ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ పొత్తుకు జగనే కారణం: నారా లోకేశ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 10:27 PM

ముఖ్యమంత్రి వై..ఎస్.జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇదిలావుంటే నారా లోకేశ్ యువగళం పాదయాత్ర నేడు 212వ రోజు ముమ్మిడివరం ఉమెన్స్ కళాశాల వద్ద క్యాంప్ సైట్ నుంచి ప్రారంభమైంది. ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.పోలవరం మండలం పాతఇంజరం వద్ద 2900 కి.మీ.ల మైలురాయి చేరుకుంది. ఈ సందర్భంగా కల్లుగీత, కొబ్బరి దింపు కార్మికులకు భీమా అమలు చేస్తామని హామీ ఇస్తూ యువనేత లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు. ముమ్మిడివరంలో జరిగిన యువగళం బహిరంగ సభలో లోకేశ్ వాడీవేడిగా ప్రసంగించారు. సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించారు. జగన్ ఒక సెల్ఫ్ గోల్ స్పెషలిస్ట్... సింపుల్ గా చెప్పాలి అంటే భస్మాసురుడు. లేటెస్ట్ గా జగన్ వేసిన సెల్ఫ్ గోల్ ఏంటంటే... చంద్రబాబు అరెస్ట్! కానీ, జగన్ అనుకున్నది ఒక్కటి... అయ్యింది ఇంకొకటి. చంద్రబాబుకి అవినీతి మరక అంటించాలని అక్రమంగా అరెస్ట్ చేశాడు. కానీ చంద్రబాబు గొప్పతనం ప్రపంచానికి తెలిసింది. ఇప్పటి యువతకి ఆయన విజన్ ఏంటో అర్ధమైంది. కుటుంబాన్ని కూడా కాదనుకొని ప్రజల కోసం ఆయన పడ్డ కష్టం అందరికీ తెలిసింది. చంద్రబాబు అవినీతి చేశారు అంటే ఎవరూ నమ్మడం లేదని ప్యాలెస్ బ్రోకర్ సజ్జలే అన్నాడు. ప్రజల్ని నమ్మించడానికి తాము తిప్పలు పడుతున్నామని బహిరంగంగా చెప్పాడు. 53 రోజులు న్యాయానికి సంకెళ్లు వేశారు. చంద్రబాబుని జైల్లో బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచింది. నారా లోకేశ్ ఇంకా ఇలా అన్నారు. 


జగన్ కి ఆత్మలతో మాట్లాడే జబ్బు ఉంది. టీడీపీ-జనసేన పొత్తు కుదరకుండా చూడమని ఆత్మ చెప్పినా జగన్ సెల్ఫ్ గోల్ వలన పొత్తు కుదిరింది. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ని ఖండించి పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించారు. మరో మూడు నెలల్లో రాబోయేది టీడీపీ-జనసేన ప్రభుత్వం. యువగళాన్ని ఆపడానికి జగన్ అనేక ప్రయత్నాలు చేసాడు. రాజారెడ్డి రాజ్యాంగం ఇచ్చి పోలీసుల్ని పంపాడు... నేను అంబేద్కర్ రాజ్యాంగం చూపించి సమాధానం చెప్పాను. పిల్ల సైకోలను పంపి గుడ్లు వేయించాడు.... కానీ, పసుపు సైన్యం వాళ్ల మొహం మీద ఆమ్లెట్ వేసి పంపింది. జగన్ ఆపితే ఆగిపోవడానికి నేను ప్యాలస్ లో బ్రోకర్ ని కాదు... నేను ప్రజల్లో ఒక్కడిని.. నేను ముందే చెప్పా సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర అని. జగన్ పనైపోయింది. మరో మూడు నెలల్లో వైసీపీ ప్యాకప్. ఈ మాట నేను అనడం లేదు. జగన్ దగ్గర పనిచేసిన అధికారులే అంటున్నారు. కొంతమంది అధికారులు ఢిల్లీకి డెప్యుటేషన్ పెట్టుకున్నారంట. వాళ్లు ఢిల్లీకి వెళ్తున్నారు అంటే అర్ధం ఏంటి? జగన్ జైలుకి వెళ్ళిపోతున్నాడు. డెప్యుటేషన్ పెట్టుకున్న వారిలో కొంతమంది జగన్ చెప్పిన మాట విని చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్లు కూడా ఉన్నారు. ఢిల్లీకి వెళ్ళిపోయినా చేసిన తప్పులకు శిక్ష అనుభవించడం తప్పదు.


