ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఉద్యోగాల జాతర..5,905 ఉద్యోగాలకు నోటిఫికేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 06, 2020, 03:35 PM

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. అక్షరాస్యతలో ఏపీ చివరి స్థానంలో ఉన్న నేపథ్యంలో అక్షరాస్యతను పెంచేందుకు జగన్ సర్కార్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా అంగన్వాడీని మరింత పటిష్టం చేయాలని భావిస్తుంది. దీంతో ఖాళీగా ఉన్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. జిల్లాల వారీగా ఈ నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 5,905 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా కలెక్టర్ల అధ్యక్షతన వేసిన కమిటీలు ఉద్యోగులను ఎంపిక చేయాలని ఆదేశించింది. దరఖాస్తుల్ని స్వీకరించిన తర్వాత ఇంటర్వ్యూలు నిర్వహించాలని ఆదేశించింది.
ఇకపోతే మొత్తం 5,905 పోస్టుల్లో అంగన్వాడీ హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లు, మెయిన్ అంగన్వాడీ వర్కర్ పోస్టులున్నాయి. గతంలోనే కొన్ని జిల్లాల్లో అంగన్వాడీ పోస్టుల భర్తీ పూర్తైంది. ఇప్పుడు మిగిలిన జిల్లాల్లో 5,905 పోస్టుల్ని భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంగన్ వాడీ పోస్టుల భర్తీ ప్రక్రియ ఆయా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరుగుతున్న నేపథ్యంలో దరఖాస్తుకు చివరి తేదీలు వేర్వేరుగా ఉన్నాయి. అభ్యర్థులు తమ జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఆయా రెవెన్యూ డివిజన్ల పరిధిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మొత్తం 5,905 ఖాళీలు ఉండగా అందులో అంగన్వాడీ హెల్పర్ పోస్టులు 4007, మినీ అంగన్వాడీ వర్కర్ పోస్టులు 430, మెయిన్ అంగన్వాడీ వర్కర్ పోస్టులు 1468 ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి వివిధ పోస్టులకు వేర్వేరు విద్యార్హతలను ప్రభుత్వం ప్రకటించాయి. కొన్ని పోస్టులకు 10వ తరగతి పాసైనవారు కూడా అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల వయస్సు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
పూర్తి వివరాల కోసం ఆయా జిల్లాలలోని అధికారిక నోటిఫికేషన్‌ ను పరిశీలించాలి. ఇకపోతే వేతనాల వివరాలు చూస్తే అంగన్వాడీ వర్కర్‌కు రూ.11,500, మినీ అంగన్వాడీ వర్కర్‌కు రూ.7,000, అంగన్వాడీ హెల్పర్‌కు రూ.7,000 జీతభత్యాలను ప్రభుత్వం చెల్లిస్తోంది. ప్రస్తుతం ఏపీలో 47,302 మెయిన్ అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు. మరో 1468 పోస్టులు భర్తీ చేస్తే మెయిన్ అంగన్వాడీ వర్కర్ల సంఖ్య 48,770 కానుంది. ఇక మెయిన్ అంగన్వాడీ సెంటర్లలో ప్రస్తుతం 44,763 మంది హెల్పర్స్ ఉండగా తాజా నోటిఫికేషన్ తో కలుపుకుని హెల్పర్ సంఖ్య 48,770కు చేరనుంది. ఇక మినీ అంగన్వాడీ సెంటర్లలో ప్రస్తుతం 6,407 మంది వర్కర్లు మాత్రమే ఉన్నారు. తాజాగా మరో 430 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో మినీ అంగన్వాడీ సెంటర్లలలో అంన్వాడీ వర్కర్ల సంఖ్య 6,837కు చేరుకోనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com