ట్రెండింగ్
Epaper    English    தமிழ்

73వ వసంతంలోకి ప్రధాని .. దేశవ్యాప్తంగా ప్రధాని పుట్టినరోజు వేడుకల కార్యక్రమాలు

national |  Suryaa Desk  | Published : Sun, Sep 17, 2023, 07:37 PM

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం 73వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ప్రధాని పుట్టినరోజు వేడుకలను బీజేపీ ఘనంగా జరిపించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేసింది. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని వివిధ కార్యక్రమాలను నిర్వహించనుంది. త్రిపుర బీజేపీ ‘నమో వికాస్ ఉత్సవ్’ పేరుతో ప్రధాని మోదీ జన్మదిన వేడుకలను చేపట్టింది. అలాగే, రాజధాని అగర్తలలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్‌లో నిర్వహించే యోగా కార్యక్రమంలో సీఎం మాణిక్ షా, ఆయన క్యాబినెట్ మంత్రులు.. ఇతర బీజేపీ నాయకులు పాల్గొంటారు.


ప్రధాని 73వ వసంతంలోకి అడుగుపెట్టడతో ఎంపికచేసిన 73 కుటుంబాలకు పీజీ రేషన్ కార్డులు, 73 భగవద్గీత పుస్తకాలను అందజేయనున్నారు. అలాగే, దివ్యాంగులైన 73 మంది విద్యార్థులకు ఆర్ధిక సహాయం అందజేస్తారు. జాతీయ మీడియా కథనం ప్రకారం.. నవ్‌సారి జిల్లాలో పార్టీ అధ్వర్యంలో 30,000 మంది పాఠశాల విద్యార్దినులకు బ్యాంకు ఖాతాలను తెరవనున్నట్లు గుజరాత్ బీజేపీ అధ్యక్షుడు సిఆర్ పాటిల్ వెల్లడించారు. దీంతో పాటు గుజరాత్‌లోని అన్ని జిల్లాల్లో బీజేపీ యువమోర్చా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తోంది.


ప్రధాని తన పుట్టినరోజును ఎలా గడుపుతారు? గత 5 ఐదేళ్లలుగా ఆయన తన పుట్టినరోజును ఎలా జరుపుకున్నారో? తెలుసుకుందాం. ప్రధాని ఆదివారం ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ‘యశోభూమి’ పేరుతో ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) మొదటి దశను ప్రారంభించనున్నారు. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ మెట్రోను ద్వారకా సెక్టార్ 25 వరకు పొడిగింపు లైన్‌ను కూడా ఆయన ప్రారంభిస్తారు.


దాదాపు 73,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో ప్రధాన ఆడిటోరియం, గ్రాండ్ ‘బాల్‌రూమ్’, 13 కాన్ఫరెన్స్ గదులు సహా 15 సమావేశ గదులు ఉన్నాయి. మొత్తం 11,000 మంది కూర్చునే సామర్ధ్యం ఉంటుంది. ప్రధాన ఆడిటోరియం కన్వెన్షన్ సెంటర్‌లో సుమారు 6,000 మంది అతిథులు కూర్చోవచ్చు. గుజరాత్‌లోని వాద్‌నగర్‌లో 1950 సెప్టెంబర్ 17న ప్రధాని మోదీ జన్మించారు. తన 72వ పుట్టినరోజున అంటే 17 సెప్టెంబర్ 2022న ప్రధాని నమీబియా నుంచి తెచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్ (KNP)లో వదలిపెట్టారు. దీంతో దేశంలో అంతరించిపోయిన జంతువుల ప్రస్థానం మళ్లీ ప్రారంభమైంది. ‘ప్రాజెక్ట్ చిరుత’ మొదలయ్యింది.


2021లో కరోనా వైరస్ కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రధాని తన జన్మదినం సందర్భంగా స్పెషల్ డ్రైవ్ కింద 2.26 కోట్ల టీకాలను వేశారు. 2020లో కోవిడ్-19 వ్యాప్తితో బీజేపీ కార్యకర్తలు ప్రధాని మోడీ పుట్టినరోజును ‘సేవా సప్తా’గా జరుపుకున్నారు. ఈ సమయంలో పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు అందించారు. దీంతో పాటు పలుచోట్ల రక్తదాన శిబిరాలు కూడా నిర్వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ‘లార్డ్ ఆఫ్ రికార్డ్సు’ పేరుతో ప్రధాని మోదీ హాయాంలో ఎన్డీఏ సర్కారు సాధించిన 243 విజయాలను పేర్కొంటూ పుస్తకాన్ని విడుదల చేశారు. 2019 సెప్టెంబర్ 17న తన మాతృమూర్తి హీరాబెన్‌ వద్ద ఆశీర్వాదం తీసుకుని ప్రధాని మోదీ తన పుట్టినరోజు కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం ‘నమామి నర్మదా’ ఉత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గతేడాది డిసెంబరులో ప్రధాని తల్లి కన్నుమూసిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ తన 68వ పుట్టినరోజును తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న వారణాసి పార్లమెంట్ నియోజకవర్గంలో జరుపుకున్నారు. ఈ సమయంలో కాశీ విశ్వనాథ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం నరోర్ ప్రాథమిక పాఠశాల పిల్లలతో ప్రధాని మోదీ సమావేశమయ్యారు







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com