ఆమె ఎమ్మెల్యే. నిత్యం ప్రజా సమస్యల పరిష్కారంలో బిజిబిజిగా ఉంటారు. కానీ తాను నేర్చుకున్న వృత్తిని మరువలేరుగా. రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడిన వ్యక్తికి చికిత్స చేసి ప్రాణాలు నిలిపారు. ఆమే గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. పెదకాకాని హైవేపై ఆదివారం కారు బైక్ ఢీకొని బైక్ పై వెళ్తున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి విషయం తెలుసుకొని ప్రమాద స్థలానికి చేరుకున్నారు. వెంటనే అతనికి ప్రాథమిక చికిత్స చేసి అంబులెన్స్ రప్పించి అతనిని మెరుగైన చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఎమ్మెల్యే శ్రీదేవి చేసిన ఈ పనికి అంతా ఆమెను అభినందిస్తున్నారు. నిండు ప్రాణాన్ని కాపాడిన ఎమ్మెల్యే శ్రీదేవికి పలువురు కృతజ్ఞతలు తెలిపారు.