ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొక్కజొన్నకు రికార్డు ధర.. మార్కెట్ చరిత్రలోనే తొలిసారి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 31, 2024, 09:04 PM

మెుక్కజొన్న సాగు చేస్తున్న రైతుల పంట పండింది. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో మక్కలకు రికార్డు ధర పలుకుతోంది. నెల రోజులుగా తన రికార్డును తానే బ్రేక్ చేస్తూ మొక్కజొన్న శుక్రవారం (ఆగస్టు 30) భారీ ధర పలికింది. మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా హయ్యెస్ట్ రికార్డు ధర పలికింది. క్వింటా మక్కలకు రూ.2,960 ధర వచ్చినట్లు మార్కెట్ అధికారులు వెల్లడించారు. కాగా మెక్కజొన్నకు మంగళవారం రూ.2,885, బుధవారం రూ.2,911, గురువారం రూ. 2936 ధర వచ్చింది. ఎన్నడూ లేని విధంగా మెుక్క జొన్నలు రికార్డు ధర పలకటం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆసారి మెుక్కజొన్న సాగు లాభసాటిగా ఉందని అంటున్నారు.


ఖమ్మం మార్కెట్‌కు మాడ్రోజులు సెలవులు


ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులపాటు సెలవులు ప్రకటించారు. ఈ మేరకు మార్కెట్ శాఖ అధికారులు ప్రకటన విడుదల చేశారు. నేడు, సెప్టెంబర్ ఒకటి తేదీల్లో వారంతపు సెలవులు కాగా.. సెప్టెంబర్ 2 అమావాస్య సందర్భంగా సెలవు ప్రకటిస్తున్నట్లు వెల్లండిచారు. తిరిగి సెప్టెంబర్ 3 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయన్నారు. రైతులు ఈ విషయాన్ని గమనించాలని పేర్కొన్నారు. బుధవారం నుంచి రైతులు తమ పంటను మార్కెట్‌కు తీసుకురావాలని సూచించారు.


పెసలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభంరాష్ట్రంలోని పెసలు పంటను శుక్రవారం నుంచి మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. మార్క్‌ఫెడ్‌ ద్వారా ఏడు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, నారాయణపేట, కామారెడ్డి జిల్లాల్లో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. తెలంగాణలో ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 64,175 ఎకరాలలో పెసర పంట సాగు చేసినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వెల్లడించారు. మొత్తం 17,841 టన్నుల వరకు దిగుబడి రావచ్చునని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. పెసర సాగు అధికంగా ఉన్న ఏడు జిల్లాల్లో తొలి విడతగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. కేంద్రం నిర్దేశించిన విధంగా పెసలు క్వింటాలుకు రూ.8,682 మద్దతు ధరతో మార్క్‌ఫెడ్‌ కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. . రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించి పంటకు మద్దతు ధర పొందాలని ఆయన సూచించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com