ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చేసేది డీఎస్పీ ఉద్యోగం.. కానీ, ఉగ్రవాదులతో చేతులు కలి

national |  Suryaa Desk  | Published : Fri, Sep 22, 2023, 08:29 PM

జమ్ము కశ్మీర్ అంటేనే ఎప్పుడూ ఉగ్ర చొరబాట్లు, ఉగ్రవాదుల హింసా కాండకు భయంతో వణికిపోతూ ఉంటుంది. అక్కడి ప్రజలకు ధైర్యం చెప్పేందుకు సైన్యం, పోలీసులు ఇతర భద్రతా బలగాలు నిత్యం పహారా కాస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఉగ్రవాదులకు సాయం చేస్తున్న ఓ పోలీస్ ఉన్నతాధికారిని.. జమ్ము కశ్మీర్ పోలీసులు పట్టుకున్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోలీసులు, సైన్యం చేసే ఆపరేషన్లు, అరెస్ట్‌లకు సంబంధించిన సమాచారాన్ని ముందే వారికి లీక్ చేసి తప్పించుకునేటట్లు చేసిన జమ్ము కశ్మీర్ డీఎస్పీ షేక్ ఆదిల్ ముస్తాక్‌ను తాజాగా జమ్ము కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇటీవల ఓ ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా.. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీస్ శాఖలో ఉన్న ఈ బ్లాక్‌ షీప్‌ను పట్టుకున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు. దీనికితోడు ఉగ్రవాదులను రక్షించేందుకు దర్యాప్తు అధికారులపైనే ఫిర్యాదులు చేసినట్లు గుర్తించారు. ఇక ఈ షేక్ ఆదిల్ ముస్తాక్ సోషల్ మీడియాలో కూడా ఓ సెలబ్రిటీ అని అతడికి ట్విటర్‌లో 44 వేల మంది ఫాలోవర్లు ఉన్నట్లు తెలిపారు.


ఉగ్రవాద ఏరివేత చర్యల్లో భాగంగా ఈ ఏడాది జులైలో ఒక ఉగ్రవాదిని జమ్ము కశ్మీరో పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత అతడిని విచారణ జరిపిన పోలీసులకు దిమ్మ తిరిగే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎందుకంటే ఆ ఉగ్రవాది.. జమ్ము కశ్మీరో పోలీస్ శాఖలో పనిచేస్తున్న డీఎస్పీ షేక్ ఆదిల్ ముస్తాక్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఉగ్రవాద ఆపరేషన్లకు సహకరిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఈ దిశగా దర్యాప్తు చేస్తున్న పోలీస్ ఉన్నతాధికారులను కూడా ఉగ్రవాదులకు లింక్ ఉందని ఇరికించే ప్రయత్నం షేక్ ఆదిల్ ముస్తాక్ చేయడం గమనార్హం. చివరికి పక్కా ఆధారాలతో పట్టుకున్న జమ్ము కశ్మీర్ పోలీసులు శ్రీనగర్ కోర్టులో హాజరు పరిచి.. ఆ డీఎస్పీని ఆరు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.


అయితే గతంలో అరెస్ట్ చేసిన ఉగ్రవాదితో ఆదిల్ ముస్తాక్‌.. తరచూ టెలిగ్రామ్ యాప్ ద్వారా మాట్లాడటం, చాట్ చేయడం చేసినట్లు గుర్తించారు. వారిద్దరి మధ్య 40 సార్లు ఫోన్ కాల్స్ జరిగినట్లు తెలిపారు. చట్టానికి దొరకకుండా ఉగ్రవాదులు ఎలా తప్పించుకోవాలి అనే విషయాలపై ముఖ్యంగా వారికి ఆదిల్ ముస్తాక్ సహాయం చేసినట్లు వెల్లడించారు. అయితే ఈ కేసుపై ముందు నుంచి దర్యాప్తు చేస్తున్న అధికారులను కేసుల్లో ఇరికించేందుకు ఆదిల్ ముస్తాక్ తీవ్ర ప్రయత్నాలు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఫిబ్రవరిలో ఉగ్రవాదులతో సంబంధాలున్నట్లు భావిస్తున్న ముగ్గుర్ని పోలీసులు అరెస్టు చేయగా.. వారి నుంచి రూ.31 లక్షలు పట్టుకున్నారు. అరెస్ట్ అయిన ముగ్గురిలో ఉన్న ఒక వ్యక్తి ఏకంగా దర్యాప్తు చేస్తున్న ఒక ఉన్నతాధికారిపైనే అవినీతి ఆరోపణలు చేసినట్లు ఆదిల్‌ ముస్తాక్ ఓ నకిలీ ఫిర్యాదును సృష్టించి.. ఆ అధికారిపై ఎదురు కేసు పెట్టేందుకు సిద్ధమైనట్లు ఉన్నతాధికారులు వెల్లడించారు.


దీంతోపాటు లష్కరే తోయిబా ఉగ్ర సంస్థకు నిధులు సమకూర్చే ముజ్మిల్‌ జహూర్‌ అనే ఉగ్రవాదితో కూడా డీఎస్పీ ఆదిల్‌ ముస్తాక్‌కు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని విచారణలో వెల్లడైంది. ఆ ఉగ్రవాదిని అరెస్టు కాకుండా ఆదిల్‌ ముస్తాక్ తప్పించినట్లు కూడా చెప్పారు. అందుకోసం వారి నుంచి డీఎస్పీ రూ.5 లక్షలు లంచం తీసుకున్నట్లు తేలింది. వీటితోపాటు జమ్మూ కశ్మీర్‌లో అవినీతికి పాల్పడినట్లు కూడా ఆదిల్‌పై చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆదిల్ ముస్తాక్ అరెస్ట్ కావడంతో అతని బాధితులు ప్రస్తుతం పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు చేస్తున్నట్లు అధికారుల తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com