ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఢిల్లీలో మరోసారి రైతుల ఆందోళనలు ఎందుకు.. అసలు వారి డిమాండ్లు ఏంటి

national |  Suryaa Desk  | Published : Mon, Feb 12, 2024, 10:58 PM

కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్‌కు.. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు మరో తలనొప్పి వచ్చి పడింది. గతంలో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీలో, ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది పాటు ఆందోళనలు చేసిన అన్నదాతలు.. ఇప్పుడు తమ డిమాండ్ల సాధనకు మరోసారి హస్తిన బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి మెగా మార్చ్ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే రైతుల ఉద్యమాన్ని అణిచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలతో సిద్ధం అయింది. ఇందులో భాగంగానే మార్చి 12 వ తేదీ వరకు నెల రోజుల పాటు ఢిల్లీలో 144 సెక్షన్ విధిస్తూ సోమవారం ఢిల్లీ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా కొన్ని ప్రాంతాల్లో సరిహద్దులను మూసివేసింది. ఇక మరికొన్ని సరిహద్దుల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి భారీగా భద్రతా బలగాలను రంగంలోకి దింపింది. శాంతి, భద్రతల సమస్య తలెత్తవచ్చన్న ఆందోళనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.


ఢిల్లీ సరిహద్దులు సింఘూ, ఘాజీపూర్, టిక్రి వద్ద బలగాల మోహరింపు, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. 5 వేల కంటే ఎక్కువ మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ఇక ఢిల్లీ నగరంలోకి రైతుల ట్రాక్టర్లు ప్రవేశించడానికి అనుమతి ఉండదని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. తుపాకులు, పేలుడు పదార్థాలు, ఇటుకలు, రాళ్లు, పెట్రోల్‌, సోడా బాటిళ్ల వంటివి దేశ రాజధానిలోకి తీసుకురావడంపై కూడా నిషేధించారు. లౌడ్‌ స్పీకర్ల వాడకంపైనా ఆంక్షలు విధించారు. పోలీసులు మోహరించడం, బారికేడ్లు ఏర్పాటు చేయడంతో ఇప్పటికే ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్‌ జామ్ ఏర్పడింది. దీంతో సోమవారం ఉదయం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.


ఉత్తర్‌ప్రదేశ్, హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి రైతు సంఘాల నేతలు మంగళవారం దేశ రాజధాని ఢిల్లీకి మెగా మార్చ్ నిర్వహించనున్నారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతో పాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200 కు పైగా రైతు సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 2021లో రైతులు తమ ఆందోళన విరమించినపుడు పెట్టిన షరతుల్లో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం కూడా డిమాండ్ ఒకటి. ఈ నేపథ్యంలోనే 3 ఏళ్లు గడుస్తున్నా తమ డిమాండ్‌ నెరవేర్చకపోవడంతో మరోసారి ఆందోళనలకు రైతులు పిలుపునిచ్చారు.


వివిధ రాష్ట్రాల నుంచి దాదాపు 20 వేలమంది రైతులు ఢిల్లీకి వచ్చే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు అంచనా వేశాయి. అయితే ఈ ఆందోళనను ఎలా చేపట్టాలి అనే దానిపై ఇప్పటికే రైతు సంఘాల నేతలు 40 సార్లు రిహార్సల్స్ చేశారు. అందులో పంజాబ్‌లో 30 సార్లు, హర్యానాలో 10 సార్లు రిహార్సల్ జరిగాయి. సుమారు 2,500 ట్రాక్టర్లను మంగళవారం దేశ రాజధానికి తీసుకొచ్చేందుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారని పేర్కొన్నాయి. వీటితోపాటు పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కేరళ, కర్ణాటకల నుంచి అన్నదాతలు కార్లు, బైక్‌లు, మెట్రో, రైళ్లు, బస్సుల ద్వారా కూడా ఢిల్లీకి చేరుకుంటారని తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పోలీసులతోపాటు హర్యానా పోలీసులు కూడా అప్రమత్తం అయ్యారు.


ఈ క్రమంలోనే పలుచోట్ల సరిహద్దులను మూసివేస్తున్న పోలీసులు.. భారీగా బలగాలను రంగంలోకి దింపుతున్నాయి. పంజాబ్‌లోని అంబాలా సమీపంలోని శంభు వద్ద సరిహద్దుల్లో హర్యానా పోలీసులు దారిని మూసివేశారు. రహదారిపై ఇసుక సంచులు, ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలను అడ్డంగా పెట్టారు. అల్లర్ల నిరోధక బలగాల వాహనాలను సిద్ధం చేసి ఉంచారు. అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు.. ఇప్పటికే ఈ నెల 8 వ తేదీన రైతులతో ఒకసారి చర్చలు జరిపిన ముగ్గురు కేంద్రమంత్రులతో కూడిన బృందం.. రెండోసారి భేటీ జరిపేందుకు సిద్ధం అయింది. కేంద్రమంత్రులు పీయూష్ గోయల్‌, అర్జున్ ముండా, నిత్యానంద రాయ్‌.. చండీగఢ్‌లో రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com