నారు. అగ్రిమెంట్ ఘటనతో తనకు ఎటువంటి సంబంధం లేదని అధికారులకు వివరణ ఇచ్చాడు.











SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com