ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆదివాసీ..జీవన వైవిధ్యం

national |  Suryaa Desk  | Published : Mon, Aug 09, 2021, 11:51 AM

స్వచ్ఛమైన సెలయేళ్లు. దట్టమైన అడవులు. గంభీరమైన కొండలు. పక్షుల కిలకిలారావాలు. పచ్చని ప్రకృతి అందాలు. వీటి మధ్య శతాబ్దాల సంస్కృతులకు గుర్తుగా, వెనకబాటుతనానికి సజీవ సాక్ష్యంగా.. పాలకుల ఆలనకోసం ఎదురు చూస్తూ అమాయక ఆదివాసీ జనం నివసిస్తోంది. అడవితల్లి బిడ్డలుగా.. ప్రకృతి ఒడే ఆవాసంగా.. దశాబ్దాలుగా పోడు వ్యవసాయం చేసుకుని.. ప్రకృతి ప్రసాదిత ఫలాలతో సహవాసం చేస్తోంది.


విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాలకు నోచుకోని గూడేలెన్నో కనిపిస్తాయి. దశాబ్దాలుగా గిరిజనులు సమస్యలతోనే సహవాసం చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యానికి బలైపోయారు. కానీ ఇప్పుడిప్పుడే వారి సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. వారి జీవితాల్లో మార్పు కోసం తాజా సర్కారు నడుం బిగించింది. గిరిజనులకు పాలనలో పెద్దపీట వేసింది. ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టి సముచిత గౌరవం కల్పించింది.


కట్టు, బొట్టు, ఆచార వ్యవహారాలు, తినే ఆహారం ఇలా.. ఆదివాసీలవన్నీ ప్రత్యేకంగానే ఉంటాయి. ఏళ్ల తరబడి అడవిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. 1960 జనవరి 26 నుంచి రాజ్యాంగంలో నిర్దేశించిన నిబంధనల ప్రకారం అటవీప్రాంతంలో స్థిర నివాసం కలిగిన 33 తెగల సమూహాలను ఆదివాసీలుగా గుర్తించారు. వీరినే గిరిపుత్రులు, గిరిజనులు, అడవి బిడ్డలు, వనవాసీలు, ఆదివాసీలుగా పిలుస్తారు. ఎక్కువమంది అటవీ ఉత్పత్తులపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.


గిరిజన జీవనం విభిన్నంగా ఉంటుంది. సంబరాలు, వివాహ వేడుకలు, ఆరాధనల ఆచారాలు, మనిషి మూలాలను తేటతెల్లం చేస్తుంటాయి. తరాలు మారినా వారి అలవాట్లు, కట్టుబాట్లు ఇప్పటికీ మారలేదు. ఇక్కడ జరిగే వివాహ వేడుకల్లోని సంప్రదాయాల్లో భాగంగా చెట్టును ఆరాధిం చే విధానాలు ప్రపంచ శాంతి సౌభాగ్యానికి సందేశాన్ని పంపుతుంటాయి.


ఏ పల్లెకు వెళ్లినా గిరిజనుల సంబరాలు, పండుగ సందడులన్నీ ఒకే రకంగా కొనసాగితే పెళ్లిళ్లు మాత్రం ప్రకృతి ఆరాధనతో ముడిపడి ఉంటాయి. ప్రాణాధారమైన నీరు, అది లభించడానికి అవసరమైన చెట్టు చుట్టూనే వారి తంతు తిరుగుతుంది. పాటలు, థింసా నృత్యాలు ఇక్కడి గిరిజనుల పండుగలు, శుభకార్యాల్లో భాగం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com