ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రంగంలోకి గులాబీ బాస్ ఎంట్రీ.. పార్టీ ఫిరాయింపులపై కేసీఆర్ కొత్త వ్యూహం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 25, 2024, 07:30 PM

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రతిపక్షానికే పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల్లోనే ఊహించని పరిణామంతో పార్టీ తీవ్ర ఇబ్బందుల్లో పడగా.. పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా కూడా తెరవకుండా ఘోర పరాజయాన్ని మూటగట్టుకుని.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ క్రమంలోనే.. గులాబీ పార్టీలోని గల్లీ నేతల నుంచి మొదలు కీలక నాయకులంతా ఒక్కొక్కరిగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటుండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం హస్తం గూటికి చేరుకుంటున్నారు. దీంతో.. పార్టీ పరిస్థితి మరింత జటిలంగా మారింది. బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోందన్న వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో.. పార్టీని కాపాడుకునేందుకు గులాబీ బాస్ కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగారు.


అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు గెలుచుకుని ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండగా.. అందులో కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్యనందిత అకాల మరణంతో జరిగిన ఉపఎన్నికలో ఆ సీటు కూడా బీఆర్ఎస్ కోల్పోయింది. దీంతో.. సాంకేతికంగా బీఆర్ఎస్‌ ఖాతాలో 38 సీట్లు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య మెల్లగా తగ్గుతూ వస్తోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందే స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవటమే కాకుండా ఆ పార్టీ నుంచి ఎంపీగా కూడా పోటీ చేశారు. మరోవైపు.. భద్రాచలం ఎమ్మల్యే తెల్లం వెంకట్రావు కూడా హస్తం గూటికి చేరుకున్నారు.


ఇదంతా ఒక ఎత్తయితే.. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడు, సీనియర్ నేత, మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.. కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఊహించని షాక్ ఇచ్చారు. మరో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా.. కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో.. గులాబీ పార్టీ అధిష్ఠానం అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తమ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తుండగా.. ఇప్పుడు కేసీఆరే స్వయంగా రంగంలోకి దిగి.. తనదైన వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.


ఈ క్రమంలోనే.. ఎర్రవెల్లిలోని తన ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజాగా నెలకొన్న రాజకీయ పరిణామాలతో పాటు పార్టీ ఫిరాయింపులపై చర్చించినట్టు సమాచారం. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ మారడాన్ని అస్సలు పట్టించుకోవద్దని.. కొందరు స్వార్థపరులు వెళ్లిపోయినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదంటూ చెప్పినట్టు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగినా.. భయపడలేదని గుర్తుచేశారు.


భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌కు మళ్లీ మంచి రోజులు వస్తాయని.. ఎవరూ తొందరపడొద్దని ఎమ్మల్యేలకు గులాబీ బాస్ సూచించినట్టు సమాచారం. రేపట్నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని చెప్పినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు చేజారిపోకుండా ఉండేందుకు.. నిత్యం టచ్‌లో ఉండి కాపాడుకునే కొత్త వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తున్నట్టు సమాచారం. ఇన్ని రోజులూ.. పార్టీ నాయకత్వం తమకు అందుబాటులో ఉండదంటూ తమపై ఉన్న ఆరోపణలు తిప్పికొట్టటంతో పాటు.. ప్రభుత్వ తీరుపై తమ కార్యచరణను నిత్యం వారితో చర్చించటం ద్వారా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను కాపాడుకోవాలని చూస్తున్నట్టు సమాచారం.


మరోవైపు.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని కేసీఆర్ ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని.. ఈ విషయాలపై బీఆర్ఎస్ తరపున పోరాడాలంటూ దిశానిర్దేశం చేసినట్టు సమాచారం. ఈ భేటీలో ఎమ్మెల్యేలు హరీష్ రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌ రెడ్డి, దండె విఠల్‌, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్‌, రావుల శ్రీధర్‌ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్‌ మధ్యాహ్నా భోజనం కూడా చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com