ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా అధ్యక్షుడి జీతం, పెన్షన్ తెలిస్తే షాక్.. ఇతర సౌకర్యాలు ఏమేం ఉంటాయంటే

international |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 11:35 PM

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా అమెరికాకు పేరుంది. ఇక అగ్రరాజ్య అధిపతి అంటే ప్రపంచ దేశాలలోనే అత్యంత పవర్‌ఫుల్ స్థానం. అయితే అలాంటి అమెరికా అధ్యక్షుడికి జీతం ఎంత వస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వారికి లభించే సౌకర్యాలు ఎలా ఉంటాయి. అధ్యక్ష పదవి నుంచి దిగిపోయిన తర్వాత ఎంత పెన్షన్ లభిస్తుంది అనేది అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ తీవ్ర చర్చకు దారితీస్తోంది. నెల జీతంగా రూ.3.36 కోట్లు అమెరికా అధ్యక్షుడి ఖాతాలోకి వెళ్తుండగా.. మొత్తంగా అలవెన్సులతో కలిపి రూ.4.78 కోట్లు ప్రతీ సంవత్సరం పొందుతారు.


అమెరికా అధ్యక్షుడికి ఏడాదికి 4 లక్షల డాలర్లు అంటే మన భారత కరెన్సీలో అక్షరాలా రూ.3.36 కోట్లు వేతనం కింద పొందుతారు. అంటే నెలకు దాదాపుగా రూ.28 లక్షలు జీతం తీసుకుంటారు. 2001లో ట్రెజరీ అప్రాప్రియేషన్ బిల్లులోని నిబంధనల ప్రకారం అమెరికా అధ్యక్షుడి వార్షిక ఆదాయాన్ని నిర్ణయించారు. అయితే అంతకుముందు 30 ఏళ్ల పాటు అమెరికా అధ్యక్షుడికి 2 లక్షల డాలర్లు అంటేగా భారత కరెన్సీలో రూ.1.69 కోట్లుగా ఉండేది. ఇక అమెరికా ఖర్చుల కింద ఏటా మరో 50 వేల డాలర్లు అంటే రూ.42 లక్షలు అందుకుంటారు. ఇక ట్యాక్స్‌ కిందకు రాని ట్రావెల్ ఖర్చుల కింద ఏడాదికి లక్ష డాలర్లు అంటే రూ.84 లక్షలు తీసుకుంటారు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్ కోసం సంవత్సరానికి 19 వేల డాలర్లు అంటే రూ.16 లక్షలు చెల్లిస్తారు. దీంతో మొత్తంగా అమెరికా అధ్యక్షుడు జీతం, ఇతర అలవెన్సులు కలిపి ఏడాదికి 5.69 లక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.4.78 కోట్లు అందుకుంటారు. ఇక అమెరికా చట్టాల ప్రకారం.. ఖర్చుల కోసం ఇచ్చిన 50 వేల డాలర్లలో ఖర్చు చేయని సొమ్మును తిరిగి ఖజానాకు జమ చేయాల్సి ఉంటుంది.


 ఇవే కాకుండా అమెరికా అధ్యక్షుడు ఎక్కడికి వెళ్లినా ప్రిసిడెన్షియల్ లిమోసిస్, ది బీస్ట్, మెరైన్ వన్, ఎయిర్ ఫోర్స్ వన్ వంటి కార్లు, విమానాల ద్వారా ఉచిత ప్రయాణ సౌకర్యం ఉంటుంది. అమెరికా అధ్యక్ష పగ్గాల చేపట్టినవారికి వైట్‌హౌజ్‌ను నివాస భవనంగా కేటాయిస్తారు. అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత వైట్‌హౌజ్‌ను వారికి ఇష్టం ఉన్న రీతిలో అలంకరించుకునేందుకు మరో లక్ష డాలర్లు అంటే రూ.84 లక్షలు ఖర్చు చేసుకునేందుకు వీలు ఉంటుంది. మరోవైపు.. అమెరికా అధ్యక్షుడికి వైట్‌హౌస్‌లో వంట, ఇతర పనుల కోసం 100 మంది సహాయకులు ఉంటారు. వారిలో అధ్యక్షుడికి భోజనాన్ని తయారు చేసేందుకు ఎగ్జిక్యూటివ్ చెఫ్, ఎగ్జిక్యూటివ్ పేస్ట్రీ చెఫ్‌లు ఉంటారు. వైట్‌హౌజ్‌లో పని మనిషి, ప్లంబర్, ఫ్లోరిస్ట్, హెచ్ హౌజ్ కీపర్‌ సహా 100 మంది సాధారణ పనివాళ్లు ఉంటారు.


అమెరికా అధ్యక్షుడిగా పనిచేసి.. పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ఇతర ప్రయోజనాలు పొందుతారు. మాజీ అధ్యక్షుడికి 2.30 లక్షల డాలర్లు అంటే రూ.1.93 కోట్లు వార్షిక పెన్షన్ అందిస్తారు. ప్రస్తుతం మాజీ అధ్యక్షుడిగా ఉన్న డొనాల్డ్ ట్రంప్ రూ.1.93 కోట్లను వార్షిక పెన్షన్‌గా పొందుతున్నాడు. ఇది క్యాబినెట్ సెక్రటరీ పెన్షన్‌కి సమానం. వీటితోపాటు హెల్త్ సౌకర్యాలు, ట్రావెల్ సౌకర్యాలు కల్పిస్తారు. మరోవైపు.. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన వారికి ప్రస్తుతం వార్షిక వేతనం 2,35,100 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1.97 కోట్లుగా ఉంది. గతంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దీన్ని 2,43,500 డాలర్లకు అంటే భారత కరెన్సీలో రూ.2.04 కోట్లకు పెంచేందుకు ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com