తెంలగాణ అసెంబ్లీ ఎన్నికలు కీలక ఘట్టానికి చేరుకున్నాయి. రేపు (నవంబర్ 30న) పోలింగ్ జరగనుంది. ఎన్నికల సంఘం అధికారులు పోలింగ్‌కు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇవాళ, రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని స్కూళ్లకు రెండ్రోజులు పూర్తిగా సెలవులు ప్రకటించగా.. తెలంగాణ వ్యాప్తంగా పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన స్కూళ్లకు కూడా రెండ్రోజులు సెలవులు ఇచ్చారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు కూడా పోలింగ్ రోజును సెలవుగా ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కను వినియోగించుకోవాలి.. ఓటింగ్ శాతాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. పోలింగ్ రోజను కార్యాలయాలకు సెలవులు ఇవ్వకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది.
అయితే హైదరాబాద్ శివారు రంగారెడ్డి, వికారాబాద్. మల్కాజిగిరిలోని కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఈసీ ఆదేశాలను బ్రేక్ చేస్తున్నాయి. ఎలక్షన్ జరిగే నవంబర్ 30న కూడా కచ్చితంగా కాలేజీకి రావాల్సిందేనని విద్యార్థులకు హుకం జారీ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 30న కాలేజీకి గైర్హాజరు అయితే.. ప్రాక్టికల్స్‌లో ఫెయిల్ చేస్తామంటూ స్టూడెంట్స్‌ను బెదిరిస్తున్నారు. దీంతో విద్యార్థులు తలలు పట్టుకుంటున్నారు. విద్యార్థుల్లో చాలా మందికి తొలిసారిగా ఓటుహక్కు రాగా.. ఇప్పుడేం చేయాలో తెలియక ఆవేదనకు గురవుతున్నారు.
ప్రైవేటు కాలేజీ యాజమాన్యాల చర్యలపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటు హక్కు వినియోగం అనేది పౌరుల ప్రాథమిక హక్కు అని.. దాన్ని కాలరాసే హక్కు కాలేజీలకు లేదని అంటున్నారు. కాలేజీ యాజమాన్యాల తీరు చాలా దారుణమని మండిపడుతున్నారు. ఓటింగ్‌కు వెళ్లకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురిచేసే కాలేజీ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను కోరుతున్నారు.