ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిశువు విక్రయానికి పాల్పడిన తల్లిదండ్రులు, అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 13, 2024, 03:10 PM

విశాఖపట్నం నగరంలో కలకలం రేపిన ఆడ శిశువు విక్రయం కేసులో తొమ్మిది మందిని త్రీటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. శిశువును వైద్య చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు, నిందితులను రిమాండ్‌పై కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో మరికొందరిని అరెస్టు చేయాల్సి ఉండడంతో పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించడంలో గోప్యత పాటిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కంచరపాలెం సమీపంలోని కప్పరాడ ప్రాంతవాసి ఐదు నెలల కిందట ప్రసవం కోసం కేజీహెచ్‌లో చేరింది. ఆ సమయంలో వైద్యులు స్కానింగ్‌ చేయాల్సి ఉండడంతో ఆస్పత్రి ఆవరణలోని మెడాల్‌ డయాగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌కు పంపించారు. అక్కడ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న వ్యక్తి ఆమెతో మాటలు కలిపాడు. దంపతులు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు గుర్తించాడు. పుట్టబోయే బిడ్డను విక్రయిస్తే రూ.పది లక్షలు వరకూ వస్తాయని ఆశచూపించాడు. ఆర్థిక ఇబ్బందులతోపాటు వారి అనారోగ్యం కారణంగా శిశువును విక్రయించేందుకు ఆ దంపతులు సంసిద్ధత వ్యక్తంచేశారు. దీంతో అతను...ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న తన స్నేహితుడికి విషయం చేరవేశాడు. ఇద్దరూ కలిసి పిల్లల కోసం అప్పటికే తమను సంప్రతించిన రాంబిల్లి ప్రాంతానికి చెందిన దంపతులకు సమాచారం ఇచ్చారు. రాంబిల్లికి చెందిన ఇద్దరు పెళ్లి చేసుకోకుండా గత పదేళ్లుగా సహజీవనం చేస్తున్నారు. తమ వృద్ధాప్యంలో బాగోగులు చూసేందుకు బిడ్డ అవసరమని శిశువును కొనుగోలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఆస్పత్రిలో ఉండగా శిశువును విక్రయిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి కొన్నాళ్ల తర్వాత తీసుకువెళ్లేలా ఇరువర్గాలకు మధ్యవర్తులుగా ఉన్నవారు చెప్పారు. దీని ప్రకారం శిశువుకు ఐదు నెలలు రావడంతో ఆస్పత్రి డయాగ్నోస్టిక్‌ సెంటర్‌ టెక్నీషియన్‌తోపాటు ల్యాబ్‌ టెక్నీషియన్‌లు ఆడశిశువు తల్లిదండ్రులను సంప్రతించారు. శిశువును విక్రయించేందుకు తల్లి తటపటాయించడంతో ఆమె ఆడపడుచుతోపాటు మరికొందరు కుటుంబసభ్యుల ద్వారా మధ్యవర్తులు ఒప్పించారు. దీంతో శనివారం రాత్రి బిడ్డను అప్పగించి, డబ్బులు తీసుకునేందుకు ఐదేళ్ల శిశువును తీసుకుని దంపతులు, ఆడపడచు, ఇద్దరు మధ్యవర్తులు మరో ఐదుగురు కుటుంబసభ్యులు సిరిపురం సమీపంలోని హార్బర్‌ పార్క్‌ వద్దకు చేరుకున్నారు. రూ.7.5 లక్షలకు శిశువును విక్రయించేందుకు ఒప్పందం కుదరడంతో చెక్‌ ద్వారా ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు కొనుగోలుదారులు సిద్ధమయ్యారు. ఆ సమయంలో సీపీ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు గుర్తుతెలియని వ్యక్తులు సమాచారం ఇవ్వడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం ఇచ్చి వారిద్వారా డెకాయి ఆపరేషన్‌ నిర్వహించారు. శిశువుతోపాటు తల్లిని మరో తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని త్రీటౌన్‌ పోలీసులకు అప్పగించారు. శిశువును తొలుత శిశుగృహకు తరలించారు. అయితే శిశువుకు వైద్యచికిత్స అవసరం కావడంతో అక్కడి నుంచి తల్లితోపాటు కేజీహెచ్‌కు తరలించారు. పోలీసులు శిశువు భర్త సహా తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేసి వారి నుంచి రెండు చెక్‌లు, ఆరు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌ నిమిత్తం కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసులో మరికొందరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉన్నందున వివరాలను బయటపెట్టడం లేదని త్రీటౌన్‌ సీఐ పార్థసారధి వివరించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com