ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాహుల్..2.0 రాణిస్తున్న యువరాజు

national |  Suryaa Desk  | Published : Sun, Jan 06, 2019, 07:30 PM

2018 డిసెంబరు 16న అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా అధికార పగ్గాలు చేపట్టే నాటికి రాహుల్ గాంధీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. పప్పు అని విమర్శలు ఎదుర్కొన్న రాహుల్ ఇప్పుడు నిప్పులా మారారు. ప్రధాని మోదీని ఈటెల్లాంటి మాటలతో దీటుగా ఎదుర్కొంటున్నారు. ఐరన్ లెగ్ అన్న వారు నేడు అభయప్రదాత అని అంటున్నారు. రాహుల్ ను ప్రధాని అభ్యర్థిగా పరిగణనలోకి తీసుకోబోమని డాంబికాలు పలికిన ప్రాంతీయ పార్టీల అధినేతలు మాట మారుస్తున్నారు రాజకీయంగా ఆయన గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఆయన శక్తియుక్తులు, సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలపై ఎవరికీ ఎలాంటి అంచనాలు ఉండేవి కావు. ఆఖరుకూ సొంత పార్టీలోనూ ఇదే పరిస్థితి. అయితే అధినేత్రి కుమారుడు కావడం, యువరాజు కావడంతో ఎవరూ కిక్కురుమనేవారు కాదు.


ఆఖరుకు ఒకటీ అరా రాష్ట్రాలకే పరిమితమైన ప్రాంతీయ పార్టీలు సయితం రాహుల్ ను చిన్న చూపు చూసేవి. ఇక ప్రచార, ప్రసార మాధ్యమాల పరిస్థితి సరేసరి. రాహుల్ పై విమర్శలు, విశ్లేషణలు, వ్యూహరచనలు పుంఖాను పుంఖాలుగా ప్రచురితమయ్యేవి. వీటన్నింటినీ మౌనంగా భరించడం తప్ప ఆయన ఏనాడూ నోరు పారేసుకునే వారు కారు. పప్పు అని కొందరు, ఐరన్ లెగ్ అని మరికొందరు తెరచాటుగా విమర్శలు చేసినప్పటికీ స్పందించేవారు కారు. చూస్తూ ఊరుకునే వారు.నిన్న మొన్నటి దాకా అసలు రాహుల్ ను లెక్క చేయని భారతీయ జనతా పార్టీ నాయకులు, శ్రేణులు ఇప్పుడు ఒకింత ఆశ్చర్యంగా, గౌరవంగా చూస్తున్నారు. రాహుల్ పరిస్థితి ఆయన అనుకున్నంత ఆశాజనకంగా లేకపోవచ్చు గాని, అందరూ అనుకున్నంత నిరాశాజనకంగా లేదన్నది నిర్వివాదాంశం.


ఆయన మాటల్లో గంభీరత కనపడుతోంది. విమర్శల్లో వివేచన గోచరిస్తుంది. వ్యవహారశైలిలో హుందాతనం ఉట్టి పడుతోంది. మొత్తం మీద ఏడాది పాటు అధ్యక్ష పదవి ఆయనలో అనేక మార్పులు తీసుకు వచ్చినట్లు కనపడుతోంది. వందేళ్ల చరిత్ర గల పార్టీకి ఊపిరి పోయగలవన్న ఆశాభావం వ్యక్తమవుతోంది..అధ్యక్షుడిగా ఏడాదికాలంలో రాహుల్ విజయాలు లేకపోలేదు. గత ఏడాది డిసెంబరులో రెండు దఫాలుగా జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందలేకపోయినప్పటికీ పార్టీకి గౌరవప్రదమైన సీట్లు, ఓట్లు సాధించారు. విజయవంతమయ్యారు. 182 స్థానాలకు గాను 77 స్థానాలు సాధించి గట్టి ప్రతిపక్షంగా పార్టీని మలిచారు. గతంలో కన్నా 16 స్థానాలు పెరిగి పార్టీ బలం 77 కు చేరుకుంది. అదే సమయంలో బీజేపీ బలాన్ని 99కి పరిమితం చేశారు.