జగన్ కి టీచర్లు అంటే కోపం. టెన్త్ క్లాస్ పేపర్లు కొట్టేసినప్పుడు టీచర్లు జగన్ ని గట్టిగా వాయించారు. అప్పటి నుండి టీచర్లపై జగన్ కక్ష పెంచుకున్నాడు. కరోనా టైంలో టీచర్లను మద్యం దుకాణాల ముందు నిలబెట్టి అవమానించాడు. రకరకాల యాప్స్ పెట్టి వేధించాడు. ఆ తరువాత ఎన్నికల విధుల నుంచి తొలగించాడు. ఎన్నికల సంఘం ఉపాధ్యాయులను ఎన్నికల విధుల్లో వినియోగించాలని చెప్పింది. టీచర్లు లేకుండా చేసి ఎన్నికల్లో అక్రమాలు చెయ్యాలని జగన్ వేసుకున్న ప్లాన్ తుస్సుమంది. మరోసారి జగన్ కి టీచర్ల మీద కోపం వచ్చింది. ఇప్పుడు ఏకంగా మెమోలు ఇస్తున్నారు. ఏ తప్పు చేయకపోయినా అడ్డగోలుగా మెమోలు ఇస్తున్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ఇతర బెనిఫిట్స్ రాకుండా మెమోలు ఇస్తున్నారు. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే టీచర్ల సమస్యలు అన్ని పరిష్కరిస్తాం.


ముమ్మిడివరాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తారని సతీష్ కుమార్ గెలిపించారు. ముమ్ముడివరం అభివృద్ధి చెందిందా? సతీష్ కుమార్ ముమ్మిడివరాన్ని అవినీతికి అడ్డాగా మార్చేసారు. అందుకే ఆయన పేరు మార్చా, ఆయన సతీష్ కుమార్ కాదు కలెక్షన్ కుమార్. సెంటు స్థలాల్లో భారీ స్కాంచేశాడు. తక్కువ ధరకి భూములు కొని ప్రభుత్వానికి ఎక్కువ ధరకి అమ్మేశారు. రూ.15 లక్షలు విలువ చేసే భూమిని రూ.50 లక్షలకు ప్రభుత్వానికి అమ్మేశారు. మత్స్యకార సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యే కలెక్షన్ కుమార్ మత్స్యకారులకు ఓఎన్సీసీ ఇచ్చే పరిహారంలోనూ వాటాలు వసూలు చేస్తూ పేద మత్స్యకారులకు తీరని అన్యాయం చేస్తున్నారు. మత్సకారులకు కేటాయించిన డీజిల్ దారి మళ్లించేస్తూ పెద్దఎత్తున దోపిడీకి పాల్పడుతున్నారు. ఈ నాలుగున్నర ఏళ్లలో ఎమ్మెల్యే కరెప్షన్ కుమార్ అక్రమార్జన రూ. 400 కోట్ల పైమాటే. ఇది నేను చెబుతుంది కాదు... వైసీపీ నాయకులు,కార్యకర్తలే మాట్లాడుతున్నారు.


ముమ్మిడివరాన్ని అభివృద్ధి చేసింది టీడీపీ ప్రభుత్వం. అప్పటి ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు రూ.1800 కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారు. తాగునీటి సమస్య పరిష్కారం కోసం టిడిపి ప్రభుత్వం రూ.110 కోట్లు నిధులు కేటాయించింది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత పనులు నిలిపేసింది. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా కుళాయి ద్వారా సురక్షిత తాగునీరు అందిస్తాం. నియోజకవర్గంలో రోడ్లు చూస్తుంటే భయం వేస్తుంది. టీడీపీ-జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే కొత్త రోడ్లు వేస్తాం.


ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేకపోవడం, వారిని ఇబ్బందులు పెట్టి పైశాచికానందం పొందడం సైకో లక్షణాలు. నిరుపేదలు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబుగారు రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి లక్షలాదిమంది ఆకలి బాధ తీరిస్తే, వాటిని రద్దుచేసి పేదోళ్ల నోటికాడ కూడు లాగేశాడు సైకో జగన్. సిగ్గు,లజ్జా వదిలేసి తాను పేదల పక్షమంటూ వేదికలెక్కి ఉపన్యాసాలిస్తున్నాడు. ఆకలితో అలమటించే పేదోళ్ల కడుపుమంటలే నీ అరాచక ప్రభుత్వానికి చితిమంటలు కాబోతున్నాయి... రాసిపెట్టుకో జగన్మోహన్ రెడ్డీ!SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com