ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా దగ్గర 10 వేలు, 20 వేలు తీసుకునేటోడు..జగదీష్ రెడ్డి పై కోమటిరెడ్డి ఘాటు ఆరోపణలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 29, 2024, 07:37 PM

మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపై  సీఎం రేవంత్ రెడ్డితో పాటు కోమటిరెడ్డి సోదరులు  విమర్శలతో విరుచుకుపడ్డారు. అందులోనూ.. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి జగదీష్ రెడ్డికి మధ్య టైట్ ఫైట్ జరిగింది. సభలోనే కాకుండా లాబీలోనూ మీడియాతో మాట్లాడుతూ జగదీష్ రెడ్డిపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు విమర్శలు, ఆరోపణలు చేయటం గమనార్హం.


జగదీష్ రెడ్డి పెద్ద దొంగ అంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు ఆరోపణలు చేశారు. తెలంగాణ ఉద్యమం సమయంలో తన దగ్గర 10 వేలు, 20 వేలు తీసుకునేవాడని.. అలాంటిది ఈరోజు కోట్లకు పడగలెత్తాడంటూ ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో శంషాబాద్ దగ్గర 80 ఎకరాలు అక్రమంగా సంపాదించారని.. త్వరలోనే దానికి సంబంధించిన వివరాలు బయటపెడతానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. జగదీష్ రెడ్డిపై మర్డర్ కేసులున్నాయంటూ అసెంబ్లీలో తాను చేసిన ఆరోణపలు నిజమేనంటూ మంత్రి చెప్పుకొచ్చారు.


అసెంబ్లీలో చర్చ సమయంలో ఇద్దరి మధ్యా హాట్ హాట్‌గా విమర్శలు జరిగిన నేపథ్యంలో.. జగదీష్ రెడ్డిపై మర్డర్ కేసులు ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి ఆరోపించారు. నల్గొండలో జగదీష్ రెడ్డికి క్రిమినల్ రికార్డు ఉందని.. ఓ మర్డర్ కేసులో 16 ఏళ్ల పాటు కోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేశారంటూ కామెంట్ చేశారు.


కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందించిన జగదీష్ రెడ్డి.. కౌంటర్ ఇచ్చారు. తనపై చేసిన ఆరోపణలపై సవాల్‌కు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మొత్తం 3 కేసుల్లో కోర్టులు విచారణ చేపట్టి తనను నిర్దోషిగా తేల్చాయని స్పష్టం చేశారు. కోమటిరెడ్డి వ్యాఖ్యలను తక్షణమే రికార్డుల నుంచి తొలగించాలని స్పీకర్‌ను జగదీశ్ రెడ్డి కోరారు. ఒకవేళ క్రిమినల్ రికార్టును చూపిస్తే.. ముక్కు నేలకు రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. నిజంగా కేసీఆర్ సత్య హరిశ్చంద్రుడే అని.. సంచులు మోసిన చంద్రుడు మాత్రం కాదంటూ పరోక్షంగా సీఎం రేవంత్‌ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు జగదీష్ రెడ్డి.


జగదీష్ రెడ్డి వ్యాఖ్యలకు కోమటిరెడ్డి స్పందిస్తూ.. జగదీశ్ రెడ్డి సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు ప్రకటించారు. నిరూపించలేకపోతే తాను కూడా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని సంచలన ప్రకటన చేశారు. అసలు జగదీశ్ రెడ్డి గురించి మాట్లాడితే తమ గౌరవం పోతుందంటూ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విమర్శలు గుప్పించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com