ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పటేల్ విగ్రహం భారతదేశ ఐక్యతకు చిహ్నం : ఉపరాష్ట్రపతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jan 21, 2019, 12:22 AM

ఈ రోజు గుజరాత్ పర్యటనలో ఉన్న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు కేవదీయ వద్ద ఉన్న ఐక్యతా ప్రతిమను (స్టాట్యూ ఆఫ్ యూనిటి) సందర్శించి, సర్దార్ పటేల్ స్మృతికి నివాళులు అర్పించారు. సర్దార్ పటేల్ విగ్రహం భారతదేశ ఐక్యతకు చిహ్నమని, వారి దూరదృష్టికి భారతజాతి వారి పట్ల కృతజ్ఞతా భావాన్ని కలిగి ఉంటుందని తెలిపారు. స్వరాజ్యం సంగ్రామ చరిత్రలో పటేల్ వంటి ఎంతో మంది మహనీయుల పాత్రను సరైన విధంగా ఆవిష్కరించలేదని, ఐక్యతా విగ్రహం అలాంటి అసమతౌల్యతను సరి చేస్తుందని అభిప్రాయపడ్డారు. భారతదేశాన్ని ఒక్కటి చేయడంలో సర్దార్ పటేల్ చూపిన చొరవ, దేశనిర్మాణంలో వారి క్రాంతదర్శనం మరచిపోలేనివని తెలిపారు.  మొదటి ప్రధాని నెహ్రూకి, ఉపప్రధానిగా, హోంమంత్రిగా పటేల్ చేసిన సూచనలు నేటి కాలానికీ వర్తిస్తున్నాయని గుర్తు చేశారు. స్టాట్యూ ఆఫ్ యూనిటి సందర్శన అనంతరం సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని పంచుకున్న ఉపరాష్ట్రపతి, దేశ చరిత్ర గురించి, ఉన్నతమైన భారతమాత పుత్రుడి గురించి తెలుసుకోవడానికి ప్రతి ఒక్కరూ ఈ విగ్రహాన్ని సందర్శించాలని అందులో తన అభిప్రాయాన్ని రాశారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు చొరవ చూపిన ప్రధాని నరేంద్ర మోడికి అభినందనలు తెలియజేశారు.
నాతో సహా మరెంతో మంది తోటి పౌరుల దృష్టిలో ఈ విగ్రహం మరింత ఉన్నతమైన భావాన్ని కలిగిఉంది. దురదృష్టవశాత్తు స్వరాజ్య సంగ్రామం మరియు స్వాతంత్ర్యానంతరం భారతదేశ నిర్మాణ చరిత్రను ఉద్దేశపూర్వకంగా మరో కోణంలో వక్రీకరించి, ముందు తరాలకు అందించారు. స్వాతంత్ర్య పోరాటంలో సర్దార్ పటేల్ లాంటి ఎంతో మంది నాయకుల పాత్రను సరైన విధంగా చరిత్రలో ఆవిష్కరించే ప్రయత్నం చేయలేదు.
ఆధునిక భారతదేశ నిర్మాణంలో సర్దార్ పటేల్ దృష్టి, ధైర్యం, సామర్థ్యం మరియు సహకారాలను ఈ ఐక్యతా ప్రతిమ గుర్తు చేస్తుంది. ఈ విగ్రహం మనదేశ చరిత్ర అసమతుల్యతను సరి చేసే మార్గంగా చెప్పుకోవాలి. భారతదేశాన్ని ఏకతాటి మీదకు తేవడం మాత్రమే కాదు, ఈ ఏకీకరణను కొనసాగించడంలో ఎదురైన ప్రతి సమస్యను ఎదుర్కొంటూ సర్దార్ పటేల్ చేసిన పోరాటానికి ఈ విగ్రహాన్ని ఓ చిహ్నంగా చెప్పుకోవాలి. స్వాతంత్ర్య భారతదేశ ఐక్యతను సమర్ధిస్తూ, భారతరాజ్యాంగం పట్ల విధేయత చూపించే ప్రతి పౌరుడి బాధ్యత ఇది. భారతదేశ ఐక్యతా ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని చూస్తే, ఈ విగ్రహం కోసం ఖర్చు చేసిన ప్రతి రూపాయి, మన ఐక్యతను నిలబెట్టుకునే అమూల్యమైన పెట్టుబడి. ఇవాళ గుజరాత్ లోని కేవదీయ వద్ద ఈ విగ్రహాన్ని సందర్శించడం ద్వారా నేను పరిపూర్ణత భావాన్ని పొందాను. మనసు మరియు ఆత్మ ఏకమైన ప్రేరణతో పాటు, అంతర్లీనమైన భారతీయుని భావనతో స్ఫూర్తి పొందాను.ఈ ఐక్యతా ప్రతిమను నిర్మించాలనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఇది భారతీయులంతా ఒక్కటిగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com