ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చైనా 25 ఏళ్ల లోపు పెళ్లి చేసుకుంటే అమ్మాయిలకు రివార్డ్.. మొదటి పెళ్లికి మాత్రమే

international |  Suryaa Desk  | Published : Tue, Aug 29, 2023, 08:52 PM

‘ఒక్కరు ముద్దు.. అసలే వద్దు’ అనే నినాదంతో జనాభా నియంత్రణ చేపట్టిన చైనాలో జననాల రేటు దారుణంగా పడిపోయింది. గతేడాది అక్కడ జననాల రేటు ప్రతి 1,000 మందికి 6.77గా నమోదైంది. గత 60 ఏళ్లలో ఇంత తక్కువ నమోదుకావడం ఇదే మొదటిసారి. చైనా జననాల రేటు కొన్నేళ్లుగా క్షీణిస్తుండటంతో ఒకరినే కనాలనే విధానాన్ని 2016లో రద్దు చేసింది. అయినాసరే ప్రజల నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో స్థానిక యంత్రాంగాలు చర్యలు చేపడుతున్నాయి. తాజాగా, జెజియాంగ్ రాష్ట్రంలోని ఓ కౌంటీ సంచలన నిర్ణయం తీసుకుంది.


25 లేదా అంతకంటే తక్కువ వయసులో వివాహం చేసుకునే యువతులకు రివార్డు అందజేయనున్నట్టు చాంగ్షాన్‌ కౌంటీ ప్రకటించింది. ప్రస్తుతం తగ్గిపోతున్న జననాల రేటు చైనాను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలోనే యువతులు తగిన వయసులో వివాహం చేసుకుని, పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా చాంగ్షాన్‌ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. 25 ఏళ్లు లేదా అంతకంటే చిన్న వయసులో వివాహం చేసుకునే యువతులకు నగదు రివార్డు అందించనుంది.


అయితే అది మొదటి వివాహం అయి ఉండాలని షరతు విధించింది. నగదు పథకం కింద వెయ్యి యువాన్లు అందజేసి.. ఆ తర్వాత కూడా పిల్లల సంరక్షణ, విద్య విషయంలోనూ రాయితీలు కల్పించి ఆర్థికంగా సహకరించనుంది. ఈ మేరకు గతవారం చైనా సోషల్ మీడియా వుయ్‌చాట్‌లో చాంగ్షాన్ కౌంటీ అధికారికంగా వెల్లడించింది. చైనాలో మహిళల కనీస వివాహ వయసు 20 కాగా.. పురుషులకు 22గా ఉంది. చిన్న కుటుంబాల సంస్కృతి, జీవన వ్యయాలు పెరగడం, సాంస్కృతిక మార్పులు వంటి కారణాలతో వివాహం చేసుకునేవారి సంఖ్య తగ్గిపోతోంది. చైనా పౌర సంబంధాల వ్యవహారాల మంత్రిత్వశాఖ గతేడాది విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2021తో పోలిస్తే 2022లో వివాహం చేసుకునే వారి సంఖ్య 10.5 శాతం తగ్గిపోయింది. 2021లో 7.63 మిలియన్ల జంటలు వైవాహిక బంధంలోకి అడుగుపెడితే.. 2022లో ఈ సంఖ్య 6.8మిలియన్లగా ఉంది. 1986 తర్వాత చైనాలో నమోదైన వివాహాల్లో ఇదే అతి తక్కువ కావడం గమనార్హం.


అలాగే సంతానోత్పత్తి రేటు కూడా అతి తక్కువగా ఉంది. 2022లో అది 1.09కి పడిపోయిందని గణాంకాలు వెల్లడించాయి. చైనాలో గతేడాది తొలిసారిగా జననాల కంటే మరణాల రేటు పెరిగింది. 1976 తర్వాత చైనాలో అత్యధిక మరణాల రేటు 2022లో నమోదైంది. 1,000 మందికి 7.37 మరణాలు నమోదయ్యాయి. 2021లో ఇది 7.18గా ఉంది. ఇది దీర్ఘకాలంలో చైనా శ్రామిక శక్తిని తగ్గిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, ఇతర ఖర్చులపై భారాన్ని పెంచుతుంది. జపాన్, దక్షిణ కొరియా వంటి ఇతర తూర్పు ఆసియా దేశాలలో కూడా జనాభా తగ్గిపోతోంది. వృద్ధాప్యం పెరుగుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com