గతంలో కన్నా ఆ పార్టీ బలం 16 స్థానాలు తగ్గి 99 వద్ద నిలిచిపోయింది. బీజేపీకి 1,47, 24, 427 ఓట్లు (49.1 శాతం) రాగా, కాంగ్రెస్ కు 1.24,38,937 ఓట్లతో దీటుగా నిలిచింది. 2018 జనవరిలో రాజస్థాన్ లోని ఆల్వార్, అజ్మీర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. ఈ రెండూ బీజేపీ సిట్టింగ్ స్థానాలే. 2018 ఫిబ్రవరిలో జరిగిన త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ అసెంబ్లీ ఎన్నికల్లో మేఘాలయలో అతి పెద్ద పార్టీగా అవతరించింది. త్రిపుర, నాగాలాండ్ లలో చాలా కాలం నుంచి పార్టీ విపక్షంలో ఉంది. 60 స్థానాలు గల మేఘాలయ అసెంబ్లీలో 21 స్థానాలతో అతి పెద్ద పార్టీగా నిలిచింది.. 4,47, 472 ఓట్లు (28.5 శాతం) రాగా, నేషనల్ పీపుల్స్ పార్టీకి 3,23,500 ఓట్లు (20.6 శాతం) వచ్చాయి. అయితే బీజేపీ రాజకీయ మాయాజూదం కారణంగా కాంగ్రెస్ కు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం దక్కలేదు.


పదేళ్ల పాటు సీఎంగా పనిచేసిన ముకుల్ సంగ్మా పదవి నుంచి వైదొలిగారు.2018 ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికలకు వెళ్లిన సిద్ధరామయ్య నాయకత్వంలోని కర్ణాటకలో కాంగ్రెస్ పరాజయం పాలయినప్పటికీ, అతి పెద్ద పార్టీగా నిలిచి గౌరవాన్ని కాపాడుకుంది. మొత్తం 223 స్థానాలకు గాను ఏడు పదులకు పైగా సాధించింది. వ్యూహాత్మకంగా వ్యవహరించి కుమారస్వామి నాయకత్వాన సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తద్వారా అతి పెద్ద పార్టీగా ఉన్న బీజేపీని అధికారానికి దూరంగా ఉంచడంలో విజయవంతమైంది. 106 సీట్లు సాధించిన బీజేపీ కన్నా హస్తం పార్టీకి ఎక్కువ ఓట్లు లభించాయి. కాంగ్రెస్ 1,49,32, 069 ఓట్లు రాగా, కమలం పార్టీకి 1,31,85,384 ఓట్లకే పరిమితమయింది. కమలం ఓట్ల శాతం 36.2 శాతం కాగా, హస్తానికి 38 శాతం ఓట్లు రావడం గమనార్హం.


ఇక తాజాగా జరిగిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు పెద్ద రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేయడం ద్వారా కమలదళంలో కలవరం సృష్టించారు. అయిదు రాష్ట్రాల్లో ఒక్క మిజోరాంలోనే కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ లలో సత్తా చాటడం కీలక పరిణామం. ఈ ఉత్సాహం వచ్చే సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనడానికి ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. రాజస్థాన్ గెలుపు పెద్ద సంచలనం కాకపోయినప్పటికీ, పదిహేనేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో విజయాన్ని తక్కువగా అంచనా వేయలేం. ఛత్తీస్ ఘడ్ లో మూడింట రెండు వంతుల మెజారిటీ సాధించగా, మధ్యప్రదేశ్ లో సాధారణ మెజారిటీ తెచ్చుకుంది. అయినా ఈ గెలుపును తక్కువ చేసి చూడలేం.


మిజోరాంలో అధికారాన్ని కాపాడుకోవడంలో, తెలంగాణలో అధికారాన్ని అందుకోవడంలో విఫలమైన మాట వాస్తవం. అయినప్పటికీ మూడు పెద్ద రాష్ట్రాల్లో విజయం, రెండు రాష్ట్రాల్లో అపజయాన్ని ప్రాధాన్యం లేకుండా చేశాయి తాజా ఫలితాలు. గత ఏడాదిగా తన పనితీరుతో మిత్రపక్షాలు, అధికార బీజేపీని ఆలోచనలోకి రాహుల్ నెట్టేశారు. తనను ఎవరూ అలక్ష్యం చేయడం సాధ్యం కాదని చెప్పకనే చెప్పేశారు. కాంగ్రెస్ లేకుండా ఎన్డీఏను ఎదుర్కొనడం అంత తేలిక కాదన్న విషయాన్ని విపక్షాలకు విస్పష్టంగా చాటారు. మొత్తానికి ఏడాది పనితీరు రాహుల్ లో ఎంతో మార్పు తెచ్చింది. ఆయనను ధీటైన నేతగా నిలబెట్టింది






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com