ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పొగాకు వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయంటే

Health beauty |  Suryaa Desk  | Published : Mon, Oct 21, 2024, 06:55 PM

ప్రపంచవ్యాప్తంగా పొగాకు కారణంగా ప్రతి సంవత్సరం 8 మిలియన్ల మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం పొగాకు వాడకం అన్ని విధాలుగా హానికరం.అంటే తక్కువ మోతాదులో తీసుకున్నా శరీరానికి అందుకు తగిన హాని కలుగుతుంది. సిగరెట్ ధూమపానం అనేది ప్రపంచవ్యాప్తంగా పొగాకు వాడకంలో అత్యంత సాధారణ రూపం. ఇతర పొగాకు ఉత్పత్తులలో వాటర్‌పైప్ పొగాకు, సిగార్లు, బీడీలు ఉన్నాయి. ఇవన్నీ శరీరంలో వివిధ వ్యాధులకు కారణమవుతాయి.భారతదేశంలో కూడా పొగాకు వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే దాదాపు 45 శాతం మంది పురుషులు పొగాకును వినియోగిస్తున్నారు. లక్నోలోని కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్శిటీ (KGMU)లో ప్రొఫెసర్, థొరాసిక్ సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ శైలేంద్ర యాదవ్ మాట్లాడుతూ.. ఉత్తరప్రదేశ్‌లో 15 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పురుషులలో 44.1 శాతం మంది పొగాకును వినియోగిస్తున్నారని చెప్పారు. ఇది షాకింగ్ ఫిగర్. అటువంటి పరిస్థితిలో ధూమపానం చేసేవారి సంఖ్యను నియంత్రించాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. జపాన్, స్వీడన్, అమెరికాలో ధూమపానం మానేయడానికి తీసుకున్న చర్యల చూసి మనం నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు. పెరుగుతున్న ధూమపాన అలవాటుని అరికట్టడానికి, పొగాకు ఉత్పత్తిని లక్ష్యంగా చేసుకుని సమగ్ర విధానాలను రూపొందించాలని సూచిస్తున్నారు.


పొగాకు ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్ శైలేంద్ర యాదవ్ చెప్పారు. సిగరెట్లలో ఉండే పొగాకు ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది. ఊపిరితిత్తుల క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ మంది దీర్ఘకాలం పాటు పొగ తాగేవారే. పొగాకు వినియోగం గుండెను కూడా బలహీనపరుస్తుంది. కొన్ని సందర్భాల్లో పొగాకు వినియోగం టైప్-2 డయాబెటిస్‌కు కూడా కారణం కావచ్చు. ప్రజల్లో పొగాకు వినియోగం పెరుగుతున్న తీరు భావితరాలకు పెను ముప్పు అని నిర్వాణ ఆసుపత్రికి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ బిహేవియరల్ అండ్ అడిక్షన్ మెడిసిన్ డైరెక్టర్ డాక్టర్ ప్రాంజల్ అగర్వాల్ అన్నారు. పొగాకు వినియోగం ఏ రూపంలో పెరిగినా వ్యాధుల పరిధి కూడా పెరుగుతుందని అర్థం. అటువంటి పరిస్థితిలో, పొగాకు వినియోగం నివారణ అవసరం.. ఇందుకోసం ప్రభుత్వం పెద్దఎత్తున చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు.


డాక్టర్ శైలేంద్ర యాదవ్ పొగాకు వ్యసనాన్ని విడిచిపెట్టడానికి కొన్ని సూచనలు చేశారు. ముందుగా పొగాకు అలవాటుని విడిచి పెట్టడం వలన కలిగే ప్రయోజనాలను తెలుసుకోవాలి. ఉదాహరణకు పొగాకు అలవాటు విడిచి పెట్టడం వలన ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుకోవచ్చు.. లేదా కుటుంబ ప్రయోజనాల కోసం పొగాకును మానేస్తున్నామని గుర్తు చేసుకోవాలి. ఖాళీగా ఉండడం అనేది పొగాకు వినియోగానికి ట్రిగ్గర్ పాయింట్. కనుక ఏదో ఒక పని చేస్తూ ఉండాలి. ఈ విషయంలో వైద్యుల నుండి కూడా సలహా తీసుకోవాలి. కొన్ని మందులు, కౌన్సెలింగ్ సెషన్‌లు పొగాకును విడిచిపెట్టడంలో సహాయపడతాయి. అయితే ఈ అలవాటుని వదిలించుకోవడానికి చాలా నెలలు పట్టవచ్చు. అటువంటి పరిస్థితిలో పొగాకు వినియోగాన్ని క్రమంగా తగ్గించడం, డాక్టర్ తో నిరంతరం సన్నిహితంగా ఉండటం చాలా ముఖ్యం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com